హైదరాబాద్‌లో ‘జినీ’ క్యాబ్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రవాణా సేవలందిస్తున్న మేరు క్యాబ్ తాజాగా ‘జినీ’ పేరుతో మధ్యతరగతి వారికోసం నూతన క్యాబ్ సర్వీసులను హైదరాబాద్‌లో ప్రారంభించింది. ఏసీ సౌకర్యం ఉన్న జినీ క్యాబ్ సేవల్లో భాగంగా కిలోమీటరుకు రూ.16 చార్జీ చేస్తారు. రాత్రివేళ కిలోమీటరుకు రూ.20 వసూలు చేస్తారు. కస్టమర్లు ఒకటి రెండు కిలోమీటర్ల దూరం వెళ్లాలన్నా జినీ సేవలు వినియోగించుకోవచ్చు. కనీస చార్జీ రూ.100 మాత్రమే(గరిష్టంగా 6 కిలోమీటర్లు). ప్రస్తుతం హైదరాబాద్‌లో క్యాబ్ ఏజెన్సీలు కనీస చార్జీ రూ.150-200 వసూలు చేస్తున్నాయి. నగర రవాణా విభాగంలో జినీ సంచలనం సృష్టిస్తుందని మేరు క్యాబ్ ఎండీ నీరజ్ గుప్తా ఈ సందర్భంగా బుధవారమిక్కడ మీడియాకు తెలిపారు. నలుగురు ప్రయాణికులు కూర్చునే వీలున్న ఫోర్డ్ ఫిగో, టయోటా లివా వంటి కార్లను వినియోగిస్తామన్నారు. కాగా, ప్రారంభోత్సవ కార్యక్రమంలో సినీ నటి చార్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఇతర నగరాలకూ: జినీ సేవల్లో భాగంగా హైదరాబాద్‌లో తొలుత 50 కార్లను ప్రవేశపెట్టారు. 9 నెల ల్లో వీటి సంఖ్యను 500కు చేరుస్తామని కంపెనీ సీఈవో సిద్ధార్థ పాహ్వా చెప్పారు. ‘రాష్ట్రంలో ఆటో చార్జీ కిలోమీటరుకు రూ.11 ఉంది. క్యాబ్‌కు రూ.21 చెల్లించాలి. రూ.11-21 మధ్య అంతరం చాలా ఉంది. అందుకే జినీ బ్రాండ్‌ను ప్రవేశపెట్టాం’ అని అన్నారు. వైజాగ్‌తోసహా దేశవ్యాప్తంగా ఇతర ప్రధాన నగరాలకు విస్తరిస్తామని తెలిపారు. మేరు క్యాబ్‌కు మొత్తం 5,500 కార్లున్నాయి. రాష్ట్రం నుంచి 20 శాతం ఆదాయం సమకూరుతోందని కంపెనీ డిప్యూటీ జీఎం వి.నాగ కిషోర్ పేర్కొన్నారు. ఖరీదైన వాహనాలతో కూడిన మేరు ప్లస్ సేవలను హైదరాబాద్‌లో ఆరు నెలల్లో పరిచయం చేయనున్నారు. దేశంలో టూర్, ట్యాక్సీ ఆపరేటర్ల వద్ద సుమారు 20 లక్షల కార్లున్నాయి.