మూడు గ్రామాల్లో వరుస చోరీలు
యలమంచిలిలంక (యలమంచిలి) : యలమంచిలిలంక, శిరగాలపల్లి, మేడపాడు గ్రామాలలో గురువారం రాత్రి వరుస చోరీలు జరిగాయి. యలమంచిలిలంకలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామి విగ్రహానికి ఉన్న వెండి కన్ను, బొట్టును దుండగులు పెకిలించారు. వాటిని తీసుకెళ్లకుండా అక్కడే వదిలేశారు. గుడిలోని సుమారు రూ.4 వేల విలువైన పంచలోహ పాత్రతోపాటు, రూ.2 వేలు చిల్లర పట్టుకుపోయారు. శిరగాలపల్లిలోని షిర్డీ సాయిబాబా మందిరంలోనూ డిబ్బీ పట్టుకుపోయారు. డిబ్బీలోని డబ్బులు తీసుకుని దానిని పక్కనే ఉన్న వరిచేలో పడవేశారు. శిరగాలపల్లిలోని ఓ కొబ్బరికాయల కొట్టులో బీరువా తాళాలు పగులగొట్టారు. బీరువాలో నగదు లేకపోవడంతో వెళ్లిపోయారు. పక్కనే ఉన్న బెల్టు షాపులో మద్యం సీసాలను పట్టుకుపోయారు. మేడపాడులో ఒక కోళ్ల దుకాణంలోని గల్లా పెట్టెను పగులకొట్టి దానిలో ఉన్న చిల్లర తీసుకెళ్లారు. ఇవన్నీ ఒకే దొంగలముఠా చేసినట్టు అనుమానిస్తున్నారు. మూడు గ్రామాల్లో వరుసగా చోరీలు జరగడంతో స్థానికులు బెంబేలెత్తుతున్నారు. ఎస్సై పాలవలస అప్పారావు ఘటనా స్థలాలను పరిశీలించారు.