Metallurgical
-
జానపాడు టు సౌత్ కొరియా.. ఓ యువకుడి విజయగాధ
సాక్షి, అమరావతి బ్యూరో: దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ముందు చూపు, తల్లిదండ్రుల ఆకాంక్షకు తోడు కృషి, పట్టుదల ఓ యువకుడిని అందలం ఎక్కించింది. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం జానపాడులోని ఓ పేద కుటుంబానికి చెందిన పసుపులేటి లక్ష్మీనారాయణ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో మొగ్గ తొడిగి సౌత్ కొరియాలోని జియోన్‌గ్సాంగ్ నేషనల్ యూనివర్సిటీలో వికసించాడు. కొరియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెటీరియల్ సైన్స్‌లో మెటలర్జికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ విభాగంలో ఈ నెల 25న పీహెచ్డీ పట్టా అందుకోనున్నాడు. ‘మా పిల్లల జీవితం మాలాగ సున్నపుబట్టీలో మగ్గిపోకూడదు’ అనుకున్న ఇతని తల్లిండ్రులు కష్టపడి టెన్త్ వరకు చదివించారు. అనంతరం ట్రిపుల్ ఐటీలో ఇతనికి సీటు వచ్చింది. ఆరేళ్లు అన్నీ ఉచితమే.. 2019లో నూజివీడు ట్రిపుల్ ఐటీలో చేరిన లక్ష్మీ నారాయణ ఇంటర్, బీటెక్ అక్కడే పూర్తి చేశాడు. ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకునే వరకు తల్లిదండ్రులకు రూపాయి ఖర్చు కాలేదు. మెటలర్జీ సబ్జెక్టుపై పరిశోధన పట్ల ఇతడికి ఆసక్తి. ఇదే ఊరి నుంచి సౌత్ కొరియా వెళ్లి పరిశోధన చేస్తున్న హరిబాబు మార్గదర్శనంతో అక్కడి యూనివర్సిటీలలో పీజీ, పీహెచ్డీ సీటు కోసం దరఖాస్తు చేశాడు. స్కాలర్‌షిప్‌తో సీటు వచ్చింది. అయితే సౌత్ కొరియాకు వెళ్లడానికి డబ్బు కావాలి. ఇందుకోసం ఇతని తల్లి చెవి కమ్మలు తీసి అమ్మింది. ఆ మొత్తం సరిపోదు. దీంతో దొరికన చోట శక్తికొద్దీ అప్పు తెచ్చాడు తండ్రి. మొత్తం రూ.30 వేలు చేతిలో పెట్టారు. ‘చాలా మందికి అది చాలా చిన్న మొత్తమే కావచ్చు. నాకు మాత్రం అది కోటానుకోట్ల కంటే ఎక్కువ. అమ్మ చెవి కమ్మలు తీస్తుంటే బాధ అనిపించింది. ఒద్దు అని చెప్పలేని పరిస్థితి. ఆ డబ్బుతో తొలిసారి విమానం ఎక్కాను. ఏడాదిన్నరలో అప్పులు తీర్చాను. కొత్త కమ్మలు కొనుక్కోవడానికి అమ్మకు డబ్బులు పంపాను. ఈ రోజు నా విజయం వెనుక నా తల్లిదండ్రులు, మహానేత వైఎస్సార్, నాకు సీటు కోసం రికమెండ్ చేసిన జింజు యూనివర్సిటీ ప్రొఫెసర్ సుబ్బారెడ్డిలను మరచిపోలేను’అని లక్షీనారాయణ చెప్పారు. ఎంతో మందికి ఉపయోగపడాలన్నదే నా లక్ష్యం ఆరేళ్లలో 23 పబ్లికేషన్లు సమర్పించాను. మెటలర్జీలో టైటానియం త్రీడీ ప్రింటింగ్‌లో సాగుతున్న నా పరిశోధనలు ఏరోస్పేస్ రంగంలో, వైద్య విభాగంలో మంచి ఆవిష్కరణలు కానున్నాయి. గుండె వాల్వులు, మోకీలుకు, బోన్ రీప్లేస్‌మెంట్‌కు అమర్చే లోహపు పరికరాల తయారీలో మంచి ఫలితాలనిస్తాయి. ఏరో స్పేస్‌లో పెద్ద మెషినరీలో రిపేర్ వస్తే ఆ యంత్రాన్ని డిస్మాంటిల్ చేయాల్సిన పని లేకుండా పని చేయని భాగానికి మాత్రమే మరమ్మతు చేయడం సాధ్యమవుతుంది. నా మేధస్సుతో ఎంతో మందికి ఉపయోగపడాలన్నదే నా లక్ష్యం. – లక్ష్మీనారాయణ -
ఎల్అండ్టీ లాభం 1,241 కోట్లు
ముంబై: ఇన్ఫ్రాస్ట్రక్చర్ దిగ్గజం ఎల్అండ్టీ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3(అక్టోబర్-డిసెంబర్)లో రూ. 1,241 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2012-13) ఇదే కాలంలో ఆర్జించిన రూ. 1,013 కోట్లతో పోలిస్తే ఇది 22%పైగా వృద్ధి. స్టాండెలోన్ ఫలితాలివి. ద్రవ్యోల్బణం, విధానాల్లో అనిశ్చితి వంటి అంశాలు పెట్టుబడుల సెంటిమెంట్‌ను దెబ్బకొట్టినట్లు కంపెనీ సీఎఫ్‌వో శంకర్ రామన్ పేర్కొన్నారు. ఈ కాలంలో ముంబై హైకోర్ట్ నుంచి అనుమతి లభించడంతో హైడ్రోకార్బన్ బిజినెస్‌ను సొంత అనుబంధ సంస్థ ఎల్అండ్టీ హైడ్రోకార్బన్ ఇంజినీరింగ్‌కు బదిలీ చేసింది. దీంతో ఈ బిజినెస్‌ను 2013 ఏప్రిల్ నుంచి కొత్త కంపెనీ ఖాతాలో నమోదు చేయనుంది. కాగా, ఈ కాలంలో అమ్మకాలు దాదాపు 12% పెరిగి రూ. 14,388 కోట్లకు చేరాయి. హైడ్రోకార్బన్ బిజినెస్ ఆదాయం దీనిలో కలపలేదని కంపెనీ తెలిపింది. ఓ అనుబంధ కంపెనీలో కొంతమేర వాటాను విక్రయించడం ద్వారా రూ. 104.4 కోట్ల అనూహ్య లాభాలు అందుకున్నట్లు, ఇతర ఆదాయం రూ. 447 కోట్లకు చేరినట్లు తెలిపింది. గెడైన్స్ తగ్గింపు పెట్టుబడుల వాతావరణం బలహీనంగా ఉన్నప్పటికీ క్యూ3లో ఆర్డర్లు 21% ఎగసి రూ. 21,722 కోట్లను తాకినట్లు రామన్ చెప్పారు. వెరసి డిసెంబర్ చివరికి మొత్తం ఆర్డర్ బుక్ విలువ 13% బలపడి రూ. 1,71,184 కోట్లకు చేరినట్లు తెలిపారు. వీటిలో విదేశీ ఆర్డర్ల వాటా 15%గా పేర్కొన్నారు. క్యూ3లో ఇన్ఫ్రా రంగం నుంచి 36% అధికంగా ఆర్డర్లు లభించినట్లు తెలిపారు. వీటి విలువ రూ. 18,390 కోట్లుకాగా, వీటిలో విదేశీ వాటా 41%గా వెల్లడించారు. విద్యుత్, మెటలర్జికల్, మెటీరియల్ హ్యాండ్లింగ్(ఎంఎంహెచ్) విభాగాల నుంచి ఆర్డర్లు భారీగా క్షీణించినట్లు తెలిపారు. స్థూల ఆర్థిక వాతావరణం ప్రతికూలంగా ఉండటంతో ఆర్డర్లరాక తగ్గుతుందని అంచనా వేస్తున్నట్లు శంకర్ రామన్ చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఆదాయ అంచనాలను సాధించడం కష్టమేనని వ్యాఖ్యానించారు. పూర్తి ఏడాదికి అమ్మకాల్లో 15%, ఆర్డర్లను సాధించడంలో 20% వృద్ధిని కంపెనీ ఇంతక్రితం అంచనా వేసింది. అయితే ఆర్డర్ల లక్ష్యాన్ని 15%కు తగ్గిస్తున్నట్లు రామన్ చెప్పారు. లక్ష్యాన్ని చేరుకునేందుకు ఇప్పటివరకూ రూ. 57,000 కోట్ల విలువైన ఆర్డర్లు లభించినప్పటికీ, మరో రూ. 30,000 కోట్ల కాంట్రాక్ట్‌లను సాధించాల్సి ఉన్నదని చెప్పారు. ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు ధర బీఎస్ఈలో 0.7% తగ్గి రూ. 1,005 వద్ద ముగిసింది.