ఎల్‌అండ్‌టీ లాభం 1,241 కోట్లు | L&T Q3 net rises 11% to Rs 1241 cr | Sakshi
Sakshi News home page

ఎల్‌అండ్‌టీ లాభం 1,241 కోట్లు

Published Thu, Jan 23 2014 2:48 AM | Last Updated on Sat, Sep 2 2017 2:53 AM

ఎల్‌అండ్‌టీ లాభం 1,241 కోట్లు

ఎల్‌అండ్‌టీ లాభం 1,241 కోట్లు

ముంబై: ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ దిగ్గజం ఎల్‌అండ్‌టీ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3(అక్టోబర్-డిసెంబర్)లో రూ. 1,241 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2012-13) ఇదే కాలంలో ఆర్జించిన రూ. 1,013 కోట్లతో పోలిస్తే ఇది 22%పైగా వృద్ధి. స్టాండెలోన్ ఫలితాలివి. ద్రవ్యోల్బణం, విధానాల్లో అనిశ్చితి వంటి అంశాలు పెట్టుబడుల సెంటిమెంట్‌ను దెబ్బకొట్టినట్లు కంపెనీ సీఎఫ్‌వో శంకర్ రామన్ పేర్కొన్నారు. ఈ కాలంలో ముంబై హైకోర్ట్ నుంచి అనుమతి లభించడంతో హైడ్రోకార్బన్ బిజినెస్‌ను సొంత అనుబంధ సంస్థ ఎల్‌అండ్‌టీ హైడ్రోకార్బన్ ఇంజినీరింగ్‌కు బదిలీ చేసింది.

దీంతో ఈ బిజినెస్‌ను 2013 ఏప్రిల్ నుంచి కొత్త కంపెనీ ఖాతాలో నమోదు చేయనుంది. కాగా, ఈ కాలంలో అమ్మకాలు దాదాపు 12% పెరిగి రూ. 14,388 కోట్లకు చేరాయి. హైడ్రోకార్బన్ బిజినెస్ ఆదాయం దీనిలో కలపలేదని కంపెనీ తెలిపింది. ఓ అనుబంధ కంపెనీలో కొంతమేర వాటాను విక్రయించడం ద్వారా రూ. 104.4 కోట్ల అనూహ్య లాభాలు అందుకున్నట్లు, ఇతర ఆదాయం రూ. 447 కోట్లకు చేరినట్లు తెలిపింది.

 గెడైన్స్ తగ్గింపు
 పెట్టుబడుల వాతావరణం బలహీనంగా ఉన్నప్పటికీ క్యూ3లో ఆర్డర్లు 21% ఎగసి రూ. 21,722 కోట్లను తాకినట్లు రామన్ చెప్పారు. వెరసి డిసెంబర్ చివరికి మొత్తం ఆర్డర్ బుక్ విలువ 13% బలపడి రూ. 1,71,184 కోట్లకు చేరినట్లు తెలిపారు. వీటిలో విదేశీ ఆర్డర్ల వాటా 15%గా పేర్కొన్నారు. క్యూ3లో ఇన్‌ఫ్రా రంగం నుంచి 36% అధికంగా ఆర్డర్లు లభించినట్లు తెలిపారు. వీటి విలువ  రూ. 18,390 కోట్లుకాగా, వీటిలో విదేశీ వాటా 41%గా వెల్లడించారు.

 విద్యుత్, మెటలర్జికల్, మెటీరియల్ హ్యాండ్లింగ్(ఎంఎంహెచ్) విభాగాల నుంచి ఆర్డర్లు భారీగా క్షీణించినట్లు తెలిపారు. స్థూల ఆర్థిక వాతావరణం ప్రతికూలంగా ఉండటంతో ఆర్డర్లరాక తగ్గుతుందని అంచనా వేస్తున్నట్లు శంకర్ రామన్ చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఆదాయ అంచనాలను సాధించడం కష్టమేనని వ్యాఖ్యానించారు. పూర్తి ఏడాదికి అమ్మకాల్లో 15%, ఆర్డర్లను సాధించడంలో 20% వృద్ధిని కంపెనీ ఇంతక్రితం అంచనా వేసింది.

అయితే ఆర్డర్ల లక్ష్యాన్ని 15%కు తగ్గిస్తున్నట్లు రామన్ చెప్పారు. లక్ష్యాన్ని చేరుకునేందుకు ఇప్పటివరకూ రూ. 57,000 కోట్ల విలువైన ఆర్డర్లు లభించినప్పటికీ, మరో రూ. 30,000 కోట్ల కాంట్రాక్ట్‌లను సాధించాల్సి ఉన్నదని చెప్పారు. ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు ధర బీఎస్‌ఈలో 0.7% తగ్గి రూ. 1,005 వద్ద ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement