Metropolitan Development
-
‘డబ్బు’ల్ ధమాకా!
మణికొండ(హైదరాబాద్): హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) అక్రమాలకు అంతులేకుండాపోతోంది. మాస్టర్‌ప్లాన్‌లో రోడ్డుగా చూపిన స్థలంలో బహుళ అంతస్తు భవనానికి అనుమతి ఇచ్చిన ఘటన మరువకముందే తాజాగా మరో ఘటన వెలుగుచూసింది. ఒక లేఔట్‌కు అనుమతి జారీ చేసిన హెచ్ఎండీఏ.. అందులోని ప్రజావసరాలకు వదిలిన స్థలాన్ని కలుపుకొని మరో లేఔట్‌కు పర్మిషన్ ఇచ్చింది. రెండో లేఔట్ జారీ చేసేనాటికే.. ఈ ఖాళీ స్థలం స్థానిక గ్రామ పంచాయతీకి గిఫ్డ్‌డీడ్ కింద రిజిస్ట్రేషన్ కూడా కావడం గమనార్హం. హెచ్ఎండీఏ చేసిన తప్పును ఎత్తిచూపాల్సిన స్థానిక పురపాలక సంఘం.. లేఔట్ కాపీని పట్టించుకోకుండా తమ పేరిట రిజిష్టర్ అయిన ఖాళీ స్థలంలో వేరొకరికి బిల్డింగ్ పర్మిషన్ను జారీ చేసింది. భవన నిర్మాణ అనుమతి సమయంలో స్థల యజమాని ఎవరనేది కూడా చూడకుండా మున్సిపాలిటీ గుడ్డిగా వ్యవహరించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ అవినీతి భాగోతం ఐటీ హబ్ సమీపంలోని మణికొండ పురపాలిక పరిధిలో జరిగింది. సుమారు రూ.50 కోట్ల విలువైన భూమికి స్కెచ్ వేసిన రియల్టర్లకు కొందరు పెద్దలు, అధికారులు కూడా తోడు కావడంతో భవన నిర్మాణానికి పునాది పడింది. పంచాయతీ పేర రిజిస్ట్రేషన్ 17.36 ఎకరాల విస్తీర్ణంలో వేసిన తిరుమలహిల్స్ లేఔట్లో 8,633 గజాలను పార్కు స్థలాలుగా నిర్దేశించారు. ఈ మేరకు ఈ విస్తీర్ణాన్ని స్థానిక పంచాయతీకి 1993లో గిఫ్ట్‌డీడ్ కూడా చేశారు. మూడేళ్ల క్రితం ఈ పంచాయతీ మణికొండ మున్సిపాలిటీలో విలీనం కావడంతో డాక్యుమెంట్లను ఇక్కడకు బదలాయించారు. విలువైన ఈ స్థలాన్ని కాపాడుకోవాల్సిన మున్సిపల్ యంత్రాంగం.. కనీసం కంచె కూడా వేయకుండా వదిలేసింది. అంతేగాకుండా.. ఈ స్థలాన్ని చూపుతూ మరో లేఔట్ వెలిసినా చోద్యం చూస్తూ ఉండిపోయింది. దీంతో బిల్డర్ల ఆటలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. అంతేకాదు.. నిబంధనలకు విరుద్ధంగా వేసిన రెండో లేఔట్లో ఇళ్ల నిర్మాణాలకు టౌన్‌ప్లానింగ్ విభాగం పర్మిషన్లు జారీ చేస్తుండటం విశేషం. స్కెచ్ వేశారు.. చెక్కేశారు పుప్పాలగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 87, 119లో 17.36 ఎకరాలలో తిరుమల్హిల్స్ పేరిట 1990లో హైదరాబాద్ నగరాభివృద్ధి సంస్థ (హుడా) 10132/ఎంపీ2/హుడా/1990 పేరిట లేఔట్‌కు అనుమతి ఇచ్చింది. హుడా అనుమతి ఇచ్చిన వెంచర్ కావడం.. నగరానికి దగ్గరగా ఉండటంతో ఇక్కడి ప్లాట్లు హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. క్రమేణా ఈ వెంచర్ కాస్తా సంపన్నుల కాలనీగా మారింది. దీంతో ఖాళీ స్థలాలపై పాత రియల్టర్ల కన్ను పడింది. పాత వెంచర్‌లోని ఖాళీ స్థలాలకు పక్కనే మరికొంత స్థలాన్ని (వేరే యజమాని) కలుపుకొని రెండో లేఔట్‌కు ప్రణాళిక రచించారు. హెచ్ఎండీఏ అధికారులతో కుమ్మక్కై 6 వేల గజాల పార్కు స్థలాన్ని (మొదటి లేఔట్లో చూపిన) కాజేసే ఎత్తుగడకు తెర లేపారు. రెండో లేఔట్ ప్రకారం స్థలాలను అమ్మేసి రియల్టర్లు చెక్కేశారు. తాజాగా ఈ ప్లాట్లను కొన్నవారు ఇళ్ల నిర్మాణాలకు రావడం.. మొదటి లేఔట్లో కొనుగోలు చేసినవారు వీరిని అడ్డుకోవడంలో అసలు కథ బయటపడింది. మరో విచిత్రమేమిటంటే.. రెండో లేఔట్లో నిబంధనలకు అనుగుణంగా కేటాయించాల్సిన పార్కు స్థలాన్ని పక్కనే ఉన్న అజయ్హిల్స్ కాలనీ పార్కును చూపడం. అధికారుల వైఫల్యం హుడా అనుమతులతో వచ్చిన లేఔట్లో పార్కు స్థలాలను అప్పటి పంచాయతీ పేరుతో రిజిస్ట్రేషన్ చేసినా వాటిని పరిరక్షించడంలో అధికారుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. గతంలోనే ప్రహరీ నిర్మాణం చేస్తే ఇన్ని ఇబ్బందులు వచ్చేవి కావు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలి. – డాక్టర్ పి.అవినాష్, తిరుమలహిల్స్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసు ఉండగా అనుమతులా..? తమ కాలనీ పార్కు స్థలాలుగా చూపిన దాన్నే తిరిగి హెచ్ఎండీఏ అధికారులు లేఔట్‌కు అనుమతి ఇవ్వటం దారుణం. దాన్ని రద్దుచేశామని ఒకవైపు చెబుతునే మరోవైపు మున్సిపాలిటీ అధికారులు నిర్మాణ అనుమతులు ఇవ్వటం మరింత దారుణం. సదరు భూమి విషయం కోర్టులో ఉన్నా ఇలాంటి చర్యలు జరగటాన్ని ప్రభుత్వం సమర్ది్థస్తుందా..? లేదంటే అలాంటి అధికారులపై కఠినంగా వ్యవహరిస్తేనే ప్రభుత్వం, శాఖలపై నమ్మకం పెరుగుతుంది. – రంగాచారి, తిరుమలహిల్స్ సంక్షేమ సంఘం ప్రధానకార్యదర్శి నిబంధనల ప్రకారమే అనుమతులు హెచ్ఎండీఏ జారీ చేసిన లేఔట్ కావడంతోనే భవన నిర్మాణానికి అనుమతులు జారీ చేశాం. సదరు లేఔట్ రద్దు అయిన విషయం తెలియదు. కాలనీవాసులు పేర్కొంటున్న పార్కు భూమి కోర్టు వివాదంలో ఉండటంతో దాన్ని పరిరక్షించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నాం. గతంలో గ్రామపంచాయతీగా ఉన్నప్పటి నుంచే దానిపై వివాదాలు కోర్టులో ఉన్నాయి. – ఎస్.జయంత్, కమిషనర్, మణికొండ మున్సిపాలిటీ -
పక్కా‘ప్లాన్’
- అక్రమాలకు చెక్ - భూ వినియోగ మార్పిడికి ఇక స్వస్తి - త్రిసభ్య కమిటీ నియామకం - రంగంలోకి దిగిన హెచ్ఎండీఏ సాక్షి, సిటీబ్యూరో : హైదరాబాద్ మహా నగర అభివృద్ధికి బాటలు వేస్తూ గతంలో రూపొందించిన మాస్టర్‌ప్లాన్ (బృహత్ ప్రణాళిక)ను పక్కాగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నగరానికి చుట్టుపక్కల ఉన్న నాలుగు జిల్లాల్లోని 35 మండలాలను కలుపుతూ రూపొందించిన ఈ మాస్టర్‌ప్లాన్ పరిధి మొత్తం 5965చ.కి.మీ. ఉంది. ప్రధానంగా బృహత్ ప్రణాళికలో భూ వినియోగ మార్పిడికి వెసులుబాటు కల్పించడం వల్లే కొందరు అక్రమార్కులు దీన్ని ఆదాయ వనరుగా మార్చుకున్నారని... ఫలితంగా ప్రణాళిక అసలు ఉద్దేశం నెరవేరట్లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. ‘మాస్టర్‌ప్లాన్’ పక్కాగా లేకపోవడం వల్లే హెచ్ఎండీఏ అక్రమాల పుట్టగా మారింది. ప్రణాళికలో మార్పులు చేయకుండా హెచ్ఎండీఏలో ఆటోమిషన్ (ఆన్లైన్ అప్రూవల్స్) విధానాన్ని ప్రవేశపెట్టడం వల్ల ప్రయోజనం ఉండదు. మొదట మాస్టర్‌ప్లాన్‌ను పకడ్బందీగా తీర్చిదిద్దితే.. ఇలాంటి అక్రమాలకు తావుండదు. అందుకే దాని పై ప్రత్యేక దృష్టి పెట్టండి’ అంటూ ఇటీవల జరిగిన హెచ్ఎండీఏ సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్ఎండీఏ అధికారులను ఆదేశించారు. అవసరమైతే హెచ్ఎండీఏ యాక్ట్ (చట్టాన్ని)ను కూడా సవరించాలని సూచించారు. ముంబయ్, ఢిల్లీ, బెంగళూరు మాస్టర్ప్లాన్లను పరిశీలించాక మన మాస్టర్‌ప్లాన్‌లో మార్పులకు గల అవకాశాలు, సాధ్యాసాధ్యాలపై అధ్యయనం జరిపి నివేదికివ్వాలని సీఎం ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేకంగా సీఎంఓ ముఖ్యకార్యదర్శి నర్సింగరావు, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి ఎంజీ గోపాల్, హెచ్ఎండీఏ కమిషనర్ శాలిని మిశ్రాలతో కూడిన త్రిసభ్య కమిటీని నియమించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న బృహత్ ప్రణాళికలో భూ వినియోగాన్ని 12 రకాలుగా గుర్తించారు. అయితే... అందులో భూ వినియోగ మార్పిడికి అవకాశం కల్పిస్తూ విధి విధానాలు పొందుపర్చడం వల్ల ప్రణాళిక రూపమే మారిపోతోంది. కన్జర్వేషన్ జోన్ కాస్త రెసిడెన్షియల్ జోన్... లేదంటే ఇండస్ట్రియల్ జోన్, మల్టీపుల్ జోన్‌గా మారుతోంది. దీనివల్ల భవిష్యత్ నగరం అస్తవ్యస్తంగా నిర్మితమయ్యే ప్రమాదం ఉందని సీఎం అంచనా వేస్తున్నారు. కన్జర్వేషన్ జోన్ అంటే... భూ వినియోగం వ్యవసాయానికే ఉండాలి. అలాగే ఫారెస్ట్ జోన్ అంటే... అడవులే ఉండాలి. వీటిని మార్పు చేయకూడదు. ఇకపై భూ వినియోగ మార్పిడికి అవకాశం లేకుండా చర్యలు చేపట్టాలి. లేదంటే భవిష్యత్‌లో మరిన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయని సీఎం చెబుతున్నారు. ఇకపై ప్రభుత్వం అవసరమని భావిస్తే తప్ప భూ వినియోగ మార్పిడికి అవకాశం లేని విధంగా మాస్టర్‌ప్లాన్‌ను సరిదిద్దే బాధ్యతను ఆయన హెచ్ఎండీఏ భుజస్కంధాలపై పెట్టారు. నిపుణులతో వర్క్‌షాప్ మాస్టర్‌ప్లాన్‌ను దేశంలోనే గొప్ప ప్రణాళికగా తీర్చిదిద్దేందుకు నిపుణుల ఆధ్వర్యంలో రెండురోజుల పాటు వర్క్‌షాప్ నిర్వహించాలని హెచ్ఎండీఏ కమిషనర్ శాలిని మిశ్రా నిర్ణయించారు. ఈ వర్క్‌షాప్‌కు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ), అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ (ఆస్కీ), ఇతర టౌన్ ప్లానింగ్ విభాగాల ఉన్నతాధికారులను ఆహ్వానిస్తున్నారు. హైదరాబాద్ మహా నగరాన్ని క్రమపద్ధతిగా అభివృద్ధి చేసేందుకు చేపట్టాల్సిన చర్యలతో పాటు ప్రజారవాణా, సరుకు రవాణాకు తగిన విధంగా రోడ్ నెట్వర్క్, రైల్వే లైన్ల విస్తరణ, విద్యుత్, తాగునీటి సరఫరా, కమ్యూనిటీ హాళ్లు, క్రీడా ప్రాంగణాలు, బస్టాండ్లు తదితర అవసరాలను దృష్టిలో పెట్టుకొని మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు చే ర్పులకు గల అవకాశాలపై ఈ వర్క్‌షాపులో చర్చించనున్నారు. ఈ సందర్భంగా నిపుణులిచ్చే సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకొని త్రిసభ్య కమిటీ ఓ నివేదికను రూపొందించి దాన్ని ముఖ్యమంత్రికి అందజేస్తారు. ఆతర్వాత సీఎం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే మాస్టర్‌ప్లాన్‌ను మరింత పటిష్ఠంగా తీర్చిదిద్దేందుకు హెచ్ఎండీఏ చర్యలు చేపడుతుందని అధికారులు తెలిపారు.