ముస్తాబవుతున్న ‘నుమాయిష్’
=నాంపల్లి ఎగ్జిబిషన్‌గ్రౌండ్‌లో చకచకా ఏర్పాట్లు
=46 రోజుల పాటు విజ్ఞానం, వినోదం
=కొలువుదీరనున్న 2500 స్టాళ్లు
= మెట్రోరైల్ కోచ్ ప్రత్యేకాకర్షణ
అబిడ్స్/అఫ్జల్‌గంజ్, న్యూస్‌లైన్: జంటనగరవాసులు, శివారు ప్రాంతాల ప్రజలను 46 రోజుల పాటు వినోద, విజ్ఞానాంశాలతో అలరించేందుకు నుమాయిష్ ముస్తాబవుతోంది. 74వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్)కు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రదర్శన నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జనవరి 1న ప్రారంభమై ఫిబ్రవరి 15 వరకు కొనసాగుతుంది. సొసైటీ ఉపాధ్యక్షులు డాక్టర్ రాజేందర్, గౌరవ కార్యదర్శి అశ్వినీ మార్గం ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేటు స్టాళ్ల ఏర్పాటుకు సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే 80 శాతం పనులు పూర్తయ్యాయి. నుమాయిష్ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఎగ్జిబిషన్ సొసైటీ తెలంగాణ ప్రాంతంలోని విద్యాసంస్థల అభివృద్ధికి కేటాయిస్తుంది. కాగా, ఈసారి తొలిసారిగా ఆర్బీఐ, కార్మిక శాఖలు స్టాళ్లను ఏర్పాటు చేయనున్నాయి. హైదరాబాద్ మెట్రోరైల్ కోచ్ ప్రత్యేక ఆకర్షణ కానుంది.
2500 స్టాళ్లు
నుమాయిష్‌లో దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన ఉత్పత్తిదారులు, వ్యాపారస్తులు దాదాపు 2,500 స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. మన రాష్ట్ర ఉత్పత్తులతో పాటు గుజరాత్, మహారాష్ట్ర, ఒరిస్సా, ఢిల్లీ, అస్సాం, పశ్చిమబెంగాల్, బీహార్, జమ్మూకాశ్మీర్, ఉత్తరాంచల్, తమిళనాడు, కర్నాటక, ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలకు చెందిన ఉత్పత్తులను ప్రదర్శిస్తారు. చేనేత వస్త్రాలు, డ్రెస్ మెటీరియల్స్, బెడ్షీట్లు, పిల్లో కవర్లతో పాటు గృహోపకరణాలు, గృహాలంకరణ, మహిళల అలంకరణ సామాగ్రి, పిల్లల ఆట వస్తువులు కొలువుదీరనున్నాయి.
పటిష్ట భద్రత
ఏటా నుమాయిష్‌ను 22 లక్షల మంది సందర్శిస్తుంటారని సొసైటీ ఉపాధ్యక్షులు డాక్టర్ రాజేందర్, గౌరవ కార్యదర్శి అశ్వనీమార్గం తెలిపారు. ఈసారీ అదేరీతిలో సందర్శకులు వచ్చే అవకాశం ఉందన్నారు. పోలీసులతో పాటుగా 300 మంది సొసైటీ వాలంటీర్లు, సెక్యూరిటీ సిబ్బంది భద్రత విధుల్లో పాల్గొంటారన్నారు. ప్రతి సందర్శకుడిని మెటల్, హ్యాండ్ డిటెక్టర్ల ద్వారా తనిఖీ చేశాకే లోనికి అనుమతిస్తామన్నారు. 25 సీసీ కెమెరాలు, 2 డాగ్‌స్క్వాడ్‌లు, 4 ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
పిల్లలకు పండగే..పండగ
ఎగ్జిబిషన్ సొసైటీ ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్న ఎమ్యూజ్మెంట్ విభాగం విద్యార్థులు, చిన్నారులను అలరించనుంది. ఇందులో ఏర్పాటు చేసే రంగులరాట్నం, చుక్‌చుక్‌రైలు, సర్కస్, జెయింట్‌వీల్ వంటివి ఆహ్లాదాన్ని పంచనున్నాయి.