M.Girijashankar
-
బదిలీలకు ఓకే
కలెక్టరేట్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇతర జిల్లాల నుంచి పాలమూరుకు వచ్చిన తహశీల్దార్లను మళ్లీ యదావిధిగా తమ జిల్లాలకు బదిలీ అయ్యేందుకు వీలుగా శుక్రవారం జిల్లా కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ ఆమోదం తెలిపారు. గత కొన్నాళ్లుగా వారి రిలీవింగ్ విషయమై స్పష్టమైన ఆదేశాలను జారీ ఇవ్వకపోవడంతో తహశీల్దార్లు అయోమయంలో పడ్డారు. దీంతో వారంతా విధుల్ని పక్కన పెట్టి కలెక్టర్ ఆదేశాలకోసం ఎదురుచూపులు చూశారు. ఇప్పుడు స్థానచలనం కావడంతో ఇతర జిల్లాలకు చెందిన 38మంది వారివారి జిల్లాలకు వెళ్లే అవకాశం చిక్కింది. ఎన్నికల ఖర్చులు అప్పగించాకే........ ఆయా మండలాల్లో పనిచేస్తోన్న తహశీల్దార్లు ఎన్నికల్లో వినియోగించిన ఖర్చుల వివరాలు సంబంధిత ఆర్డీఓకు అప్పగించాకే వారు రిలీవ్ కావాల్సి ఉంటుంది. లెక్కలు అప్పగించని అధికారిని రిలీవ్ చేయరు. ఇందులో ఏమైనా తేడాలొస్తే అందుకు ఆర్డీవో బాధ్యత వహించాల్సి ఉంటుందని కలెక్టర్ స్పష్టంగా వెల్లడించారు. దీంతో బదిలీకి సిద్ధంగా ఉన్నవారు లెక్కలు అప్పగించే పనిలో పడ్డారు. -
ముందస్తు చర్యలు తీసుకోండి
జెడ్పీసెంటర్, న్యూస్‌లైన్ : ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి సెక్టోరల్ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం.గిరిజా శంకర్ ఆదేశించారు. బుధవారం ఎస్వీఎస్ ఆడిటోరియంలో సెక్టోరల్ అధికారులకు నిర్వహించిన శిక్షణ శిబిరంలో కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై పలు సూచనలు చేశారు. పిసైడింగ్ అధికారి పోలింగ్ కేంద్రంలో, రిటర్నింగ్ అధికారి నియోజకవర్గ కేంద్రంలో విధులు నిర్వహించాలని, వీరి పనితీరుపై సెక్టోరల్ అధికారి మాత్రం పోలింగు కేంద్రాలు, రూట్లు, గ్రామాల్లోని పోలింగ్ పరిస్థితులపై సమయస్ఫూర్తితో మానిటరింగ్ చేయాలన్నారు. ముందుగానే పోలింగ్ కేంద్రాల్లో అన్ని వసతులుండేలా పర్యటించాలని, ప్రహరీలు, నీడలేనిచోట షామియానాలు వేయించాలన్నారు. పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు రెండు ఒకేసారి వచ్చినందున ప్రజలకు ఈవీఎంలపై అవగాహన కల్పించాలన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి పారితోషికం సకాలంలో చెల్లించాలని, శాంతి భద్రతల సమస్య ఎక్కడ తలెత్తినా పోలీసుల సహకారంతో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీఆర్పీసీ 44 ప్రకారం చట్టవిరుద్ధంగా ప్రవర్థించిన వారిపై చర్యలు తీసుకునే అధికారం సెక్టోరల్ అధికారులకుందని తెలిపారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం గడువు ముగిసిన తర్వాత ఎవరైనా ప్రచారం నిర్వహించినా, అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులెవరైనా కండువాలతో, పార్టీ గుర్తులు కనిపించే చొక్కాలు ధరించి పోలింగు కేంద్రంలోకి వెళ్లినా అప్రమత్తం కావాలని సూచించారు. ఈనెల 18 నుంచి ఓటరు స్లిప్పులను పంపిణీ చేయాలని, ఈ ఎన్నికల్లో ఓటు స్లిప్పులనే ఓటరు గుర్తింపుగా పరిగణించటం జరుగుతుందని, ఈ స్లిప్పును చూపించే ఓటరు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. శిక్షణలో సహాయ కలెక్టర్ విజయరామరాజు, ఆర్డీఓ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. అన్నీ కొత్త ఈవీఎంలే.. కలెక్టరేట్: జిల్లాలో నిర్వహించే సార్వత్రిక ఎన్నికలకు ఈసారి కొత్త ఈవీఎంలనే వినియోగిస్తున్నామని కలెక్టర్ వెల్లడించారు. బుధవారం సాయంత్రం రెవెన్యూ సమావేశ మందిరంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంల ర్యాండమైజేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. 2009, 2012లో నిర్వహించిన ఉప ఎన్నికల్లో ఉపయోగించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలన్నింటిని అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు పంపించామని, వాటిని మళ్లీ ఇక్కడకు పంపకుండా, ఎన్నికల కమిషన్ జిల్లాకు కొత్త ఈవీఎంలను సరఫరా చేసినట్లు తెలిపారు. 7280 బ్యాలెట్ యూనిట్లు అవసరముండగడా 9700 తెప్పించామని, అలాగే 7500 కంట్రోల్ యూనిట్లకు 9700 అదనంగా వచ్చాయన్నారు. వీటన్నింటిని ఈసీఐఎల్ ఇంజనీయర్లతో తనిఖీ చేసి మొదటి విడతగా అన్ని రాజకీయ పార్టీల సమక్షంలో 5శాతం చొప్పున 475 ఈవీఎంలను ఎంపిక చేసుకొని మాక్‌పోలింగ్ నిర్వహించామని తెలిపారు. ఈనెల 21న రెండోవిడత కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, అన్ని పార్టీల నాయకులు మాక్‌పోలింగ్‌లో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో శిక్షణ సహాయ కలెక్టర్ విజయరామారాజు, డీఆర్ఓ రాంకిషన్, ఎన్ఐసీ డీఐఓ మూర్తి, కాంగ్రెస్ పార్టీ తరుపున సత్తూర్ రాములుగౌడ్, టీడీపీ తరుపున ఎల్.రమేశ్, సీపీఎం నుంచి తిరుమలయ్య, చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
ఒక్కకాల్ చేస్తేచాలు..!
కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఫిర్యాదుదారులు తమ సమస్యలను ఇంటివద్ద నుంచి ఒక్కఫోన్ చేస్తేచాలు పరిష్కరించి వారంరోజుల్లో సమాచా రం ఇస్తామని కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ పేర్కొన్నారు. సోమవారం రెవెన్యూ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణికి ముందు పరిష్కారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జిల్లాకేంద్రానికి రాలేనివారు ఒక్కఫోన్చేస్తే చాలన్నారు. వీటికోసం ప్రత్యేకంగా సెల్ నెం.9866098111ను కేటాయించినట్లు చెప్పారు. అనంతరం ‘ఫోన్‌ఇన్’ కార్యక్రమంలో మాట్లాడారు. జేసీ ఎల్ శర్మన్ ఐదుగురి ఫిర్యాదులను స్వీకరించారు. సాయంత్రం వరకు జరిగిన కార్యక్రమంలో 38 ఫిర్యాదులు నమోదయ్యాయి. -
కష్టపడి పనిచేస్తేనే గుర్తింపు
మహబూబ్‌నగర్ రూరల్, న్యూస్‌లైన్: ప్రభుత్వ అధికారులంతా విధుల్లో కష్టపడి పనిచేస్తేనే ప్రజల్లో మంచి గుర్తింపు వస్తుందని కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ అన్నారు. బుధవారం స్థానిక శాలిమార్ ఫంక్షన్హాల్లో ఏర్పాటుచేసిన ప్రత్యేకకార్యక్రమంలో జిల్లా నుంచి బదిలీపై వెళ్లిన మెప్మా పీడీ పద్మహర్షను ఘనంగా సన్మానించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ.. ఉద్యోగరీత్యా బదిలీలు సహజమేనని, కానీ విధుల్లో ఉన్నరోజులు కష్టపడేతత్వంతో రాణించేలా ప్రతి అధికారి కృషిచేయాలని ఆకాంక్షించారు. మెప్మా పీడీ పద్మహర్ష జిల్లాకు వచ్చిన రెండేళ్ల కాలంలో మెప్మాలో బాగా కష్టపడి రాణించారని అభినందించారు. అదేవిధంగా ఒక మహిళా అధికారి కావడంతో మహిళల సమస్యలను ముందుగానే గుర్తించి వాటిని పరిష్కరిస్తూ సంఘాలను బలోపేతం చేశారని కొనియాడారు. ఏదేని మహిళలకు సంబంధించిన కార్యక్రమాన్ని అప్పగిస్తే తన సొంత పనిలా భావించి విజయవంతంగా నిర్వహించేవారని, ఇందు కు బతుకమ్మ కార్యక్రమమే నిదర్శనమన్నారు. ఆమె ఇకముందు కూడా బాధ్యతాయుతంగా రాణించి మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. విధుల నిర్వహణలో ఆమెను ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకుని రాణించాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. పీడీ పద్మహర్షకు జిల్లాతో నాలుగేళ్ల అనుబంధం ఉందన్నారు. జిల్లా ప్రజలకు ఆమె అనేక సేవలు అందించి వారి అభిమానాన్ని చూరగొన్నారని కొనియాడారు. జిల్లాను మరిచిపోలేను: పద్మహర్ష జిల్లాలో పనిచేసిన నాలుగేళ్లలో తనకు సహకరించిన కలెక్టర్‌తో పాటు ఇతర అధికారుల సహకారం, జిల్లాప్రజలు అందించిన అభిమానాన్ని మరిచిపోలేనని బది లీపై వెళ్తున్న పీడీ పద్మహర్ష అన్నారు. అయితే విధుల్లో తనవంతుగా రాణించానని చెప్పారు. ఇకముందు కూడా ఇలాంటే సేవలనే కొనసాగిస్తానన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ సతీమణి అన్నపూర్ణ, ఏజేసీ డాక్టర్ రాజారాం, డీఆర్వో రాంకిషన్, డీఆర్డీఏ పీడీ చంద్రశేఖర్‌రెడ్డి, నారాయణపేట్ ఆర్డీఓ యాస్మిన్‌బాషా, పట్టణ మహిళా సమాఖ్య కార్యదర్శి యాదమ్మతోపాటు అధికారులు, సభ్యులు పాల్గొన్నారు.