బదిలీలకు ఓకే
కలెక్టరేట్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇతర జిల్లాల నుంచి పాలమూరుకు వచ్చిన తహశీల్దార్లను మళ్లీ యదావిధిగా తమ జిల్లాలకు బదిలీ అయ్యేందుకు వీలుగా శుక్రవారం జిల్లా కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ ఆమోదం తెలిపారు. గత కొన్నాళ్లుగా వారి రిలీవింగ్ విషయమై స్పష్టమైన ఆదేశాలను జారీ ఇవ్వకపోవడంతో తహశీల్దార్లు అయోమయంలో పడ్డారు. దీంతో వారంతా విధుల్ని పక్కన పెట్టి కలెక్టర్ ఆదేశాలకోసం ఎదురుచూపులు చూశారు. ఇప్పుడు స్థానచలనం కావడంతో ఇతర జిల్లాలకు చెందిన 38మంది వారివారి జిల్లాలకు వెళ్లే అవకాశం చిక్కింది.
ఎన్నికల ఖర్చులు అప్పగించాకే........
ఆయా మండలాల్లో పనిచేస్తోన్న తహశీల్దార్లు ఎన్నికల్లో వినియోగించిన ఖర్చుల వివరాలు సంబంధిత ఆర్డీఓకు అప్పగించాకే వారు రిలీవ్ కావాల్సి ఉంటుంది. లెక్కలు అప్పగించని అధికారిని రిలీవ్ చేయరు. ఇందులో ఏమైనా తేడాలొస్తే అందుకు ఆర్డీవో బాధ్యత వహించాల్సి ఉంటుందని కలెక్టర్ స్పష్టంగా వెల్లడించారు. దీంతో బదిలీకి సిద్ధంగా ఉన్నవారు లెక్కలు అప్పగించే పనిలో పడ్డారు.