పని చేస్తేనే నిధులు వస్తాయి
మచిలీపట్నం (చిలకలపూడి) : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్) పనులపై ప్రత్యేక అధికారులు శ్రద్ధ చూపాలని కలెక్టర్ బాబు.ఎ చెప్పారు. చేసిన పనులను బట్టే నిధులు విడుదలవుతాయని ఆయన తెలిపారు. కలెక్టరేట్‌లోని సమావేశపు మందిరంలో సోమవారం ‘మీ కోసం’ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్‌తోపాటు జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, డీఆర్వో రంగయ్య ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధి హామీ పనులు వేగవంతం చేయాలని, కూలీలకు ఎక్కువ గంటలు పని కల్పించాలని సూచించారు. ఇప్పటి వరకు ఉపాధి హామీ పథకం ద్వారా పనులు చేపట్టడంలో రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానంలో ఉందని చెప్పారు. జిల్లాలో రహదారుల నిర్మాణం కూడా వేగవంతం చేయాలన్నారు. ప్రతి వారం జిల్లాలో 20 కిలో మీటర్ల మేర రహదారుల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ శాఖ అధికారులకు సూచించారు. అన్ని మండలాల్లో నూతన గృహాలు మంజూరు చేశామని, పనులు వేగవంతంగా చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశారు. త్వరలోనే పట్టణాల్లో కూడా గృహాల మంజూరుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. అంగన్‌వాడీ భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకున్నామని, ప్రస్తుతం 120 కేంద్రాలకు సొంత భవనాలు ఉన్నాయన్నారు. మరో 54 భవనాల నిర్మాణానికి స్థలాల సేకరణ జరుగుతుందని చెప్పారు.
10 రోజుల్లో సర్వే పూర్తి చేయాలి
జిల్లాలో ప్రజాసాధికార సర్వేను పది రోజుల్లో పూర్తి స్థాయిలో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ఇప్పటి వరకు 80 శాతం సర్వే పూర్తయిందని తెలిపారు. సర్వే పూర్తికాని ప్రజలు 1077 టోల్ ఫ్రీ నంబరులో సంప్రదిస్తే వెంటనే సిబ్బందిని పంపి సర్వే నిర్వహిస్తామని చెప్పారు. విజయవాడలో ఇప్పటికి 53 శాతం సర్వే పూర్తయిందన్నారు. ఈ సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ డి.చంద్రశేఖరరాజు, జెడ్పీ సీఈవో టి.దామోదరనాయుడు, డీఎస్‌వో వి.రవికిరణ్, సీపీవో కేవీకే రత్నబాబు, డ్వామా పీడీ మాధవీలత, డీఈవో ఎ.సుబ్బారెడ్డి పాల్గొన్నారు.