MGNREG
-
నర్సరీలతో ఉపాధి... ఒక్కో నర్సరీకి రూ. 6 లక్షలు
కడప సిటీ: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఈ ఏడాది కొత్తగా నర్సరీల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చారు. ఇప్పటికే ఉపాధి హామీ పథకంలో కూలీలకు పనులు కల్పించి ఆర్థికాభివృద్ధి సాధించేందుకు తోడ్పాటు కల్పిస్తున్నారు. అలాగే నిర్మాణాత్మక పనులకు కూడా నిధులు కేటాయిస్తున్నారు. దీంతోపాటు నీటి సంరక్షణ పనులకు కూడా ప్రభుత్వం ఉపాధి హామీలో నిధులు కేటాయిస్తోంది. రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు పండ్ల తోటల పెంపకాన్ని కూడా ప్రోత్సహిస్తోంది. పూర్తి ఉచితంగా సన్న, చిన్నకారు రైతులు సాగు చేసేందుకు అవకాశం కల్పించింది. ఇప్పటికే 11 రకాల పండ్ల తోటల పెంపకానికి శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది కొత్తగా సన్న, చిన్నకారు రైతులు మరింత ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ఉపాధి హామీ పథకానికి అవసరమైన మొక్కలను పెంచేందుకు నర్సరీల అవసరం ఏర్పడింది. ఈ నర్సరీలను పెంచేందుకు రైతులకే అవకాశం కల్పించారు. ఒక్కో నర్సరీకి రూ.6 లక్షలు నర్సరీ ఏర్పాటుకు ఏడాదికి రూ. 6 లక్షల నిధులు ఉపాధి హామీ పథకం నుంచి రైతులకు అందుతాయి. 50 వేల మొక్కలను సంబంధిత రైతు నర్సరీలో పెంచాల్సి ఉంటుంది. ఒక్కో మొక్కకు నెలకు రూపాయి చొప్పున కేటాయిస్తారు. దీంతో నెలకు రూ. 50 వేల ఆదాయం సమకూరుతుంది. అటవీ ఉత్పత్తులైన కానుగ, వేప, నీరుద్ది, నెమలినార, నిద్రగన్నేరు, నేరేడు, టేకు, ఎర్రచందనం, మునగ మొక్కలను పెంచాల్సి ఉంటుంది. అందుకు సంబంధించి ఇప్పటికే ఆరుచోట్ల నర్సరీల ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టారు. సిద్దవటం మండలం జేఎంజే కళాశాల ఎదురుగా ఉన్న మూలపల్లె గ్రామంలో, చెన్నూరు మండలం బయనపల్లె, కమలాపురం మండలం నసంతపురం, వీఎన్ పల్లె మండలం గోనుమాకులపల్లె గ్రామాల్లో నర్సరీలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అలాగే చక్రక్రాయపేట మండలం గంగారపువాండ్లపల్లె, సుండుపల్లె ప్రాంతాల్లో నర్సరీలు ఏర్పాటు చేయాల్సి ఉంది. జిల్లాలో ఉపాధి హామీ పథకం అవసరాన్ని బట్టి ఆయా ప్రాంతాల్లో నర్సరీల ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. రైతులకు వరం సన్న, చిన్నకారు రైతులకు మరొక వరం లాంటి అవకాశం వచ్చింది. ఆసక్తిగల రైతులు నర్సరీలు పెంచేందుకు ముందుకు రావాలని ఉపాధి హామీ అధికారులు సూచించారు. ఉపాధి హామీ పథకం కింద రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటేందుకు, అలాగే ప్రభుత్వ కార్యాలయాలు, స్థలాల్లో మొక్కలు నాటేందుకు అవసరమైన మొక్కలను సేకరించేందుకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ అవకాశాన్ని రైతులకు ఇచ్చి నర్సరీల ద్వారా అటవీ జాతి మొక్కలను పెంచేందుకు అవకాశం కల్పించారు. పొలం ఉన్నా.. లేకున్నా.. సన్న, చిన్నకారు రైతులకు నర్సరీల ఏర్పాటుకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు. నీటి సౌకర్యం కలిగి ఉండాలి. అలాగే ఒకవేళ పొలం లేకున్నా స్థలం, నీటి సౌకర్యం ఉంటే నర్సరీలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఆసక్తిగల రైతులు ఎంపీడీఓ కార్యాలయంలో ఉన్న ఉపాధి సిబ్బందిని కలిసి వివరాలు తెలుసుకోవచ్చు. మొక్కలు, సంబంధిత బ్యాగులు, పొలాన్ని చదును చేయడం, స్టంప్స్ (పెద్ద కర్రలు)తోపాటు పాటిమిక్చర్ (ఎరువు, ఇసుక, ఎర్రమట్టి)ను కూడా ఉపాధి హామీ పథకం కిందనే ఉచితంగా అందజేస్తారు. నర్సరీలతో మరింత ఉపాధి రైతులకు నర్సరీల ద్వారా మరింత ఉపాధి లభించే అవకాశం ఉంది. ఒక్కో నర్సరీకి రూ. 6 లక్షల నిధులు అందుతాయి. నెలకు రూ. 50 వేలు ఆదాయం పొందవచ్చు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. – యదుభూషణరెడ్డి, డ్వామా పీడీ, కడప -
మనుషులే కాదు.. ఆత్మలు ఉపాధి హామీ పనికి..
సాక్షి, పెద్దకొడప్గల్(నిజామాబాద్): మనుషులే కాదు.. ఆత్మలు కూడా ఉపాధి పనికి వస్తున్నాయట..! చేసిన పనికి డబ్బులు కూడా తీసుకుంటున్నాయట!! ఉపాధి హామీ సామాజిక తనిఖీలో ఈ విషయం వెలుగు చూసింది. అంతే కాదు.. పోలీసు కానిస్టేబుళ్లు, వీఆర్ఏలు కూడా ఉపాధి పనినే నమ్ముకున్నారట. పెళ్లయి అత్తారింటికి వెళ్లిన యువతులు కూడా పుట్టింటికి వచ్చి ఉపాధి పనులు చేస్తున్నారట. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న అక్రమాలకు ఇవే ఉదాహరణ. పెద్దకొడప్గల్ మండల కేంద్రంలో మంగళవారం నిర్వహింన ఉపాధి హామీ సామాజిక తనిఖీ ప్రజావేదికలో విస్తుగొలిపే అంశాలు బయటడపడ్డాయి. పెద్దదేవిసింగ్ తండా, చిన్నదేవిసింగ్ తండా, వడ్లం గ్రామాల పరిధిలో మూడేళ్లలో జరిగిన ఉపాధి పనుల్లో జరిగిన అక్రమాలు ఈ సందర్భంగా వెలుగులో కి వచ్చాయి. కొన్ని మాస్టర్లలో సంతకాలు లేకుండానే డబ్బులు చెల్లింనట్లు తేలింది. వీఆర్ఏ ఆనంద్కూమర్తో పాటు పోలీస్ కానిస్టేబుళ్లు ఉపాధి పనికి వచ్చి డబ్బులు తీసుకు న్నట్లు నమోదు చేశారని తనిఖీ బృందం తే ల్చింది. అంతే కాదు, పెళ్లయి అత్తారింటికి వెళ్లి పోయిన వారి పేర్లతో పాటు చనిపోయిన వారి పేర్ల పేరిట డబ్బులు చెల్లింనట్లు తనిఖీ బృందాలు గుర్తించాయి. ఒకే వర్క్ ఐడీపై రెండుసార్లు డబ్బులు చెల్లింనట్లు తేల్చాయి. విఠల్ అనే వ్యక్తి పని చేయక పోయినా 67 రోజులకు గాను ర.11,346 చెల్లించారని, ఇందులో సగం ఫిల్డ్ అసిస్టెంట్ చందర్ తీసుకున్నారని సావజిక తనిఖీలో తేలింది. మంకీ ఫుడ్ కోర్టు ఒక్కటే నిర్వహించగా, రెండు చూపి డబ్బులు చెల్లింనట్లు గుర్తించారు. ఇక వడ్లం గ్రామంలోని ప్రతి పనిలోనూ అక్రమాలు జరిగాయని తనిఖీ బృందాలు తేల్చాయి. రైతులు సొంత ఖర్చులతో వేసుకున్న రోడ్లను ఉపాధి హామీలో నిర్మింనట్లు చూపి ర.20,54,000 కాజేసినట్లు తేలింది. అధికారులు వెంకటవధవరావు, శ్రీకాంత్, సాయన్న, దత్తకొండ, అశోక్‌కూమార్, ఎంపీపీ ప్రతాప్‌రెడ్డి, ఎంపీడీవో రాణి, సిబ్బంది పాల్గొన్నారు. -
ఏపీలో రూ.8,000 కోట్లతో ‘ఉపాధి’
సాక్షి, అమరావతి: ఉపాధి హామీ పథకం ద్వారా వచ్చే ఆర్థిక ఏడాదిలో నిరుపేద కూలీలకు రూ.8,000 కోట్ల మేర పనులు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలలో 2021-22 ఉపాధి హామీ లేబర్ బడ్జెట్ రూపకల్పనకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. కూలీలకు ఏడాది మొత్తంలో 30 కోట్ల పనిదినాలు కల్పించేలా గ్రామాలు, జిల్లాలవారీగా నెలవారీ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 నుంచి ప్రతి గ్రామంలో లేబర్ బడ్జెట్ రూపకల్పన ప్రక్రియ ఆరంభమైంది. నవంబరు 15వతేదీలోగా వీటిని సిద్ధం చేసి అదే నెల 30వతేదీ కల్లా గ్రామ పంచాయతీల అనుమతి తీసుకుంటారు. డిసెంబరు నెలాఖరు కల్లా గ్రామాల వారీగా ప్రణాళికలను కలెక్టర్లు ఆమోదిస్తారు. ఉపాధి హామీ లేబర్ బడ్జెట్ రూపకల్పనకు ప్రస్తుతం అధికారులకు శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వారం పది రోజుల్లో గ్రామ స్థాయి వరకు శిక్షణ పూర్తి కానుంది. సచివాలయాల భాగస్వామ్యం.. ‘గ్రామస్థాయి నుంచి దేశ స్థాయి’ ప్రణాళికలు అనే నినాదంతో ఉపాధి హామీ లేబర్ బడ్జెట్ రూపకల్పనలో గ్రామ సచివాలయాల వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యలను చేసింది. వలంటీర్లతో పాటు గ్రామ సచివాలయంలో పనిచేసే వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్థక, మత్స్య సహాయకుల సహాయంతో ఉపాధి హామీ ద్వారా చేపట్టే అవకాశం ఉన్న పనులను గుర్తిస్తారు. వ్యవసాయం, అనుబంధ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తూ చిన్న నదుల పునరుజ్జీవం, చెరువుల్లో పూడికతీత, హార్టికల్చర్, ప్లాంటేషన్, సేద్యపు నీటి కుంటలు, గిరిజన ప్రాంతాల్లో ఆర్వోఎఫ్ఆర్ భూముల సమగ్ర అభివృద్ధి తదితర పనులను వచ్చే ఆర్ధిక సంవత్సరంలో పెద్ద ఎత్తున చేపట్టాలని నిర్ణయించారు. (చదవండి: ఆపద సమయంలో ప్రభుత్వాస్పత్రులే అండ..!) ప్రజలకు ఉపకరించే స్థిరాస్తి కల్పన పనులు గుర్తించాలి ఏడాది పొడవునా కూలీలకు నిరంతరాయంగా పనులు కల్పించేందుకు తగినన్ని పనులను లేబర్ బడ్జెట్ ప్లానింగ్ సమయంలో గుర్తించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజా శంకర్ పేర్కొన్నారు. 2021-22 ఉపాధి హామీ లేబర్ బడ్జెట్ తయారీ రాష్ట్ర స్థాయి శిక్షణ కార్యక్రమాలను మంగళవారం ఆయన విజయవాడలో ప్రారంభించారు. రెండు రోజుల పాటు వీటిని నిర్వహించనున్నారు. ప్రాంతం, సీజన్‌ను బట్టి ఉపాధి హామీ పనులను ఎంపిక చేయాలని సూచించారు. ప్రజలకు ఉపకరించే స్థిరాస్తుల కల్పన పనులను చేపట్టాలన్నారు. వినూత్న పనులకు ప్రణాళికలో ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. 2021- 22లో పేదలకు 30 కోట్ల పనుల కల్పించాలంటే 45 కోట్ల పనిదినాలకు సరిపడా పనులను గుర్తించాలన్నారు. ప్రణాళిక సమయంలోనే జాబ్ కార్డులు లేని కూలీలను గుర్తించి జారీ చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కమిషనర్లు శివప్రసాద్, కళ్యాణ్ చక్రవర్తి, జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. (చదవండి: పోర్టబులిటీ.. ‘వలస’పాలిట పెన్నిధి) -
పనులేమీ చేయలేదు.. నిధులు మాత్రం స్వాహా చేశారు..!
సాక్షి, వెంకటగిరిరూరల్: అక్కడ ఉపాధి హామీ కింద పనులేమి జరగలేదు. కానీ జరిగినట్లుగా రికార్డులు సృష్టించి నిధులు స్వాహా చేసేశారు. మొత్తం రూ.1.25 కోట్ల మేర పనులు జరగ్గా పెద్ద మొత్తంలో అవినీతి జరిగిందని తేలింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ నిర్వాకం సామాజికతనిఖీలో బయటపడింది. బాలాయపల్లి మండలంలోని నిడిగల్లు గ్రామంలో మంగళవారం సోషల్ ఆడిట్ బృంద సభ్యులు గ్రామసభల ద్వారా దీనికి సంబంధించిన వివరాలు తెలియజేశారు. గత ప్రభుత్వం హయాంలో 2018 – 2019 ఆర్థిక సంవత్సరంలో నిడిగల్లు గ్రామంలో ఉపాధి హామీ పనులు మంజూరయ్యాయి. అయితే పనులు చేయకుండానే నిధులు స్వాహా చేశారు. నిడిగల్లు, గాజులపల్లి, చాకలపల్లి, గొల్లపల్లిల్లో జరిగిన అభివృద్ధి పనులకు సంబంధించి వర్స్ బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉండగా చేయలేదు. 24 ఐడీలకు సంబంధించి వెయ్యి, ఎస్‌డబ్ల్యూఎఫ్ కింద 21,700 చొప్పున నేమ్ బోర్డులు ఏర్పాటు చేసినట్లుగా రికార్డుల్లో ఉంది. అయితే క్షేత్రస్థాయిలో ఎక్కడా బోర్డులు కనిపించలేదని అధికారులు తెలిపారు. ఇతర రంగాల నుంచి అర్హుత లేని ముగ్గురు వ్యక్తుల చేత ఉపాధి పనులు చేయించి రూ.36 వేలు, రూ.34 వేలు నిధులు డ్రా చేసినట్లుగా రికార్డుల్లో ఉంది. పీటీలు, పశువుగుంట పనులు, పూడికతీత పనులు ఫీల్డ్ లెవలింగ్, పాఠశాలలు, శ్మశానంలో జరిగిన పనులు కూలీల చేత కాకుండా యంత్రాల ద్వారా చేసి నిధులు డ్రా చేశారు. అంతేగాకుండా నిడిగల్లుకు సంబంధించి ఐదు చెరువులున్నాయి. ఇక్కడ గుంతలు తవ్వేసి పనులు చేశామని చెప్పి నగదు డ్రా చేసినట్లుగా గుర్తించారు. కాగా దీనిపై అధికారులు స్థానికులను విచారించగా చెరువు వద్ద పనులు నిర్వహించి మూడేళ్లవుతోందని, ఇప్పటి వరకు పూడికతీత పనులు జరగలేదని తెలిపారు. 2017 సంవత్సరంలో నిడిగల్లు చెరువుకు గండి పడడంతో పూడ్చేందుకు సమీప వ్యవసాయ పొలం రైతు తన సొంత నిధులతో మట్టిని తోలగా ఆ పనికి కూడా మస్టర్లో బిల్లులు మంజూరుచేసి నిధులు స్వాహా చేశారు. అదే గ్రామానికి చెందిన బలరామయ్య అనే వ్యక్తి తన సొంత నిధులతో శ్మశానవాటికి మట్టి తోలించి చదును చేయించాడు. అయితే దీనిని ఉపాధి పథకం కింద చూపించి రూ.3.80 లక్షల నిధులను డ్రా చేశారు. నా సొంత నిధులతో పనులు చేస్తే నిధులు ఎలా డ్రా చేస్తారని అధికారుల ముందు బలరామయ్య వాపోయాడు. ఇక పూడికతీతలు, సైడ్‌కాలువల నిర్మాణంలో ఎక్కడా పనులు చేయకుండా 11 గ్రూపుల డిమాండ్ ఫారంలో ఒక్కరే సంతకాలు చేసి నిధులు స్వాహా చేసినట్లు నిర్ధారించారు. సంతకాలు లేకుండానే.. గ్రామ పెద్ద చెరువు పైభాగంలో జరిగిన పనుల్లో 42 మస్టర్లు ఉపయోగించారని అయితే రికార్డుల్లో ఏపీఓ, ఎంపీడీఓ అధికారుల సంతకాలు లేవని అధికారులు గుర్తించారు. బోయినగుంట వద్ద పశువుగుంత, పూడికతీత పనులు 1,789 క్యూబిక్‌ల మేర చేయగా ఇవి యంత్రాలతో చేసినట్లుగా చెబుతున్నారు. దీనికి సంబంధించి 15 గ్రూపుల వారు 20 మస్టర్లు ఉపయోగించి డిమాండ్ ఫారంలో ఒక్కరే సంతకాలు చేసి నిధులు డ్రా చేసినట్లుగా గుర్తించారు. గ్రామ పెద్ద చెరువు పైభాగంలో మోహన్ చేయిన్ గుంతల్లో పూడికతీత పనుల్లో 1,415 క్యూబిక్ మీటర్ల పనులు రికార్డు చేయగా 848 క్యూబిక్ మీటర్లు తక్కువ వచ్చింది. రెడ్డి చెరువు నుంచి ఆర్అండ్బీ వరకు గొల్లపల్లి మరవ సమీపంలో ఉన్న మూడు కాలువలకు పనులు చేయకుండా నిధులు డ్రా చేసినట్లు తెలిపారు. తెలుగుగంగ కెనాల్ నుంచి గ్రామంలోని ట్యాంక్ వరకు పనులు చేశారని చెప్పారని, అయితే అక్కడ పనులేమి జరగలేదని అధికారులు తెలిపారు. సెర్ప్‌కు సంబంధించి రూ.99,450 ఖర్చు చేయడం జరిగింది. అయితే అభివృద్ధి జాడ మాత్రం లేదు. నిమ్మ చెట్లకు సంబంధించి ఇష్టానుసారంగా మొక్కలు నాటుకున్నట్లుగా చెప్పారు. గ్రామస్తుల ఆగ్రహం గ్రామంలో పనులు నిర్వహించకుండా చేసినట్లుగా రికార్డుల్లో నమోదుచేసి నగదు డ్రా చేసుకోవడంపై నిడిగల్లు గ్రామస్తులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు తనిఖీలు చేయకుండా బిల్లులు ఎలా మంజూరు చేస్తారని ప్రశ్నించారు. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేçస్తున్న నిడిగల్లు గ్రామస్తులు -
నీడ..నీరు లేదు
► ఉపాధిహామీ కూలీలకు సౌకర్యాల కరువు ► తాగునీరూ వెంట తెచ్చుకోవల్సిందే.. ► పట్టించుకోని అధికారులు ► మొత్తం జాబ్ కార్డులు 1,14,743. కూలీలు 2,50,957 ► పనులు చేస్తున్న కూలీలు 1,31,881 ఉపాధిహామీ కూలీలకు కష్టాలు మొదలయ్యాయి. ఎండలు ముదురుతున్న కొద్ది పనులు చేయడం ఇబ్బందిగా మారింది. పని ప్రదేశంలో అధికారులు కనీస వసతులైన నీడ, నీటి సౌకర్యం కల్పించడం లేదు. దీంతో కూలీలు ఎర్రని ఎండలో పనిచేయాల్సి వస్తోంది. నీళ్లు కూడా వెంట తెచ్చుకోవల్సిన దుస్థితి నెలకొంది. కౌటాల మండలంలోని యాపలగూడ, తలోడి గ్రామాల్లో మంగళవారం ఈ పరిస్థితి కనిపించింది. జిల్లా వ్యాప్తంగా కూడా కూలీలు ఇలాంటి కష్టాలే ఎదుర్కొంటున్నారు. కౌటాల : ఉపాధిహామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు ప్రభుత్వం కనీస వసతులు కల్పించడం లేదు. జిల్లాలో మొత్తం 1,14,743 జాబ్‌కార్డులు ఉన్నాయి. వీటిలో 69,556 వేల కుటుంబాల్లో 2,50,957 కూలీలు ఉన్నారు. ఇందులో 1,31,881మంది పనిచేస్తున్నారు. వీరిలో గతేడాది 3,664 మంది కూలీలు వంద రోజుల పనిదినాలు పూర్తి చేశారు. ఇంతటి ప్రాముఖ్యం కలిగి ఉన్నా ప్రభుత్వం కూలీలకు కనీస వసతులు కల్పించడం లేదు. ఉపాధి పని ప్రదేశాల్లో ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగేందుకు నీరు లేక..సేద తీరేందుకు నీడ లేక.. ఎండలోనే పనులు చేస్తూ కూలీలు వడదెబ్బకు గురువుతున్నారు. ఉదయం 8 గంటలకే ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో కూలీలు ఎండకు తట్టుకోలేక విలవిలలాడుతున్నారు. గతంలో ఉపాధిహామీ కూలీలకు నీడ సౌక్యర్యం లేక ఎండదెబ్బకు పలువురు కూలీలు మృతి చెందిన సంఘటనలు అనేకం ఉన్నాయి. అయినా సంబంధిత అధికారులు ఈ సంవత్సరం కూడా కూలీలకు నీడ సౌకర్యం కల్పించడం లేదు. దీంతో అనేక మంది కూలీలు పనులకు రావడం లేదు. ఇబ్బందుల్లో కూలీలు ఉపాధి పని ప్రదేశాలలో నీడ, తాగునీటి సౌకర్యం లేకపోవడంతో కూలీలు ఇంటి నుంచే తాగునీరు తెచ్చుకోవల్సి వస్తోంది. ఆ నీళ్లు సరిపోక నానా ఇబ్బందులు పడుతున్నారు. బాటిళ్లలోని నీరు ఎండకు వేడి కావడంతో కూలీలు తాగలేకపోతున్నారు. పనులు చేస్తున్న సమయంలో కూలీలు గాయాల పాలైనా..అనారోగ్యానికి గురైన ప్రాథమిక చిక్సిత అందించేందుకు ఎక్కడా మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచడం లేదు. టెంట్లు కూడా లేకపోవడంతో నీటి సీసాలను చెట్ల కింద ఉంచాల్సి వస్తోందని కూలీలు వాపోతున్నారు. ముఖ్యంగా కౌటాల మండలంలో జరుగుతున్న ఉపాధి పనుల్లో ఏ ఒక్క చోట కూడా ఎండలకు టెంట్లు వేసిన దాఖాలలు కనిపించడం లేదు. వడదెబ్బ తగలకుండా టెంట్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఈజీఎస్ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ కారణంగా మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కనీస సౌకర్యాలు కల్పించాలని కూలీలు కోరుతున్నారు. కనీస సౌకర్యాలు కల్పించాలి పని చేసే ప్రదేశంలో తాగు నీరు, నీడ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నాం. ఎండా కారణంగా అనేక మంది కూలీలు పని మానేస్తున్నారు. ఇప్పటికైన సంబంధిత అధికారులు స్పందించి తాగునీటి, నీడ సౌకర్యాం కల్పించాలి. - బెడ్డల తుర్సబాయి, ఉపాధికూలీ, యాపలగూడ 82 నీళ్లు తెచ్చుకుంటున్నాం ఇంటి నుంచే నీటి సీసాలు వెంట తెచ్చుకుంటున్నాం. ఆ నీళ్లు ఎండకు వేడి అవుతున్నాయి. దీంతో నీటి తిప్పలు తప్పడం లేదు. మెడికల్ కిట్టు అందుబాటులో ఉంచడం లేదు.- దుర్గం అర్జున్, ఉపాధికూలీ, ధనురుహెట్టి 83 టార్ఫాలిన్లు ఇచ్చాం మండలంలో పని చేస్తున్న కూలీలకు ఈ సంవత్సరం ప్రభుత్వం పంపిణీ చేసిన టార్ఫాలిన్ కవర్లను ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లకు అందించాం. మెడికల్ కిట్లను ప్రభుత్వం పంపిణీ చేయలేదు. కూలీలు ఎక్కువగా ఉండడంతో టార్ఫాలిన్ అందరికీ అందించలేకపోయాం. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించాం.- పూర్ణిమ, ఈజీఎస్ ఏపీవో, కౌటాల 84