'ఎంహెచ్ 370' బాధితుల సొమ్ము చోరీ
కౌలాలంపూర్: ఎంహెచ్ 370 విమాన ప్రమాద బాధితుల సొమ్ము నొక్కేసిన మలేసియా బ్యాంకు అధికారి, ఆమె భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ చోరీతో సంబంధమున్న పాకిస్థాన్ వ్యక్తిని పట్టుకునేందుకు గాలిస్తున్నారు. బ్యాంకు అధికారి, ఆమె భర్త విమాన ప్రమాద బాధితుల బ్యాంకు ఖాతా నుంచి 34,850 డాలర్లు కాజేసినట్టు అధికారులు గుర్తించారు.
ఇద్దరు మలేసియా, మరో ఇద్దరు చైనా బాధితుల ఖాతాల నుంచి వీరు డబ్బు తీసుకున్నట్టు గుర్తించారు. మలేసియా సీఐడీ అధికారులు వీరిని గురువారం సాయంత్రం అరెస్ట్ చేశారు. వీరికి ఆదివారం వరకు రిమాండ్ విధించారు. అరెస్టైన బ్యాంకు ఉద్యోగిని పదేళ్లుగా ఓ పేరులేని బ్యాంకులో పనిచేస్తుండగా, ఆమె భర్త అంపాంగ్ లో మెకానిక్ పనిచేస్తున్నాడని అధికారులు వెల్లడించారు.