ఎ పెయింటింగ్ బై శ్రీదేవి
ప్రపంచవ్యాప్తంగా కోట్లల్లో అభిమానులను సంపాదించుకునే వ్యక్తులు అరుదుగా ఉంటారు. ఆ అరుదైన జాబితాలో పాప్ స్టార్ మైకేల్ జాక్సన్కి అగ్ర స్థానమే ఉంటుంది. ఈ పాప్ స్టార్ అంటే శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీకి బోల్డంత అభిమానం. మైకేల్ జాక్సన్ పాటల్ని వినడం మాత్రమే కాదు.. ఆయన ఫొటోలు దాచుకునేంత వీరాభిమాని అన్నమాట. కూతురి మనసెరిగిన తల్లి కాబట్టి, జాన్వీ కోసం శ్రీదేవి ఇటీవల మైకేల్ జాక్సన్ బొమ్మ గీశారు. శ్రీదేవి మంచి పెయింటర్. వీలు కుదిరినప్పుడల్లా కుంచె చేతపడతారు. తన మనసుకి నచ్చినప్పుడల్లా బొమ్మలను గీయడం ఆమె హాబీ. ఈసారి కూతురి కోసం స్వయంగా పెయింట్ చేశారామె. తల్లి ఇచ్చిన ఈ అపురూపమైన బహుమతిని చూసి జాన్వీ చాలా సంబరపడిపోయిందట.