ఓ దురదృష్టవంతుడైన తండ్రి
సంక్షిప్తంగా... మైఖేల్ నవ్రాతిల్
ఏప్రిల్ 7, 1912. ఈస్టర్ ముగిసింది. పండగ తెల్లారే తన ఇద్దరు పిల్లల్నీ తిరిగి వాళ్ల తల్లి దగ్గరకు చేర్చాలి మైఖేల్ నవ్రాతిల్. భార్య మార్సెల్ కారెట్టోతో విడిపోయాక, పిల్లలు ఎవరి దగ్గర ఉండాలన్న విషయమై కోర్టు అతడికి విధించిన నిబంధన అది. ఆ ప్రకారమే ప్రతి శుక్రవారం నాలుగేళ్ల మైఖేల్‌ని, రెండేళ్ల ఎడ్మండ్‌ని తనతో తెచ్చుకుంటాడు మైఖేల్ నవ్రాతిల్. తిరిగి సోమవారం వెళ్లి భార్యకు అప్పగిస్తుంటాడు.
అయితే ఈసారి అతడు అలా చేయలేదు. వారిని తీసుకుని కార్ల్ మాంట్ (ఫ్రాన్సులోనే వేరొక ప్రాతం) వెళ్లాడు. అక్కడి నుంచి లండన్ వెళ్లాడు. అక్కడి నుంచి సౌతాంప్టన్ వెళ్లి, ఏప్రిల్ 10న న్యూయార్క్ బయల్దేరుతున్న టైటానిక్ ఓడలో ప్రయాణానికి మూడు సెకండ్ క్లాస్ టిక్కెట్లు కొన్నాడు! తన పేరు లూయీ బి.హాఫ్మన్ అని రాయించుకున్నాడు. పిల్లల తల్లి చనిపోయిందని చెప్పుకున్నాడు. భార్యకు దూరంగా న్యూయార్క్‌లో పిల్లలతో హాయిగా గడపొచ్చని అతడి ఉద్దేశం కావచ్చు. కానీ జరిగింది వేరు.
మంచు దిబ్బను ఢీకొని టైటానిక్ అట్లాంటిక్ సముద్రంలోకి ఒరిగిపోయింది.
మైఖేల్‌ని, ఎడ్మండ్‌ని లైఫ్బోట్లో ఎక్కించి, ఓడతో పాటే తనూ మునిగిపోయాడు నవ్రాతిల్. కేబుల్ షిప్ గాలింపులలో దొరికిన పదిహేనవ మృతదేహం అతడిదే ! టైటానిక్ మునిగిపోతున్న రాత్రి లైఫ్బోట్లో అనాథలుగా ఉన్న మైఖేల్నీ, ఎడ్మండ్నీ మార్గరెట్ హేస్ అనే ఫ్రెంచి మహిళ చేరదీసి, తన సంరక్షణలో ఉంచుకుంది. టైటానిక్ ప్రమాదంలో బతికి బయటపడిన ఫస్ట్ క్లాస్ ప్రయాణీకులలో మార్గరెట్ హేస్ కూడా ఒకరు. ఆవిడ తనతోపాటు పిల్లల్ని తన ఉంటున్న న్యూయార్క్ తీసుకెళ్లింది.
ఈ విషయాలేవీ నవ్రాతిల్ భార్య (పిల్లల తల్లి)కి తెలీవు. ప్రమాదం జరిగిన నెల రోజులకు ‘మిరాకిల్ ఎస్కేప్’ అంటూ పేపర్లలో వచ్చిన తన ఇద్దరు బిడ్డల ఫొటోను చూసిన వెంటనే ఆమె న్యూయార్క్ వెళ్లి మార్గరెట్ హేస్ ను కలుసుకున్నారు. దేవుడికి, హేస్కి ధన్యవాదాలు తెలుపుకుని బిడ్డల్ని తనతోపాటు నైస్ (ఫ్రాన్స్)కి తెచ్చుకున్నారు. పిల్లలు పెరిగి పెద్దవాళ్లయ్యారు. మైఖేల్ ఫిలాసఫీ ప్రొఫెసర్ అయ్యాడు. 92 ఏళ్ల వయసులో 2001లో చనిపోయాడు. చిన్నవాడు ఎడ్మండ్ ఆర్కిటెక్ట్ అయ్యాడు. రెండో ప్రపంచ యుద్ధంలో యుద్దఖైదీగా జైలుశిక్షను అనుభవించి, దీర్ఘకాల అనారోగ్యంతో 1953లోనే చనిపోయాడు.
మైఖేల్‌కి కొద్దిగా తండ్రి జ్ఞాపకాలుండేవి. ‘‘మైఖేల్, మై చైల్డ్... ఈసారి మీ అమ్మను కలిసినప్పుడు చెప్పు. తనను నేను ఎంతగానో ప్రేమించాననీ, ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నాననీ! నాకు నమ్మకం, తను మనల్ని కలుపుకుంటుంది. తిరిగి అందరం సంతోషంగా ఉంటాం’’ అని తండ్రి తనతో అనడం గుర్తుందని మైఖేల్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించినట్లు ఎన్సైక్లోపీడియా ఆఫ్ టైటానికా వెబ్సైట్లో ఉంది. ఎనభై నాలుగేళ్ల తర్వాత మైఖేల్ తొలిసారి తన తండ్రి సమాధిని దర్శించి, దానిని స్పృశించినప్పుడు... చిన్నప్పుడు తండ్రి తన కోసం పాడిన లాలిపాట లీలగా హృదయాన్ని తాకిందట!
మైఖేల్ నవ్రాతిల్ ఇప్పటి స్లొవేకియాలో 1880 ఆగస్టు 13న జన్మించాడు. 1902లో ఫ్రాన్స్ వచ్చి, అక్కడి నైస్ ప్రాంతంలో స్థిరపడ్డాడు. అక్కడే 1907లో ఇటలీ అమ్మాయి మార్సెల్ కారెట్టోని వివాహం చేసుకున్నాడు. తర్వాత మనస్పర్థలు వచ్చి 1912లో విడాకులు తీసుకున్నారు. అప్పటికే వాళ్లకు ఇద్దరు పిల్లలు. వృత్తిరీత్యా టైలర్ అయిన నవ్రాతిల్ తన వివాహబంధపు చిరుగులకు అతుకులు వేసుకునే ప్రయత్నంలో భార్యకు, పిల్లలకు కాకుండాపోయాడు. నిజంగా, అతడొక దురదృష్టవంతుడైన తండ్రి.