ఐష్‌కు ఫ్రాక్ పల్లకి..!
పాపం..! ఐశ్వర్య అందం ప్రేక్షకుల్ని ఐస్ చేస్తే, ఓ ఐదుగుర్ని ఇబ్బందులపాలు చేసింది. వాళ్లెవరో కాదు... కేన్స్‌లో ఐశ్వర్యా రాయ్ బచ్చన్ వెంట నడిచిన టీమ్. నార్మల్‌గా ఎవరి బట్టలు వాళ్లకు భారం కావు. ఐశ్వర్య వేసుకున్న బట్టలు ఆమెకు మాత్రమే కాదు.. ఇతరులకు బరువయ్యాయి. డ్రస్సు వేసుకుంది ఐశ్వర్యే. కానీ, మోసింది మాత్రం ఐదుగురు. దుబాయ్ బేస్డ్ ఫిలిప్పినో ఫ్యాషన్ డిజైనర్ మైఖేల్ సింకో డిజైన్ చేసిన ఊదా రంగు గౌనులో మొన్న 19వ తేదీన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఐశ్వర్య సందడి చేశారు. ఆ డ్రస్సు, అందులో ఆమె అందం గురించి వంక పెట్టలేం.
కానీ, ఆ డ్రస్సును క్యారీ చేయడానికి ఐశ్వర్యతో పాటు ఆమె టీమ్ నానా హైరానా పడ్డారు. గౌను సైజు చూశారుగా, ఎంతుందో? పైగా, థిక్ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేశారట. గౌను బరువును మోయలేక హోటల్ నుంచి బయటకు వచ్చినప్పుడు... వ్యాన్‌లో ఎక్కడానికి నలుగురి సహాయం తీసుకున్నారు ఐష్. ఫిల్మ్ ఫెస్టివల్లో రెడ్ కార్పెట్ దగ్గరకు వచ్చినప్పుడు కూడా సేమ్ సీన్. అక్కడ ఓ ఐదుగురు డ్రస్సును మోశారు. పాపం... అంతంత భారీ గౌనులు వేసుకోవడం ఎందుకు? బాధ పడడం ఎందుకు? అని నెట్టింట్లో కొందరు జాలి పడ్డారు. రెడ్ కార్పెట్ అంతటినీ తుడిచేద్దామని ఐశ్వర్య ఈ గౌను వేసుకుందా? అని మరికొందరు సెటైర్స్ వేశారు. ఏదేమైనా.. భారీ గౌనులో స్లిమ్‌గా కనిపించిన ఐష్‌ని చూసి, ఈవిడగారు ఓ బిడ్డకు తల్లేనా? 43 ఏళ్ల వయసు ఉంటుందా? అని చాలామంది ఆశ్చర్యపోయారు.