స్మోక్ డిటెక్టర్లు ఎలా పనిచేస్తాయి?
హౌ ఇట్ వర్క్స్
అగ్ని ప్రమాదాలను నివారించడంలో స్మోక్ డిటెక్టర్లు ఎంతో కీలకం. ఇళ్లల్లో మొదలుకొని... పెద్ద పెద్ద భవంతుల్లో, ఆఫీసుల్లో ఎక్కడైనా వీటిని అమర్చుకోవడం ద్వారా ఆస్తి, ప్రాణ నష్టాలను నివారించవచ్చు. నిప్పు లేకుండా పొగ రాదంటారు కదా మరి ఈ పొగను స్మోక్ డిటెక్టరైనా ఎలా గుర్తిస్తుంది? నిజానికి స్మోక్ డిటెక్టర్ ఓ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ మాత్రమే. కొన్ని రకాల వాయు కణాలు ఈ సర్క్యూట్‌ను అడ్డుకున్నా, లేదా ఇబ్బందులు కలగజేసినా అలారం మోగిపోతుంది. ఈ సర్క్యూట్ పరికరంలోని చిన్న గదిలాంటి నిర్మాణంలో ఉంటుంది. రెండు ఎలక్ట్రోడ్ల మధ్య అతితక్కువ గ్యాప్ ఉండేలా దీన్ని ఏర్పాటు చేస్తారు.
ఈ రెండు ఎలక్ట్రోడ్ల మధ్య విద్యుత్తు వైర్లెస్ పద్ధతిలో ప్రవహిస్తూ ఉంటుంది. సర్క్యూట్‌కు అనుసంధానమైన మైక్రోచిప్ విద్యుత్ ప్రవాహాన్ని నిత్యం గమనిస్తూ ఉంటుంది. అగ్ని ప్రమాద వేళల్లో ముందుగా పొగ పుట్టుకొచ్చినప్పుడు ఆ పొగలోని కణాలు స్మోక్ డిటెక్టర్‌లో ఎలక్ట్రోడ్లు ఉన్న చాంబర్లోకి వెళతాయి. ఫలితంగా విద్యుత్ ప్రవాహంలో తేడా వస్తుంది. దీన్ని గుర్తించే మైక్రోచిప్ వెంటనే అలారం మోగేలా చేస్తుంది.