Microwave oven
-
సూట్‌కేస్‌లా కనిపిస్తుంది, కానీ సూట్‌కేస్ కాదు.. మరి ఏంటేంటే..
ఇప్పటి దాకా పోర్టబుల్ గ్రిల్, పోర్టబుల్ స్టవ్, పోర్టబుల్ కుకర్ ఇలా చాలానే చూసుంటారు కానీ.. పోర్టబుల్ మైక్రోవేవ్‌ని చూశారా? లేటెస్ట్ వెర్షన్ గా వచ్చిన ఈ కుక్వేర్ని ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లొచ్చు. దీన్ని ఓపెన్ చేసి సెట్ చేస్తే ఓవెన్‌లా.. ఫోల్డ్ చేసి లాక్ చేస్తే చిన్న సూట్‌కేస్‌లా ఉంటుంది. ఇది జపానీస్ టెక్నాలజీతో రూపొందింది. బ్యాటరీతో పని చేస్తుంది. హ్యాండిల్‌ని వెనక్కి జరిపితే లాక్ ఓపెన్ అవుతుంది. అప్పుడు సూట్‌కేస్ ఓపెన్ అయ్యి.. ఓవెన్ లా మార్చుకోవడానికి వీలుంటుంది. దీన్ని ఎలా ఉపయోగించుకోవచ్చో చిత్రాల్లో చూడొచ్చు. అయితే ఈ మోడల్ వినియోగదారులకు ఇంకా అందుబాటులోకి రాలేదు. -
మైక్రోవేవ్ ఓవెన్.. ఓ కాలుష్య బాంబు
లండన్: వంటింట్లో వాడుతున్న మైక్రోవేవ్ ఓవెన్ కాలుష్యాన్ని వెదజల్లే బాంబు అని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కారు నుంచి వెలువడే కార్బన్ డయాక్సైడ్ కన్నా ఓవెన్ల నుంచి వెలువడే కార్బన్ డయాక్సైడే అధికమని తాజా పరిశోధనలో తేలింది. యూరప్‌లో ఒక్క ఏడాది కాలంలో ఓవెన్ల నుంచి 7.7 మిలియన్ల టన్నుల కార్బన్ డయాక్సైడ్ వెలువడుతుంది. ఇది ఒక ఏడాదిలో 68 లక్షల కార్ల నుంచి వెలువడే కార్బన్ డయాక్సైడ్తో సమానం. అక్కడ గంటకు 9.4 టెరావాట్ల విద్యుత్‌ను ఓవెన్లు వాడేస్తున్నాయి. ఇది ఏడాది కాలంలో 3 పెద్ద గ్యాస్ విద్యుత్ ప్లాంట్లు ఉత్పత్తి చేసే విద్యుత్‌తో సమానం. ఓవెన్ల తయారీ దశ నుంచి వ్యర్థాలుగా మారే దశ వరకు పర్యావరణంపై చూపే దుష్ప్రభావాన్ని అంచనా వేసేందుకు బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్‌కు చెందిన పరిశోధకులు ఈ అధ్యయనాన్ని చేపట్టారు. -
మైక్రోవేవ్ ఓవెన్ భగ్గుమంటే...!
ఇంట్లో ఉన్నట్టుండి.. మీ గ్యాస్ స్టౌ భగ్గుమని వెలిగిందనుకోండి! ఎలా ఉంటుంది? ఏ దెయ్యమో.. భూతమో చేరిందని కొందరు అను కుంటారుగానీ.. ఈ కాలంలో అవేవి అవసరం లేదు. కేవలం ఇంటర్నెట్కు అనుసం ధానమైన ఎలక్ట్రానిక్ పరికరాలు ఉంటే చాలు. సరిగ్గా ఇదే తరహాలో ఈ మధ్య ఓ కంపెనీకి చెందిన మైక్రోవేవ్ ఓవెన్ సాఫ్ట్‌వేర్‌లో తలెత్తిన లోపం కారణంగా అవి కాస్తా భగ్గుమంటున్నాయంట! ఈ లోపాన్ని ఆధారంగా చేసుకుని హ్యాకర్లు మైక్రోవేవ్ ఓవెన్లను తమ నియంత్రణలోకి తెచ్చేసుకున్నారు. ఇంకేముంది.. హ్యాకర్లు ఎప్పుడు కావా లంటే అప్పుడు.. ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మైక్రోవేవ్ ఓవెన్లను ఆన్/ఆఫ్ చేయడం లేదంటే.. ప్రీహీట్ చేయడం హ్యాకర్లకు వీలైంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇలా జరిగితే ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి. వేడి ఎక్కువైతే అగ్ని ప్రమాదం కూడా జరగవచ్చు. అంతేనా ఆటోమేటిక్ వ్యాక్యూమ్ క్లీనర్లలోని కెమెరాలతో హ్యాకర్లు మీ ఇంట్లో జరిగే ప్రతి విషయాన్ని రహస్యంగా గమనిం చేందుకూ వీలేర్పడింది. మరి నిజంగా ఇలా జరిగిందా? స్పష్టంగా తెలియదుగానీ.. చెక్‌పాయింట్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ అనే సంస్థ ఈ లోపాన్ని పసిగట్టింది. సదరు కంపెనీని అప్రమత్తం చేసింది. దీంతో తాము నెల రోజుల క్రితమే సాఫ్ట్వేర్ లోపాన్ని సరిదిద్దామని కంపెనీ తెలిపింది. గత ఏడాది దాదాపు 8 కోట్ల స్మార్ట్ హోమ్ పరికరాలు అమ్మిన ఈ కంపెనీ వినియోగదారులందరూ స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ ద్వారా సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేసుకోవాలని సూచించింది. హమ్మయ్యా.. గండం గడిచిందన్నమాట! -
పసికందును చంపిన తల్లికి జీవిత ఖైదు
కాలిఫోర్నియా: అమెరికాలో నెల రోజుల ఆడశిశువును చంపిన కేసులో తల్లికి జీవిత ఖైదు పడింది. కాలిఫోర్నియా కోర్టు క యంగ్ (34) అనే మహిళకు 26 ఏళ్ల కారాగార శిక్ష విధించింది. 2011లో క యంగ్ తన బిడ్డను మైక్రోవేవ్ ఓవెన్లో ఐదు నిమిషాల పాటు ఉంచింది. తీవ్రంగా గాయపడిన పసికందు మరణించింది. కాగా యంగ్ మూర్ఛ వ్యాధితో బాధపడుతోందని, ఆ సమయంలో ఏం చేసిందో ఆమె తెలుసుకునే స్థితిలో లేదని ఆమె తరపు న్యాయవాది వాదించారు. అయితే కోర్టు ఈ వాదనలను తోసిపుచ్చుతూ క యంగ్‌ను దోషిగా నిర్ధారిస్తూ తీర్పు వెలువరించింది. కాగా ఆమెకు మరో ముగ్గురు పిల్లలు ఉన్నారు.