అప్పుల భోజనం
నాలుగు నెలలుగా అందని బిల్లులు
ఆందోళనలో మధ్యాహ్న భోజన కార్మికులు
పెరిగిన నిత్యావసరాల ధరలు
దిక్కుతోచని స్థితిలో నిర్వాహకులు
కరీంనగర్ రూరల్ : బిల్లులు అందక మధ్యాహ్న భోజన కార్మికులు అప్పులపాలవుతున్నారు. నాలుగు నెలలుగా ఒక్క పైసా రాకపోవడం..నిత్యావసరాల ధరలు పెరగడంతో ఏం చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. మండల వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలోని మధ్యాహ్న భోజన కార్మికులకు నాలుగు నెలల బిల్లులు దాదాపు రూ.25లక్షలు రావాల్సి ఉంది. కరీంనగర్ మండలంలో ప్రాథమిక పాఠశాలలు 47, ప్రాథమికోన్నత 8, జెడ్పీపాఠశాలలు 15 ఉన్నాయి. మొత్తం 4,912 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. శనివారం చామన్‌పల్లి జెడ్పీ పాఠశాలలో మధ్యాహ్నభోజనం పథకం అమలు చేస్తున్న తీరును ‘సాక్షి’ పరిశీలించగా పలు విషయాలు వెలుగుచూశాయి.
బెంబేలెత్తిస్తున్న ధరలు
మధ్యాహ్న భోజనం వండేందుకు అవసరమైన నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కంది, పెసరపప్పు, నూనె, కోడిగుడ్లు, కూరగాయాలు ధరలు పెరగడంతో ప్రతిరోజు కొనుగోలు చేయడం భారంగా మారింది.
ప్రతి రోజు ఒక్కో విద్యార్థికి భోజన ఖర్చు ప్రభుత్వం రూ.6.40 నిర్వాహకులకు చెల్లిస్తోంది. కోడిగుడ్డు ధర మార్కెట్లో ప్రస్తుతం రూ.5 ఉండగా ప్రతి సోమ, గురువారం విద్యార్థులకు కోడిగుడ్లతో భోజనం పెట్టాల్సి రావడంతో నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అప్పులతో సామగ్రి
వంట చేసేందుకు అవసరమైన కిరాణ సామగ్రిని అప్పుపై తీసుకొస్తున్నారు. ప్రభుత్వం కేవలం బియ్యం మాత్రమే సరఫరా చేస్తుండగా పప్పులు, నూనె, కట్టెలు, కూరగాయాలు, కోడిగుడ్లను కిరాణ దుకాణంలో వాయిదాపై కొనుగోలు చేస్తున్నారు. నాలుగు నెలలుగా బిల్లులు అందక అప్పులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నామని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు రూ.30వేల వరకు అప్పులైనట్లు తెలిపారు.
బిల్లులు రాక ఇబ్బంది
– కొట్టె లక్ష్మి, అవారి లచ్చమ్మ
నాలుగు నెలలుగా వంట బిల్లులు రాకపోవడంతో ఇబ్బందవుతుంది. పప్పులు, నూనె, కూరగాయాలను ఉద్దెరపై కొంటున్నాము. ఐదు నెలలుగా జీతం ఇత్తలేదు. వంటచేసిన బిల్లులిత్త లేదు. జీతాలివ్వకపోవడంతో అప్పులపాలవుతున్నాము. వెంటనే బిల్లులిచ్చి ఆదుకోవాలి.
మెనూ ప్రకార ం భోజనం
– కె.లక్ష్మారెడ్డి, ప్రధానోపాధ్యాయుడు, చామన్‌పల్లి
మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం వడ్డిస్తున్నాము. నిర్వాహకులతో రుచికర వంటను చేయించేందుకు కషి చేస్తున్నాము. ప్రతిరోజు ఉపాధ్యాయుల పర్యవేక్షణలో నిర్వాహకులతో వంట చేయిస్తున్నాము. ప్రతి రోజు ఉపాధ్యాయుడు రుచిచూసిన తర్వాతే విద్యార్థులకు పెడుతున్నాము.
త్వరలో బిల్లులు మంజూరు
– చుక్కారెడ్డి, ఎంఈవో
మధ్యాహ్న భోజనం పథకం బిల్లులు రెండు, మూడు రోజుల్లో చెల్లిస్తాం. అన్ని పాఠశాలల నుంచి నాలుగు నెలలకు సంబంధించిన బిల్లులను ట్రెజరీ కార్యాలయానికి పంపించాము. ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేసిన తర్వాత చెల్లిస్తాం.