విభిన్నంగా ఆలోచిస్తే.. యువతదే ‘భవిత’
గెస్ట్ కాలమ్
మన దేశం శాస్త్ర, సాంకేతిక రంగాల్లో శరవేగంగా పురోభివృద్ధి సాధిస్తోంది. జలాంతర్గాముల నుంచి శాటిలైట్ ప్రయోగాల వరకు ఎన్నో అద్భుత ఆవిష్కరణలు చేస్తోంది. విశ్వవ్యాప్త గుర్తింపు పొందుతోంది. ఇదే సమయంలో ప్రస్తుతం అన్ని రంగాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య.. నిపుణులైన మానవ వనరుల కొరత. ఇంజనీరింగ్, సైన్స్ విభాగాల్లో ఈ సమస్య అధికంగా ఉంది. కాబట్టి విద్యార్థులు విభిన్న ఆలోచనలతో అడుగులు వేస్తే రాబోయే రోజుల్లో యువతదే భవిత అంటున్నారు మిధాని చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ డాక్టర్ ఎం.నారాయణరావు. మెకానికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్, న్యూక్లియర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌లో పీజీ పూర్తి చేసిన ఆయన ప్రముఖ పరిశోధన సంస్థ బార్క్‌లో జూనియర్ సైంటిస్ట్‌గా కెరీర్ ప్రారంభించారు. మినీరత్న హోదా కలిగిన ప్రభుత్వ రంగ సంస్థ మిధాని సీఎండీ స్థాయికి ఎదిగిన నారాయణరావుతో ఇంటర్వ్యూ..
‘కోర్’కున్న అవకాశాలెన్నో
ఇంజనీరింగ్, టెక్నాలజీ అనగానే ఇప్పుడు ఎక్కువ మంది విద్యార్థుల ప్రాధాన్యం సాఫ్ట్వేర్ రంగమే. కారణం.. ఆ రంగంలో అన్ని ఇంజనీరింగ్ బ్రాంచ్‌ల వారికి అవకాశాలు లభిస్తుండటమే! ఇటీవల కాలంలో దేశంలో పెరుగుతున్న పరిశోధన కార్యకలాపాలు, పారిశ్రామికీకరణతో మెకానికల్, ఎలక్ట్రికల్ వంటి కోర్ ఇంజనీరింగ్ విభాగాల్లోనూ అవకాశాలు విస్తృతం అవుతున్నాయి. కంపెనీలకు కోర్ విభాగంలో నిపుణులైన మానవ వనరులను అన్వేషించడం పెద్ద సవాలుగా మారింది. కాబట్టి భవిష్యత్‌లో కోర్ రంగంలో అవకాశాలు పుష్కలమని చెప్పొచ్చు.
ఉన్నత విద్యతో సమున్నత స్థానాలు
ప్రస్తుతం చాలా మంది బీటెక్ విద్యార్థుల్లో ఉద్యోగ సాధన తొలి లక్ష్యంగా మారింది. విద్యార్థుల సామాజిక-ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా దాన్ని తోసిపుచ్చలేం. అయితే, ఇంజనీరింగ్, సైన్స్ రంగాల్లో ఉన్నత విద్య ద్వారా మరిన్ని సమున్నత స్థాయికి చేరుకోవచ్చు. ఇటీవల కాలంలో పీజీ స్థాయిలో పలు ఫెలోషిప్‌లు, స్కాలర్షిప్లు లభిస్తున్నాయి. ఫలితంగా పీజీ కోర్సుకయ్యే వ్యయభారం తగ్గుతోంది. అకడమిక్ నైపుణ్యాలు మెరుగ్గా ఉన్న విద్యార్థులు, ఉన్నత విద్య ఔత్సాహికులు వీటిని అందిపుచ్చుకోవాలి. పీజీ స్థాయిలో ఆర్థిక ప్రోత్సాహకాలు అందిస్తున్న ఇన్స్టిట్యూట్లు, వాటిలో ప్రవేశానికి అవసరమైన విధివిధానాలపై అవగాహన పెంచుకోవాలి. తద్వారా ఉన్నత విద్యను అభ్యసించి ఉజ్వల భవిష్యత్తుకు మార్గం వేసుకోవచ్చు.
ప్రొడక్ట్ డెవలప్మెంట్ నైపుణ్యాలు
కోర్ విభాగంలో భవిష్యత్తును కొనసాగించాలనుకునే విద్యార్థులు కేవలం ప్రొడక్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ టెక్నాలజీస్కే పరిమితం కాకూడదు. ప్రొడక్ట్ డెవలప్మెంట్ చేసే విధంగా నైపుణ్యాలు సాధించాలి. ఇందుకోసం నిరంతరం క్షేత్రస్థాయి అధ్యయనం చేయాలి. ఆధునిక అవసరాలు, లక్షిత వినియోగదారుల సౌలభ్యాలను దృష్టిలో పెట్టుకుని ప్రొడక్ట్‌ను డెవలప్ చేసేలా రాణించాలి. ఉదాహరణకు రక్షణ రంగంలో వినియోగించే మిస్సైల్స్ ఒకప్పుడు భారీ పరిమాణంలో ఉండేవి. కానీ క్రమేణా వాటి పరిమాణం తగ్గుతూ వస్తోంది. అదేవిధంగా వాటర్ స్ట్రీమ్ ఇంజన్స్ కూడా. నిరంతరం పరిశోధనలు, ఎందరో శాస్త్రవేత్తల కృషి ఫలితంగా ఇవి సాధ్యమవుతున్నాయి. అంటే.. ఒక రంగంలో పరిశోధన ఔత్సాహికులు నిరంతరం నూతన ఆవిష్కరణల దిశగా ఆలోచించగలిగితేనే రాణించగలరు.
రీసెర్చ్ ప్రాధాన్యం పెరగాలి
అంతర్జాతీయ స్థాయిలో దీటైన పోటీ ఇచ్చే దిశగా డిఫెన్స్, స్పేస్ వంటి విభాగాల్లో పరిశోధనలు విస్తృతమవుతున్నాయి. ఎన్నో సరికొత్త ఆవిష్కరణలు జరుగుతున్నాయి. కాబట్టి యువతను రీసెర్చ్ దిశగా ప్రోత్సహించేందుకు అకడమిక్ ఇన్స్టిట్యూట్ల స్థాయి నుంచే తగిన చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఇండస్ట్రీ వర్గాలను మెప్పించి స్పాన్సర్డ్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్ నిర్వహించి, విద్యార్థులను భాగస్వాములను చేయాలి.
ఈ విషయంలోనే మనం అకడమిక్‌గా కొంత వెనుకంజలో ఉన్నాం. ఐఐటీలు, ఐఐఎస్సీ వంటి పేరున్న ఇన్‌స్టిట్యూట్‌ల్లో సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ రీసెర్చ్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. కానీ ఇతర అనేక ఇన్‌స్టిట్యూట్‌ల్లో కనీసం ఆర్ అండ్ డీ గురించి ప్రాథమిక అవగాహన కల్పించే సౌకర్యాలు కూడా ఉండట్లేదు. విద్యార్థులు సీఎస్ఐఆర్ ల్యాబ్‌లు, బార్క్, ఐఐఎస్సీ వంటి పలు సంస్థల్లో అందిస్తున్న జేఆర్ఎఫ్, ఎస్ఆర్ఎఫ్ వంటి ప్రోత్సాహకాలు అందిపుచ్చుకోవాలి.
సరైన సమయం ఇదే
ఆర్ అండ్ డీ విభాగంలో భవిష్యత్తును కోరుకునే వారికి ఇదే సరైన సమయం. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పరిశోధనల తీరు, వాటి ప్రగతిని పరిగణనలోకి తీసుకుంటే వచ్చే ఐదేళ్లలో అంటే 2020 నాటికి పరిశోధనలకు కేరాఫ్‌గా నిలుస్తున్న జపాన్, జర్మనీ వంటి ఎన్నో దేశాలను భారత్ అధిగమించడం ఖాయం. ఇటీవల కాలంలో పలు రంగాల్లో భారత్ సాధించిన విజయాల కారణంగా (ఉదా: ఉపగ్రహ ప్రయోగాలు) ఎన్నో దేశాలు మనవైపు చూస్తున్నాయి. మన దేశంతో భాగస్వామ్యం దిశగా చర్చలు సాగిస్తున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుంటే సమీప భవిష్యత్తులో మరెన్నో ప్రయోగాలకు భారత్ వేదికగా నిలవనుంది.
యంగ్ టాలెంట్ సెర్చ్
అవకాశాల కోణంలో విశ్లేషిస్తే ఇప్పుడు అన్ని రంగాల్లో కంపెనీలు యంగ్ టాలెంట్‌కు పెద్దపీట వేస్తున్నాయి. ఇందుకోసం విస్తృత అన్వేషణ సాగిస్తున్నాయి. కంపెనీల మనుగడకు మెరుగైన మానవ వనరులను సొంతం చేసుకోవడం సవాలుగా మారింది. దీంతో యువ ప్రతిభావంతులను నియమించుకొని తమ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుకునేందుకు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పుడు యువతకు వేల సంఖ్యలో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా సైన్స్, ఇంజనీరింగ్ విభాగాల్లో వచ్చే రెండు దశాబ్దాల్లో యువతదే పైచేయి కానుంది. కావల్సిందల్లా అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా నైపుణ్యాలను సొంతం చేసుకోవడమే.
వినూత్న ఆలోచనే విభిన్న అవకాశాలకు మార్గం
ప్రస్తుతం దేశంలో ఫలానా రంగం అని కాకుండా అన్ని రంగాల్లోనూ అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. వీటిని సొంతం చేసుకోవడానికి వినూత్న ఆలోచనలతో, విస్తృత దృక్పథంతో ముందడుగు వేయాలి. కోర్ సామర్థ్యాలను పెంచుకుంటూనే సమకాలీన మార్పులపై అవగాహన పెంచుకోవాలి. కోర్ నైపుణ్యాల సాధనకే పరిమితం కాకుండా.. అనుబంధ రంగాల్లోనూ పరిజ్ఞానం సొంతం చేసుకుంటే ఇంజనీరింగ్ విద్యార్థులకు అద్భుత భవిష్యత్తు ఖాయం!!
ఎడ్యూన్యూస్
సీబీఎస్ఈ స్కూళ్లలో నాణ్యత సమీక్షలు సీబీఎస్ఈ పాఠశాలల్లో ప్రమాణాలు పెంచే దిశగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) అనుబంధ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో నిరంతరం నాణ్యత సమీక్షలు నిర్వహించేందుకు స్కూల్ క్వాలిటీ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ పేరుతో కొత్త కార్యక్రమానికి రూపకల్పన చేసింది. దీనికి సంబంధించి ప్రిన్సిపల్స్, రిటైర్డ్ ప్రిన్సిపల్స్‌తో కూడిన పలు బృందాలను పీర్ అసెస్మెంట్ టీమ్ పేరిట నియమించనున్నట్లు ప్రకటించింది. సీబీఎస్ఈ పేర్కొన్న నిర్దిష్ట అంశాలు-వాటి అమలు తీరు ప్రాతిపదికన ఈ బృందాలు ఆయా పాఠశాలల నాణ్యత ప్రమాణాలను సమీక్షిస్తాయి.
దేశవ్యాప్తంగా కేజీ టు పీజీ ఇన్స్టిట్యూట్స్!
దేశంలో వెనుకబడిన జిల్లాలన్నింటిలో కేజీ టు పీజీ ఇన్స్టిట్యూట్స్ నెలకొల్పేందుకు కేంద్రం యోచిస్తోంది. ఉన్నత విద్య కోసం దూర ప్రాంతాలకు వెళ్లలేని కారణంగా లక్షల సంఖ్యలో విద్యార్థులు చదువుకు దూరమవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 2015-16 బడ్జెట్లో ఈ అంశం చేర్చనున్నట్లు తెలుస్తోంది. దీనికి ఆమోదం లభిస్తే కిండర్ గార్టెన్ నుంచి పీజీ వరకు ఒకే ప్రాంగణంలో చదువుకునే అవకాశం లభిస్తుంది.