mig-21 fighter
-
రాజస్తాన్‌లో కుప్పకూలిన మిగ్-21 ఫైటర్ జెట్
సాక్షి, జైపూర్: రాజస్తాన్‌లోని జైసల్మేర్‌లో శుక్రవారం మిగ్-21 ఫైటర్ జెట్ కుప్పకూలింది. అయితే ఇండో-పాక్ బార్డర్ వద్ద ఈ యుద్ధ విమానం కూలడం పలు అనుమానాలకు తావిస్తోంది. సమాచారం అందుకున్న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పరిస్థితిని సమీక్షించడానికి రంగంలోకి దిగింది. మిగ్-21 జెట్ సాంకేతిక సమస్యల కారణంగా కూలిందా లేక ఉగ్రవాదుల హస్తం ఏమైనా ఉందా అన్నది తెలియాల్సి ఉంది. -
చరిత్ర సృష్టించిన శివాంగి సింగ్
న్యూఢిల్లీ: వైమానిక దళంలో చేరిన అత్యాధునిక రఫేల్ ఫైటర్ జెట్ల దళంలోకి అడుగుపెట్టనున్న మహిళా పైలట్ ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. అంబాలా కేంద్రంగా పనిచేసే ‘గోల్డెన్ యారోస్’ 17 స్క్వాడ్రన్‌లోకి ఎంపికైన తొలి మహిళగా ఫ్లైట్ లెఫ్టినెంట్ శివాంగి సింగ్ చరిత్ర సృష్టించారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా శివాంగికి అభినందనలు తెలుపుతూ.. ‘‘దేశమంతా నిన్ను చూసి గర్విస్తోంది’’ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. కాగా వారణాసికి చెందిన శివాంగి 2017లో భారత వైమానిక దళంలో చేరారు. మిగ్-21 బైసన్ యుద్ధ విమానాలు నడిపిన అనుభవం ఆమె సొంతం. రాజస్తాన్ బార్డర్ బేస్‌లో అభినందన్ వర్ధమాన్‌తో కలిసి ఫైటర్ జెట్లు నడిపిన శివాంగి త్వరలోనే రఫేల్ స్క్వాడ్రన్‌లో చేరేందుకు అంబాలాలో అడుగుపెట్టనున్నారు. (చదవండి: నావికా నాయికలు) ఇక వారణాసిలో ప్రాథమిక విద్యనభ్యసించిన శివాంగికి చిన్ననాటి నుంచే వైమానిక దళంలో చేరాలని కలలు కనేవారు. బెనారస్ హిందూ యూనివర్సిటీలో చేరిన అనంతరం తన ఆశయాన్ని నెరవేర్చుకునే దిశగా అడుగులుపడ్డాయి. అక్కడే నేషనల్ క్యాడెట్ కార్స్ప్ 7 యూపీ ఎయిర్ స్వాడ్రాన్‌లో భాగస్వామ్యమయ్యే అవకాశం లభించింది. ఈ క్రమంలో 2016లో ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో చేరి శిక్షణ ప్రారంభించారు. కాగా భారత్- చైనా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో రఫేల్ ఫైటర్ జెట్లు తూర్పు లద్ధాక్‌లో విధుల్లో పాల్గొంటున్నాయి. ఇక ఫ్రాన్సులో తయారైన 5 రఫేల్ ఫైటర్ జెట్లు ఈనెల 10న అంబాలా వైమానిక స్థావరం కేంద్రంగా పనిచేస్తున్న గోల్డెన్ యారోస్ స్క్వాడ్రన్‌లో అధికారికంగా చేరిన విషయం తెలిసిందే. -
రఫేల్‌కు మహిళా పైలట్
న్యూఢిల్లీ: వైమానిక దళంలో ఇటీవలే చేరిన అత్యాధునిక రఫేల్ ఫైటర్ జెట్ల దళంలోకి త్వరలో మహిళా పైలట్ ఒకరు చేరనున్నారు. మిగ్–21 ఫైటర్ జెట్ల మహిళా పైలట్ ఒకరు అంబాలా కేంద్రంగా పనిచేసే గోల్డెన్ యారోస్ స్క్వాడ్రన్‌లోకి ఎంపికయ్యారని భారత వైమానిక దళం(ఐఏఎఫ్) అధికారి ఒకరు తెలిపారు. రఫేల్ ఫైటర్ జెట్ పైలట్ కోసం చేపట్టిన అత్యంత కఠినమైన పరీక్షల్లో ఎంపికయిన ఈ మహిళా పైలట్ ప్రస్తుతం శిక్షణ పొందుతున్నారని ఆ అధికారి వెల్లడించారు. అత్యంత సమర్థమైనవిగా పేరున్న రఫేల్ యుద్ధ విమానాలకు మహిళా పైలట్ ఎంపిక కావడం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుందని పేరు వెల్తడించటానికి ఇష్టపడని ఐఏఎఫ్ అధికారి ఒకరు పేర్కొన్నారు. 2018లో యుద్ధ విమానాన్ని ఒంటరిగా నడిపిన మొదటి భారతీయ మహిళా పైలట్‌గా అవనీ చతుర్వేది చరిత్ర సృష్టించారు. అప్పట్లో ఆమె మిగ్–21 బైసన్ విమానాన్ని సొంతంగా నడిపారు. యుద్ధ విమానాల కోసం ప్రయోగాత్మకంగా మహిళలను ఎంపిక చేయాలన్న ప్రభుత్వం నిర్ణయం మేరకు.. 2016 జూలైలో ఎంపికైన ముగ్గురు మహిళల బృందంలో ఈమె కూడా ఒకరు. మిగతా ఇద్దరు పైలట్లు భావనా కాంత్, మోహనా సింగ్. ప్రస్తుతం ఐఏఎఫ్‌లో 10 మంది మహిళా పైలట్లు, సహాయకులుగా మరో 18 మంది ఉన్నారు. ఐఏఎఫ్‌లో మొత్తం మహిళా అధికారుల సంఖ్య 1,875. కాగా, రఫేల్ ఫైటర్ జెట్లు ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న భారత్, చైనా సరిహద్దుల్లోని లద్దాఖ్‌లో విధుల్లో పాల్గొంటున్నాయి. ఫ్రాన్సులో తయారైన 5 రఫేల్ ఫైటర్ జెట్లు అంబాలా వైమానిక స్థావరం కేంద్రంగా పనిచేస్తున్న గోల్డెన్ యారోస్ స్క్వాడ్రన్‌లో ఈ నెల 10వ తేదీన అధికారికంగా చేరిన విషయం తెలిసిందే. మొట్టమొదటి సారిగా 1951లో అంబాలా వైమానిక స్థావరంలో ఏర్పాటయిన ఈ స్క్వాడ్రన్ పేరిట పలు రికార్డులు నమోదై ఉన్నాయి. 1955లో మొట్టమొదటి ఫైటర్ జెట్ డి హవిల్లాండ్ వాంపైర్ ఈ స్క్వాడ్రన్లోనే చేరింది. ఫ్రాన్సుతో కుదుర్చుకున్న రూ.59వేల కోట్ల ఒప్పందంలో భాగంగా జూలైలో మొదటి విడతగా ఐదు రఫేల్ యుద్ధ విమానాలు వచ్చిన విషయం తెలిసిందే. నవంబర్ కల్లా రెండో విడతలో మరో నాలుగు, 2021 చివరి నాటికి మొత్తం 36 విమానాలు చేరనున్నాయి. రష్యా నుంచి సుఖోయ్ జెట్లను కొనుగోలు చేసిన 23 ఏళ్ల తర్వాత భారత్ యుద్ధ విమానాల కొనుగోలుకు కుదుర్చుకున్న భారీ ఒప్పందమిది. -
పాక్ పన్నాగాన్ని తిప్పికొట్టారిలా..
న్యూఢిల్లీ : మూడు పాకిస్తాన్ యుద్ధ విమానాలు బుధవారం ఉదయం 9.58 గంటలకు భారత గగనతలంలోకి చొరబడ్డాయని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. అందులో జేఎఫ్–17, ఎఫ్–16 లాంటి శక్తిమంతమైన విమానాలు ఉన్నాయి. క్రిష్ణగాటి, నంగి తేక్రిలోని ఆర్మీ స్థావరాలు, నారియన్‌లోని ఆయుధాగారాన్ని లక్ష్యంగా చేసుకుని ఆ విమానాలు దాడులకు దిగాయి. అవి జారవిడిచిన బాంబులు జనావాసాలకు దూరంగా పడటంతో ప్రాణనష్టం తప్పింది. వెంటనే స్పందించిన భారత వైమానిక దళం ప్రతీకార దాడులు ప్రారంభించింది. మిగ్–21, ఇతర యుద్ధ విమానాలతో ప్రత్యర్థికి దీటైన జవాబిచ్చింది. నౌషెరా, రాజౌరీలలోని కీలక స్థావరాలకు నష్టం కలగకుండా నిరోధించగలిగింది. మిగ్–21 బైసన్ విమానం కుప్పకూలే ముందు గగనతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణులతో పాకిస్తాన్ విమానం ఎఫ్–16ను నేలకూల్చింది. మన విమానాన్ని పాకిస్తాన్ విమానమే పేల్చి వేసిందా? లేదా క్షిపణితో దాడి చేశారా? అన్నది తెలియరాలేదు. ఉదయం 10.45 గంటలకు మిషన్ ముగిశాక అభినందన్ తప్ప మిగిలిన సిబ్బంది క్షేమంగా తిరిగొచ్చారు. -
ఎయిర్‌ఫోర్స్ చీఫ్.. ఓ యుద్ధవిమానం!
ఆయన భారత వైమానిక దళంలోనే అత్యున్నత అధికారి. విమానాలు నడిపించాల్సిన అవసరం ఆయనకు లేదు. కానీ, మన వైమానిక దళంలో అత్యంత పురాతనమైన విమానాలుగా పేరుపొందిన మిగ్-21 ఫైటర్ జెట్ నడిపి చూపించారు. అవును.. భారత వైమానిక దళ ప్రధానాధికారి బీఎస్ ధనోవా స్వయంగా మిగ్-21 నడిపించారు. రాజస్థాన్‌లోని ఉత్తర్లాయ్ అనే ప్రాంతంలో ఈ తరహా విమానాన్ని ఆయన నడిపించారు. ఆ ప్రాంతంలో ఆయన మూడు రోజుల పర్యటనలో ఉన్నారు. వైమానిక దళం చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆపరేషనల్ బేస్‌కు ఆయన వెళ్లడం ఇదే మొదటిసారి. కార్గిల్ యుద్ధ సమయంలో కూడా ధనోవా మిగ్ విమానాలు నడిపించారు. రాత్రిపూట చాలా సార్లు ఆయన ఈ విమానంలో వెళ్లి శత్రువుల మీద విరుచుకుపడ్డారు. దాంతో ఆయన వీరత్వానికి గాను ఆయనకు యుద్ధ సేవా మెడల్ కూడా లభించింది. ధనోవా కంటే ముందు ఎయిర్ చీఫ్ మార్షల్స్గా పనిచేసిన ఏవై టిప్నిస్, దిల్బాగ్ సింగ్ కూడా వీటిని నడిపించారు.