న్యూఢిల్లీ : మూడు పాకిస్తాన్ యుద్ధ విమానాలు బుధవారం ఉదయం 9.58 గంటలకు భారత గగనతలంలోకి చొరబడ్డాయని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. అందులో జేఎఫ్–17, ఎఫ్–16 లాంటి శక్తిమంతమైన విమానాలు ఉన్నాయి. క్రిష్ణగాటి, నంగి తేక్రిలోని ఆర్మీ స్థావరాలు, నారియన్‌లోని ఆయుధాగారాన్ని లక్ష్యంగా చేసుకుని ఆ విమానాలు దాడులకు దిగాయి. అవి జారవిడిచిన బాంబులు జనావాసాలకు దూరంగా పడటంతో ప్రాణనష్టం తప్పింది. వెంటనే స్పందించిన భారత వైమానిక దళం ప్రతీకార దాడులు ప్రారంభించింది.
మిగ్–21, ఇతర యుద్ధ విమానాలతో ప్రత్యర్థికి దీటైన జవాబిచ్చింది. నౌషెరా, రాజౌరీలలోని కీలక స్థావరాలకు నష్టం కలగకుండా నిరోధించగలిగింది. మిగ్–21 బైసన్ విమానం కుప్పకూలే ముందు గగనతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణులతో పాకిస్తాన్ విమానం ఎఫ్–16ను నేలకూల్చింది. మన విమానాన్ని పాకిస్తాన్ విమానమే పేల్చి వేసిందా? లేదా క్షిపణితో దాడి చేశారా? అన్నది తెలియరాలేదు. ఉదయం 10.45 గంటలకు మిషన్ ముగిశాక అభినందన్ తప్ప మిగిలిన సిబ్బంది క్షేమంగా తిరిగొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment