Migraine pain
-
నొప్పి భరించలేక యువతి ఆత్మహత్య
పెదగంట్యాడ(గాజువాక): భరించలేని తలనొప్పి కారణంగా ఓ యువతి శనివారం ఆత్మహత్య చేసుకుంది. న్యూపోర్టు పోలీసులు తెలిపిన వివరాలు.. పందిరి లక్ష్మీనారాయణ అనే వ్యక్తి టైలరింగ్ చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకువస్తున్నాడు. ఇతనికి కుమారుడు, కుమార్తె శ్రావణి (22) ఉన్నారు. కుమార్తె మూడేళ్లుగా మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతోంది. ఆమె డిగ్రీ కూడా మధ్యలో ఆపేసింది. ఎంతమంది వైద్యులకు చూపించినా ఫలితం లేకపోయింది. శనివారం యువతి తండ్రి పని మీద నగరానికి వెళ్లగా, తల్లి వేంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లింది. సోదరుడు మిత్రులతో కలసి బయటకు వెళ్లిపోయారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. గమనించిన చుట్టుపక్కల వారు వెంటనే ఆమెను గాజువాకలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అక్కడ ప్రాథమిక వైద్యం అనంతరం కేజీహెచ్‌కు తరలించారు. అక్కడికి చేరే సరికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. యువతి త్రండి ఫిర్యాదు మేరకు ఏఎస్ఐ రవి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మైగ్రేన్ వేధిస్తోందా? ఇలా చేయండి..
ఎన్ని రకాల వైద్యపరీక్షలు నిర్వహించినా ఏలోపం కనిపించకుండా వేధించే తలనొప్పే మైగ్రేన్. చాలామంది ఉద్యోగుల ఆఫీసు పనిగంటలూ, చాలామంది పిల్లల స్కూల్ అవర్స్ వృథా అయ్యేలా చేస్తుందీ మైగ్రేన్ సమస్య. సాధారణం మగపిల్లలతో పోలిస్తే అమ్మాయిల్లో ఇది ఎక్కువ. మైగ్రేన్‌కు కారణాలు, నివారణ, చికిత్స వంటి అంశాలను తెలుసుకోవడం కోసమే ఈ కథనం. మైగ్రేన్ సమస్య ఉన్నవారి మెదడు చుట్టూ ఉండే రక్తనాళాలు, వాటి పరిమాణం అకస్మాత్తుగా వ్యాకోచిస్తాయి. దాంతో ఆ పరిసరాల నరాలపై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. అప్పుడు ఆ నరాల నుంచి రసాయనాలు విడుదల అవుతాయి. వీటివల్ల నొప్పి, వాపు వస్తాయి. రక్తనాళాల పరిమాణం విస్తరించిన కొద్దీ నొప్పి ఎక్కువ అవుతుంది. ఈ సమస్య వల్ల శరీరంలోని సింపాథెటిక్ నరాల వ్యవస్థ ఉత్తేజానికి గురికావడంతో తీవ్రమైన తలనొప్పి వస్తుంది. ఈ తలనొప్పినే మైగ్రేన్ అంటారు. కారణాలు : ► తీక్షణమైన వెలుతురుకు ఎక్స్పోజ్ కావడం ► తీవ్రమైన మానసిక ఒత్తిడి ►నిద్రలేమి తరచూ ఉపవాసాలుండటం ►హార్మోన్ల సమస్యలుసరిపడని వాసనలు ►ఆల్కహాల్ అలవాటు, పొగాకూ... దాని ఉత్పాదనలు వాడటం, పొగతాగడం ►ఎక్కువగా కాఫీ తాగడం లేదా కెఫిన్ ఉండే పదార్థాలు తీసుకోవడం ►మహిళల్లో బహిష్టు ముందర ఈస్ట్రోజెన్ హార్మోన్స్ ఎక్కువగా స్రవించడం వల్ల మైగ్రేన్ కనిపించవచ్చు. లక్షణాలు : తలనొప్పి చాలా తీవ్రంగా వస్తుంది. ►తల బద్దలవుతున్నట్లుగా నొప్పి రావచ్చు. అది ఒక్కోసారి తలకు ఒకవైపు లేదా కొన్నిసార్లు రెండు వైపులా రావచ్చు. ►ఒక్కోసారి కళ్లచుట్టూ, కణతలో, తల వెనక భాగంలో తీవ్రమైన నొప్పి రావచ్చు .తలనొప్పి ఒక పక్క నుంచి మరో పక్కకు మారవచ్చు. ►రోజువారీ పనులు చేస్తుంటే నొప్పి మరీ ఎక్కువవుతుంది ►కొందరిలో వికారం, వాంతులు కనిపించవచ్చు. ►మరికొందరిలో అరుదుగా విరేచనాలు కావచ్చు. ►ఇకొందరిలో ముఖం పాలిపోవడం, కాళ్లూచేతులు చల్లబడటం జరగవచ్చు. ►సాధారణంగా చాలామందిలో వెలుతురు తట్టుకోలేకపోవడం, శబ్దం వినకలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ►చిరాకు, నీరసం, ఉత్సాహాంగా లేకపోవడం వంటి లక్షణాలూ ఉంటాయి. ∙తరచూ ఆవలింతలు కనిపిస్తుండవచ్చు. ముందస్తు హెచ్చరికలూ ఉంటాయి... ►మైగ్రేన్ సమస్య ఉన్నవారిలో తలనొప్పి వచ్చేముందర కొన్ని లక్షణాలను గమనించవచ్చు. వీటినే మైగ్రేన్ ఆరా అంటారు. అవి... కళ్ల ముందు మెరుపులు, ప్రకాశవంతమైన వెలుగులు కనిపించడం. ఈ మెరుపులు మధ్యలో మొదలై చివరలకు వెళ్లినట్లుగా ఉంటాయి. జాగ్రత్తలివే... ∙ఎక్కువ శబ్దాలూ, వెలుతురూ లేని గదిలో విశ్రాంతిగా పడుకోవాలి. ∙కంటినిండా నిద్రపోవాలి ∙మద్యం, పొగతాగే అలవాట్లు పూర్తిగా మానుకోవాలి. ∙కొవ్వుపదార్థాలు, తలనొప్పి ఉన్నప్పుడు ప్రోటీన్ ఫుడ్ అంటే మాంసం, పప్పులు తగ్గించాలి ∙రోజూ తగినంత నీరు తాగాలి. ∙జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి, రోజూ వ్యాయామం చేయాలి. ∙మానసిక ఒత్తిడి తగ్గించుకోడానికి బ్రీతింగ్ వ్యాయామాలూ, యోగా వంటివి అలవరచుకోవాలి. చికిత్స : మైగ్రేన్‌కు రెండు రకాల చికిత్సలు చేస్తారు. ఒకటి నొప్పి వచ్చినప్పుడు దాన్ని తగ్గించడానికి చేసే తక్షణ చికిత్స. మళ్లీ మళ్లీ నొప్పి రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన దీర్ఘకాలిక చికిత్స. డాక్టర్లు ఈ రెండు రకాల మందులు వాడుతూ చాలావరకు మైగ్రేన్‌ను నియంత్రణలో ఉంచుతారు. అయితే ఇది తీవ్రమైన తలనొప్పి కలిగించినప్పటికీ చాలామందిలో వయసు పెరుగుతున్న కొద్దీ ఇది రావడం తగ్గిపోతుంది. పైగా ప్రాణాపాయం లేని నిరపాయకరమైన సమస్య కావడం వల్ల దీనిపట్ల పెద్దగా ఆందోళన అక్కర్లేదు. -
మైగ్రేన్ బాధితులకు శుభవార్త !
మైగ్రేన్ తలనొప్పి ఎంతగా బాధపెడుతుందో అనుభవించేవారికి మాత్రమే తెలుసు.ప్రాణాంతకం కాకపోయినా... అది వచ్చిందంటే మాత్రం విద్యార్థులైతే చదువునూ, పనిచేసేవారైతే వాళ్ల పనినీ తీవ్రంగా ఆటంకపరుస్తుంది. అలాంటి మైగ్రేన్ బాధితులందరికీ ఇది ఒక శుభవార్తే. వాళ్ల కోసం లాస్మిడిటాన్ అనే మందు యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీయే) ఆమోదం పొందింది. కాకపోతే లాస్మిడిటాన్ మందు వాడాక కనీసం 8 గంటల పాటు డ్రైవ్ చేయకూడదు. అదొక్కటే ఈ మందుతో ఉన్న ఇబ్బంది. ఇక త్వరలోనే మరో కొత్త ఔషధం కూడా అందుబాటులోకి రాబోతోంది. ట్రయల్స్ ముగించుకొని త్వరలో అందుబాటులోకి రానున్న ఈ కొత్త మందు పేరే ‘ఉబ్రోజపాంట్’. ప్రస్తుతం మైగ్రేన్‌కు వాడుతున్న మందులు... రక్తనాళాలను కాస్తంత సన్నబరిచేలా చేసి, బాధ ఉన్న చోట రక్తం ఒకింత తక్కువ అందేలా చేయడం ద్వారా పనిచేస్తాయి. కానీ ఇలాంటి చికిత్స గుండెజబ్బులు / రక్తనాళాలకు సంబంధించిన వాస్కు్కలార్ జబ్బులు ఉన్నవారికి అంత మంచిది కాదు. అలాంటివారిలో అది గుండెపోటు లేదా పక్షవాతానికి కారణం కావచ్చు. కానీ లాస్మిడిటన్, ఉబ్రోజపాంట్ అలా కాదు. తలనొప్పికి కారణమవుతుందని భావిస్తున్న ప్రోటీన్‌ను టార్గెట్ చేస్తాయి. నొప్పి కలిగించే ఆ ప్రోటీన్‌పై దాడి చేయడం ద్వారా వారి తలనొప్పిని, ఇతర ఇబ్బందులను అరికడతాయి. న్యూయార్క్‌లోని మోంటెఫోయిర్ హెడేక్ సెంటర్లో ఆధ్వర్యంలో ట్రయల్స్‌లో ఉన్న ఉబ్రోజపాంట్ మందు గురించిన వివరాలు ప్రముఖ మెడికల్ జర్నల్ ‘జామా’లో ప్రచురితమయ్యాయి. ఇది కూడా అందుబాటులోకి మైగ్రేన్ రోగులకు ఎంతగానో వెలుసుబాటు కలుగుతుంది. -
మండే మైగ్రేన్
త్వరలో మైగ్రేన్ నొప్పికి మరింత మెరుగైన చికిత్స! కళ్లు మిరుమిట్లు గొలుపుతూ వెలుగుతూ ఆరుతూ (ఫ్లిక్కరింగ్) ఉన్న శక్తిమంతమైన కాంతిపుంజాలతో ఒకవైపు నొప్పి అని పిలిచే పార్శ్వపు నొప్పి వచ్చేస్తుంది. పైగా ఈ వేసవిలోని అత్యధిక కాంతికి మైగ్రేన్ సాధారణం. దీనికితోడు సమ్మర్ సెలవులంటూ ఈతకు వెళ్లేవారిలోనూ మైగ్రేన్ కనిపిస్తుంటుంది. వీకెండ్, ఆదివారాల్లో విశ్రాంతిగా ఉండే... సోమవారంనాడు తప్పనిసరిగా ఆఫీసుకు వెళ్లాల్సివచ్చి... తీవ్రమైన ఒత్తిడికి గురైనా మైగ్రేన్ వచ్చే అవకాశం ఉంది. మైగ్రేన్ ఎంతకూ తగ్గని వ్యాధిగా పేరొందింది. ఒకవేళ తగ్గినా మళ్లీ మళ్లీ వచ్చే వ్యాధి అనే అపప్రథా ఉంది. దీని బాధ అంతా ఇంతా కాక అనుభవించేవారికే తెలుస్తుంది. అయితే ఇటీవల దీన్ని తీవ్రతను తగ్గించేందుకు, గతంలో ఉన్న సంప్రదాయ మందులు, చికిత్స ప్రక్రియల స్థానంలో సాధ్యమైనంత త్వరలోనే చాలా కొత్తదైన ఓ చికిత్స ప్రక్రియ అందుబాటులోకి రానుంది. మైగ్రేన్ గురించి వివరాలతో పాటు... త్వరలో అందుబాటులోకి రానున్న ఆ సరికొత్త చికిత్స గురించి తెలుసుకుందాం... యువతీయువకులు తమ బాల్యం వీడి యుక్తవయసులోకి వచ్చే సమయంలో చాలామందిలో కనిపించే ఈ వ్యాధి యువతుల్లో మరీ ఎక్కువ. ఈ వ్యాధి బారిన పడేవారిలో 70 శాతం మంది కౌమార బాలికలే (అడాలసెంట్ గళ్స్). చాలా సందర్భాల్లో ఇది నుదుటికి ఒకవైపే వస్తుంది కాబట్టి మన వాడుక భాషలో దీన్ని పార్శ్వపు నొప్పి అని కూడా వ్యవహరిస్తుంటారు. దోహదపడే అంశాలు ఎన్నో అంశాలు మైగ్రేన్‌కు దోహదపడు తుంటాయి. అవి... తీవ్రమైన మానసిక ఒత్తిడి, అలసట (మానసిక, శారీరక) పెద్ద శబ్దాలు కళ్లు మిరుమిట్లుగొలిపే కాంతులు ఘాటైన దుర్వాసనలు డీహైడ్రేషన్ ఎక్కువ ఉపవాసాలు చేయడం, నిద్రలేమి లేదా అతిగా నిద్రపోవడం చాక్లెట్లు ఎక్కువగా తినడం, ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం. ఆల్కహాల్ లేదా నైట్రేట్ పాళ్లు ఉండే కొన్ని మందులతో మైగ్రేన్ వస్తుంది లేదా మరింత తీవ్రమవుతుంది. ప్రస్తుత చికిత్స సాధారణంగా మైగ్రేన్ ఉన్నవారికి రెండు రకాల చికిత్స చేస్తుంటారు. ఒకటి తక్షణం నొప్పి తగ్గించేందుకు మందులు ఇస్తుంటారు. దీన్ని అబార్టివ్ ట్రీట్మెంట్గా పేర్కొంటారు. దీనికి తోడుగా మైగ్రేన్ మళ్లీ మళ్లీ రాకుండా ఉండేందుకు మందులు ఇస్తారు. దీన్ని ప్రొఫిలాక్టిక్ ట్రీట్మెంట్ అని వ్యవహరిస్తారు. కొన్ని సందర్భాల్లో మైగ్రేన్‌ను మామూలు తలనొప్పిగా భావించి, తలనొప్పి తగ్గేందుకు ఇచ్చే ఇబుప్రొఫెన్, కాంబీఫ్లామ్, సారిడాన్ వంటి సాధారణ నొప్పి నివారణ మందులు ఇస్తే అది మందులకు లొంగని మొండి వ్యాధిగా పరిణమిస్తుంది. ఈ పరిస్థితినే ‘ఎన్ఎస్ఏఐడీ రీబౌండ్ హెడేక్’ అంటారు. అబార్టివ్ చికిత్స నొప్పి వచ్చినప్పుడు తక్షణ చికిత్స కోసం కొన్ని అరుదైన ఎన్ఎస్ఏఐడీ (నాన్‌స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్) వాడతారు. నొప్పి తరచూ వస్తుంటే ట్రిప్టాన్స్, ఎర్గాట్స్ అనే మందులు ఉపయోగిస్తారు. ఫ్రొఫిలాక్టిక్ చికిత్స కాల్షియుం ఛానెల్ బ్లాకర్స్, బీటా బ్లాకర్స్ వంటి వుందులు ఇస్తారు. యాంటీడిప్రెస్సెంట్స్ కూడా ఇస్తారు. ఇక బొటాక్స్తోనూ చికిత్స చేస్తారు. ఇది జీవనశైలికి సంబంధించిన వ్యాధి. కాబట్టి మైగ్రేన్‌కు దోహదపడే అంశాలను పాటిస్తూ దాన్ని రాకుండా నివారించుకోవడం అవసరం. లేకపోతే అది ఏదో దశలో మళ్లీ మళ్లీ కనిపిస్తూ బాధించే అవకాశాలున్నాయి. కొన్ని పరిస్థితుల్లో ఆకస్మిక మార్పులు కొన్ని సందర్భాల్లో హార్మోన్ల మార్పుల వల్ల మైగ్రేన్ ఆకస్మికంగా తగ్గిపోవచ్చు లేదా రావచ్చు. ఉదాహరణకు రుతుస్రావం ఆగిపోయిన (మెనోపాజ్ వచ్చిన) మహిళల్లో హార్మోన్ల మార్పుల వల్ల అంతకు ముందు వచ్చే మైగ్రేన్ తలనొప్పి ఆకస్మికంగా మాయం కావచ్చు. లేదా ఇంకొంతమందిలో ఆకస్మికంగా మొదలుకావచ్చు. గర్భం దాల్చిన మహిళల్లో 70 శాతం మందిలో ఇది ఆకస్మికంగా తగ్గిపోవచ్చు. పొరబాట్లకు తావిచ్చేదిలా కొంతమంది చిన్న పిల్లలలో మైగ్రేన్ తన మామూలు లక్షణాలతో కాకుండా కాస్త వేరుగా కనిపిస్తుంటుంది. ఉదాహరణకు వాంతుల వంటివి. దాంతో ఒక్కోసారి కొందరు డాక్టర్లు సైతం దీన్ని మైగ్రేన్‌గా గాక... అపెండిసైటిస్‌గా పొరబడే అవకాశం ఉంది. కాబట్టి పిల్లల్లో దీన్ని నిర్ధారణ చేసే సమయంలో చాలా నిశితంగా, అప్రమత్తంగా ఉండాలి. + త్వరలోనే తాజాగా అందుబాటులోకి రానున్న సరికొత్త చికిత్స ప్రక్రియ... ఇప్పుడు ఒక సరికొత్త చికిత్స ప్రక్రియను త్వరలోనే మైగ్రేన్ బాధితులకు అందుబాటులోకి తెచ్చేందుకు పరిశోధకులు, డాక్టర్లు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా లాపరోస్కోపిక్ చికిత్సతో ముక్కు లోపలే ‘నూడుల్స్’ (స్పాఘెటీ) షేప్‌లో ఉండే ఒక పైప్ లాంటి దాన్ని అమర్చుతారు. అందులో నొప్పినివారణ మందు అయిన ‘లిడోకెయిన్’ (జైలోకెయిన్) నిండి ఉంటుంది. పార్శ్వపు నొప్పి వచ్చినప్పుడు ఇందులోంచి కొంత మోతాదులో మందు విడుదల అవుతూ ఉంటుంది. 1 నుంచి 10 వరకు నొప్పి స్థాయులు ఉండే నొప్పిని కొలిచే స్కేలుపై 8.25 నొప్పి తీవ్రతతో బాధపడుతున్న 112 మంది మైగ్రేన్ బాధితులకు ప్రయోగాత్మకంగా ఈ తరహా చికిత్స చేశారు. వారిలో ఒక నెల తర్వాత 88 శాతం మందికి నొప్పి చాలావరకు తగ్గడమో లేదా పూర్తిగా తగ్గడమో జరిగింది. అయితే తీవ్రంగా నొప్పి వచ్చే సమయంలో మాత్రల అవసరం లేకుండా నొప్పిని తగ్గించడానికి ఈ ప్రక్రియను ఉపయోగిస్తారు. ఆ తర్వాత మళ్లీ మళ్లీ రాకుండా ప్రొఫిలాక్టిక్ చికిత్స కోసం వాడే మందులు ఇస్తారు. ఏడాదికి ఒకసారి నిర్వహించే ‘‘ద యాన్యువల్ మీటింగ్ ఆఫ్ ద సొసైటీ ఆఫ్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ’’ సమావేశాల్లో ఈ సరికొత్త పరిశోధన ఫలితాలను పరిశోధకులు వెల్లడించారు. డాక్టర్ పద్మ వీరపనేని సీనియర్ న్యూరో అండ్ స్ట్రోక్ స్పెషలిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, హైదరాబాద్