ఇక మిలిటెంట్ పోరాటాలు
♦ 19 నుంచి 20 జిల్లాలు సరిపోతాయి..
♦ హైకోర్టు విభజనపై కేసీఆర్ చొరవ చూపాలి..
♦ సీపీఐ రాష్ర్ట కార్యదర్శి చాడ
కామారెడ్డి : స్థానిక సమస్యలపై గ్రామ స్థాయి నుంచి ఉద్యమాలు చేపట్టాలని, మిలిటెంట్ ఉద్యమాల్లో స్పందించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్‌రెడ్డి అన్నారు. మంగళవా రం కామారెడ్డిలో జరిగిన సీపీఐ జిల్లా కౌన్సిల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వచ్చే నెలలో గ్రామ స్థాయిలో, ఆగస్టులో మండల, సెప్టెంబర్‌లో జిల్లా స్థాయి లో పోరాటాలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. అక్టోబర్‌లో రాష్ట్ర స్థాయిలో ఉద్యమా లు ఉంటాయన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా శాస్త్రీయంగా జిల్లాలు ఏర్పా టు చేయాలని డిమాండ్ చేశారు. 18 లక్షల నుంచి 19 లక్షల వరకు జనాభాతో జిల్లా ఏర్పాటు చేయడం సముచితంగా ఉంటుం దని, రాష్ట్రంలో 19 నుంచి 20 జిల్లాలు సరిపోతాయన్నారు.
పరిపాలనకు విఘాతం కలుగకుండా, ఖర్చు పెరగకుండా పరిపాలన ఉంటే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే తమ పార్టీ సూచనలు చేస్తుందన్నారు. ప్రభుత్వం మొదట తండాలను పంచాతీలుగా ఏర్పాటు చేస్తామన్న డిమాండ్‌ను నెరవేర్చి, తరువాత మండలాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు పూర్తి చేసిన తరువాత జిల్లాల విభజన చేపడితే బాగుండేదన్నారు. ప్రజల అభీష్టానికి భిన్నంగా ప్రభుత్వం వ్యవహరించడం సరికాదన్నారు. హరితహారం పేరుతో విచ్చల విడిగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, హరితహారం ఖర్చుపై శ్వేతపత్రం విడుదల చేయాలని వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. దేశంలో నరేంద్రమోదీ నాయకత్వంలో ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్టుగా వంద రోజుల్లో నల్లదనాన్ని రప్పించలేకపోయారని విమర్శించారు.
అలాగే అవినీతి రహిత పాలన అందిస్తామని మోడీ పేర్కొన్నాడని, ఆయన పార్టీకి చెందిన ఎంపీ విజయ్‌మాల్యా బ్యాంకులకు తొమ్మిది వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయాడని గుర్తు చేశారు. పోడు వ్యవసాయం చేస్తున్న రైతులను వెల్లగొట్టే చర్యలు మానుకోవాలని, పోడు రైతులకు పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. దళితులకు మూడెకరాల భూ పంపిణీ ఏమోగాని దళితులు, గిరిజనుల భూములను లాక్కుంటున్నారని ఆరోపించారు.డబుల్ బెడ్రూం ఇండ్లకు సంబంధించి కనీసం విధివిధానాలు రూపొందించ లేదన్నారు. హైదరాబాద్‌లో 10 లక్షల దరఖాస్తులు వస్తే, లక్ష ఇళ్లు ఇస్తామన్నారని, ఇప్పటికి ఒక్క ఇల్లు నిర్మించిన పాపానపోలేదన్నారు. ప్రజల సమస్యలపై, ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై సీపీఐ పోరాడుతుందని పేర్కొన్నారు. ఏపీ పునర్విభజన చట్టం-2014 ప్రకారం ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ విభజించాల్సి ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.
దీనిపై తెలంగాణ సీఎం కేసీఆర్ చొరవ చూపడం లేదని చాడా విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. తెలంగాణకు చెందిన ఏడు మండలాలను ఏపీలో కలిపే విషయంలో, స్థానిక సంస్థల ఎమ్మెల్సీలను పెంచుకునే విషయంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉత్సాహం చూపారని, అదే హైకోర్టు విషయానికి వచ్చే సరికి ఆ ఉత్సాహం ఏమైందని ప్రశ్నించారు. హైకోర్టు విభజన జాప్యం కావడానికి కేంద్ర ప్రభుత్వ వైఖరే కారణమన్నారు. సీఎం కేసీఆర్ చొరవ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. లేనిపక్షంలో సెంటిమెంట్ పెరిగిపోయి ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. హైకోర్టుతో పాటు ప్రభుత్వరంగ సంస్థల విభజనను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కంజెర భూమయ్య, నాయకులు వీఎల్ నర్సింహారెడ్డి, సుధాకర్,బాల్‌రాజు, దశరత్, భానుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.