అసలు కట్టకుంటే భార్యను ఎత్తుకెళ్తామన్నారు
తణుకు (పశ్చిమగోదావరి): వడ్డీ వ్యాపారుల వేధింపులకు మరొకరు బలయ్యారు. వేధింపులు తాళలేక పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన పాలవ్యాపారి వట్టికూటి నాగ గణేశ్ (45) ఉరివేసుకొని శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. తణుకులోని పాతవూరులో నివాసముంటున్న నాగ గణేశ్.. నాలుగేళ్ల కిందట ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లి వచ్చి వేల్పూరు రోడ్డులో పాల వ్యాపారం చేస్తున్నాడు. కొందరు వడ్డీ వ్యాపారుల నుంచి అప్పులు తెచ్చాడు. శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో గణేష్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. వడ్డీ వ్యాపారుల వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు గణేష్ రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
భార్యను ఎత్తుకెళ్తామని బెదిరించారు..
ఉండ్రాజవరం మండలం వేలివెన్ను రవి వద్ద నూటికి రూ.18 వడ్డీ కట్టేలా రూ.లక్ష అప్పు తీసుకున్నానని లేఖలో పేర్కొన్నాడు. నెల నెలా వడ్డీ చెల్లిస్తున్నప్పటికీ అతడు శుక్రవారం తన ఇంటికొచ్చి దౌర్జన్యం చేశాడని, తన భార్య రామలక్ష్మితో బలవంతంగా ప్రామిసరీ నోట్లు రాయించుకున్నాడని ఆ లేఖలో రాశాడు. అసలు చెల్లించకపోతే రౌడీలను తీసుకువచ్చి తన భార్యను ఎత్తుకెళ్తానని బెదిరించాడని లేఖలో ఆవేదన వ్యక్తం చేశాడు.
మరోవైపు పైడిపర్రుకు చెందిన పుప్పాల శ్రీనివాసు వద్ద పది నెలల క్రితం రూ.2 లక్షల విలువైన చీటీ వేశానని, చీటీ పాటకు తనను రానివ్వడంలేదని పేర్కొన్నాడు. కనీసం కట్టిన డబ్బులైనా ఇవ్వాలని ప్రాధేయపడుతున్నా ఇవ్వకుండా తిప్పించుకుంటున్నాడని వాపోయాడు. తనకు రావాల్సిన డబ్బులు రాక, తాను డబ్బులు ఇవ్వాల్సిన వ్యక్తులు ఒత్తిడి చేయడంతో మానసికంగా నలిగిపోతున్నానని లేఖలో పేర్కొన్నాడు. పట్టణ ఎస్ఐ కె.శ్రీనివాసరావు ఘటనా స్థలానికి వచ్చి బంధువుల నుంచి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు.