అక్బరుద్దీన్‌కు నో ఎంట్రీ
ఏఐఎంఐఎం కీక నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీకి పుణె పోలీసులు షాక్ ఇచ్చారు. పుణె మున్సిపల్ కార్పొరేషన్(పీఎంసీ) ఉప ఎన్నిక ప్రచారంలో అక్బర్ పాల్గొనేందుకు అనుమతించమని పుణె పోలీస్ కమిషనర్ శనివారం తేల్చిచెప్పారు. శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందునే అక్బర్‌ను పుణెలోకి అనుమతించడంలేదని కమిషనర్ పేర్కొన్నారు.
ఇప్పటికే మహారాష్ట్రలో రెండు ఎమ్మెల్యే స్థానాలను కైవసం చేసుకున్న ఎంఐఎం.. స్థానిక సంస్థలపైనా పట్టు సాధించాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే పీఎంసీలోని కోడ్వా వార్డులో తమ అభ్యర్థిని పోటీకి నిలిపింది. ఇక్కడ వచ్చే వారం పోలింగ్ జరగనుంది. ఈ వార్డులో 55 శాతం ఓట్లు ముస్లింలవే కావడం విశేషం. కాగా, అక్బరుద్దీన్ ఆదివారంనాడు కోడ్వాలో ప్రచారం చేయాల్సి ఉంది. పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఆయన పర్యటన డైలమాలో పడినట్లయింది. బీహార్ ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొన్న అక్బరుద్దీన్ ప్రధాని మోదీని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, కేసు నమోదు కావటం తెలిసిందే.