మనసు లేని మనిషి
క్రైమ్ ఫైల్
‘‘ఇదే సర్ ఇల్లు’’... కారు దిగుతూనే అన్నాడు కెల్విన్.
‘‘ఊ... పదండి’’ అన్నాడు ఇన్స్పెక్టర్.
అందరూ మెయిన్ డోర్ వైపు నడిచారు. కాలింగ్ బెల్ కొడితే క్షణాల్లో తలుపు తెరచుకుంది. ‘‘ఎస్... ఏం కావాలి?’’ అన్నాడు తలుపు తెరిచిన వ్యక్తి, అందరినీ తేరిపార చూస్తూ.
మాట్లాడలేదు ఇన్స్పెక్టర్. జేబులోంచి ఐడీ కార్డు మాత్రం తీసి చూపించాడు. దాన్ని చూస్తూనే... ‘‘ఓహ్... రండి లోపలికి. ఏంటిలా వచ్చారు?’’ అన్నాడతను అందంగా నవ్వుతూ.
‘‘స్టాసీ కనిపించడం లేదని వాళ్ల అక్కయ్య కంప్లయింట్ ఇచ్చారు.
ఎంక్వయిరీకి వచ్చాం మిస్టర్ పీటర్సన్.’’
అతను నవ్వాడు. ‘‘అనుకున్నాను ఇలాంటిదేదో జరుగు తుందని. కానీ మీరనుకున్నట్టు, మీకు అందిన కంప్లయింట్లో ఉన్నట్టు తను కనిపించకుండా పోలేదు. వేరే వ్యక్తితో వెళ్లిపోయింది. అది తెలియక అందరూ స్టాసీ మిస్ అయ్యిందనుకుంటున్నారు.’’
‘‘మీ భార్య వేరే వ్యక్తితో వెళ్లిపోయిందా? మరి మీరింత ఆనందంగా ఉన్నారేంటి?’’ అన్నాడు ఇన్స్పెక్టర్ తీక్షణంగా చూస్తూ.
‘‘నన్ను కాదనుకుని వెళ్లిపోయినవాళ్ల గురించి ఏడుస్తూ కూర్చోవడంలో అర్థం లేదు. ఎంతో ప్రేమించాను. వంచించి పోయింది. తన ఆనందం తాను వెతుక్కుంది. మరి నా ఆనందాన్ని నేనెందుకు చంపేసుకోవాలి?’’
ఇన్స్పెక్టర్ కనుబొమలు పైకి లేచాయి. ‘‘మీ యాటిట్యూడ్ చాలా ఇంటరెస్టింగ్‌గా ఉందే! కానీ, స్టాసీ వేరే వ్యక్తితో వెళ్లిపోయిందంటూ మీరు చెబుతున్నది నేనెలా నమ్మాలి?’’
వెంటనే టీపాయ్ మీద ఉన్న తన మొబైల్ అందుకున్నాడతను. టకటకా మెసేజులన్నీ చెక్ చేశాడు. ఒక మెసేజ్ ఓపెన్ చేసి ఇన్స్పెక్టర్కి అందించాడు. ‘‘చూడండి... మీకే తెలుస్తుంది’’ అన్నాడు.
ఇన్స్పెక్టర్ ఆ మెసేజ్ చదివాడు. ‘‘సారీ డియర్... నేను వెళ్లి పోతున్నాను. నా మనసు నాకు తెలియ కుండానే వేరే వ్యక్తి వైపు మళ్లింది.
అతని తోనే నాకు ఆనందం ఉందనిపిస్తోంది. అందుకే నీతో బంధాన్ని తెంచేసుకుంటు న్నాను. సారీ అండ్ బై... స్టాసీ.’’
అర్థమైందన్నట్టు తలూపాడు ఇన్స్పెక్టర్. ‘‘మీరివాళ ఓసారి స్టేషన్‌కి వచ్చి స్టేట్మెంట్ ఇవ్వండి. కేసు క్లోజ్ చేస్తాం’’ అనేసి తన టీమ్‌తో పాటు వెనుదిరిగాడు. కారు ఎక్కుతుంటే అసిస్టెంట్ కెల్విన్ అన్నాడు... ‘‘నాకెందుకో అనుమానంగా ఉంది సర్. మూడేళ్ల క్రితం ఈయన భార్య క్యాథలీన్ సావియో బాత్ టబ్‌లో మునిగి మరణించింది.
ప్రమాద వశాత్తూ మరణించిందని కేసు క్లోజ్ చేశారు. ఇప్పుడు మరో భార్య కనిపించ కుండా పోయింది. ఇందులో అనుమానించాల్సిందేమీ లేదంటారా?’’
అప్పటికే ఇన్స్పెక్టర్ బుర్ర పరిపరి విధాల ఆలోచిస్తోంది. ఎక్కడో ఏదో ముడి ఉంది. అది విడితే కానీ అన్ని విషయాలూ బయటకు రావు. అందుకే ముందు దాన్ని విప్పే ప్రయత్నంలో పడ్డాడతను.
‘‘ఏంటి సర్ మళ్లీ వచ్చారు? ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చాను కదా?’’... పొద్దున్నే వచ్చిన పోలీసులను చూసి అదే నవ్వు ముఖంతో అన్నాడు పీటర్సన్.
‘‘మీరివ్వాల్సిన స్టేట్మెంట్స్ ఇంకా ఉన్నాయి మిస్టర్ పీటర్సన్. పదండి స్టేషన్‌కి’’ అన్నాడు చేతులకు బేడీలు వేస్తూ.
‘‘ఏం మాట్లాడుతున్నారు మీరు? చెప్పానుగా స్టాసీ ఎవరితోనో వెళ్లిపోయిందని. తను ఇచ్చిన మెసేజ్ కూడా చూపించాను. ఇంకేం సాక్ష్యాలు కావాలి మీకు?’’ అన్నాడు ఆవేశంగా.
‘‘నిజమైన సాక్ష్యానికీ సృష్టించిన సాక్ష్యానికీ తేడాలు ఆమాత్రం తెలియవా? మీరూ ఒకప్పుడు పోలీసేగా... ఇలాంటి వెన్ని చూసుంటారు మీరు? అయినా నేను వచ్చింది స్టాసీ కేసు గురించి కాదు. మీ భార్య క్యాథలీన్ సావియోని హత్య చేసినందుకు అరెస్ట్ చేయడానికి.’’
ఇన్స్పెక్టర్ మాట వింటూనే పీటర్సన్ ముఖం పాలిపోయింది. ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక మౌనంగా వారి వెంట నడిచాడు.
ఫిబ్రవరి 21, 2013... అమెరికాలోని ఇలినాయిస్...
‘‘తన మూడో భార్య క్యాథలీన్ సావియోని హత్య చేసినందుకు డ్రూ పీటర్సన్‌కి ముప్ఫై ఎనిమిదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించడమైనది.’’
తీర్పు వింటూనే అవాక్కయి పోయాడు పీటర్సన్. అన్నాళ్లూ ఉన్న కాన్ఫిడెన్స్ ఒక్కసారిగా ఎగిరిపోయింది. బిత్తర చూపులు చూశాడు. ఇలా జరిగిం దేమిటి అన్నట్టుగా ఉన్నాయి ఆ చూపులు.
అతని దగ్గరకు వచ్చాడు ఇన్స్పెక్టర్. ‘‘ఎప్పటికీ దొరకననుకున్నారు కదా మిస్టర్ పీటర్సన్. తాడిని తన్నేవాడుంటే వాడి తలదన్నేవాడొకడు ఉంటాడు. ఇక వెళ్దామా?’’ అన్నాడు నవ్వుతూ. ఆ నవ్వులో విజయగర్వం ఉంది. దాన్ని చూసి తల దించుకున్నాడు పీటర్సన్.
అతనికి చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎప్పుడో క్లోజ్ అయిపోయిన కేసు మళ్లీ ఎలా తెరచుకుంది? తనకిప్పుడు శిక్ష ఎలా పడింది? ఏమీ అర్థం కావడం లేదతనికి. ఎందుకంటే ఆ రోజు తన ఇంటి నుంచి వెళ్లాక ఇన్స్పెక్టర్ ఏం చేశాడో, ఎన్ని రహస్యాలను బయటికి లాగాడో అతడికి తెలియదు కాబట్టి!
ఎప్పుడైతే పీటర్సన్ భార్య క్యాథలీన్ మరణం గురించి కెల్విన్ గుర్తు చేశాడో... అప్పుడే వెయ్యి సందేహాలు తలెత్తాయి ఇన్స్పెక్టర్ మనసులో. వెంటనే డ్రూ పీటర్సన్ జీవిత పుస్తకంలోని ప్రతి పుటనీ, ఆ పుటల్లోని ప్రతి అక్షరాన్నీ క్షుణ్నంగా చదవడం మొదలెట్టాడు. పీటర్సన్ చరిత్ర ఇన్స్పెక్టర్కి సరైన దారి చూపించింది.
1954, జనవరి 5న పుట్టాడు డ్రూ పీటర్సన్. చిన్నప్పట్నుంచీ పోలీసు యూనిఫామ్ అంటే పిచ్చి. అందుకే పట్టుబట్టి పోలీసయ్యాడు.
అయితే నిజాయతీపరుడైన పోలీస్ కాలేదు. యూనిఫామ్ ముసుగులో అవినీతికి పాల్పడ్డాడు. చివరికి పై అధికారుల కంటికి చిక్కి డిస్మిస్ అయ్యాడు.
ఇదంతా ఒకెత్తు. అతడి వ్యక్తిగత జీవితం మరొకెత్తు. పీటర్సన్ మొదట్నుంచీ ఆడపిల్లల విషయంలో చాలా వీక్. పోలీస్ ట్రెయినింగ్ సమయంలోనే హైస్కూల్లో తన సహ విద్యార్థిని అయిన క్యారెల్ను పెళ్లాడాడు. కానీ నాలుగేళ్లలోనే వారి బంధం సడలిపోయింది.
ఇద్దరు పిల్లలు పుట్టాక విడాకులు తీసుకున్నారు. రెండేళ్ల తర్వాత విక్టోరియాని పెళ్లాడాడు పీటర్సన్. ఓ పక్క ఆమెతో కాపురం చేస్తూనే క్యాథలీన్ సావియోతో ప్రేమాయణం మొదలెట్టాడు. అది తెలిసి విక్టోరియా వేరుపడిపోయింది. దాంతో క్యాథలీన్ని తన అర్ధాంగినిగా చేసుకున్నాడు. కానీ ఆ బంధమూ బలంగా లేదు. పీటర్సన్ తనను తరచుగా వేధిస్తున్నాడంటూ క్యాథలీన్ పలుమార్లు పోలీస్ కంప్లయింట్ కూడా ఇచ్చింది.
కానీ తన పలుకుబడితో వాటిని బుట్టదాఖలు చేయించాడు పీటర్సన్. చివరికి 2004, ఏప్రిల్ నెలలో ఓ రోజు బాత్‌టబ్‌లో శవమై తేలింది క్యాథలీన్. కానీ ఆ సమయంలో పీటర్సన్ ఇంట్లో లేడని ఎలిబీ ఉండటంతో ప్రమాదవశాత్తూ జరిగిన మరణంగా తేల్చి కేసు క్లోజ్ చేశారు. ఆ తర్వాత తనకంటే ముప్ఫ య్యేళ్లకు పైగా చిన్నదైన స్టాసీ యాన్‌ను పెళ్లి చేసుకున్నాడు. 2007లో ఓరోజు తన అక్క ఇంటికని బయలుదేరిన స్టాసీ మాయమైపోయింది.
చెల్లెలు ఎంతకీ రాకపోవడంతో పీటర్సన్‌కి ఫోన్ చేసిందామె. అతడు చెప్పిన పొంతన లేని సమాధానాలకు సందేహాలు తలెత్తి, పోలీస్ కంప్లయింట్ ఇచ్చింది. దాంతో పోలీసులు రంగంలోకి దిగారు. మొత్తం పీటర్సన్ జీవితాన్ని తిరగ తోడారు.
‘‘నేనేదో సందేహంతో మామూలుగా అన్నాను. కానీ మీరు అంత కచ్చితంగా పీటర్సన్ని నేరస్తుడిగా ఎలా నిరూ పించారు సర్?’’... అడిగాడు కెల్విన్.
సబార్డినేట్ ఉత్సుకతను చూసి నవ్వు కున్నాడు ఇన్స్పెక్టర్. ‘‘ఎంత పెద్ద నేరస్తుడైనా ఒక్కోసారి చిన్న తప్పు చేసి దొరికిపోతాడు కెల్విన్.
పీటర్సన్ కూడా అదే చేశాడు. ఇంటి నుంచి వెళ్లిన రోజు రాత్రి తొమ్మిది గంటలకు స్టాసీ తనకు మెసేజ్ ఇచ్చిందంటూ చూపించాడు కదా! ఆ మెసేజ్ చివర్లో స్టాసీ అని రాసివుంది. ఏ భార్య అయినా తన భర్తకు మెసేజ్ ఇస్తూ చివర్లో తన పేరు రాసుకుంటుందా? అంత అవసరం ఉంటుందా? తన భర్తకి తన నంబర్ తెలియదా?’’
‘‘నిజమే సర్. నాకిది తట్టనే లేదు’’ అన్నాడు కెల్విన్ ఆశ్చర్యపోతూ.
‘‘అక్కడికీ ఆమె వేరే ఎవరి నంబర్ నుంచైనా మెసేజ్ పెట్టిందేమోనని ఆ నంబర్ స్టాసీదేనా అని కూడా అడిగాను పీటర్సన్ని. అతడు అవునని చెప్పాడు. దాంతో నా అనుమానం బలపడింది. కచ్చితంగా ఏదో నంబర్ నుంచి ఆ మెసేజ్ తన ఫోన్‌కి పీటర్సనే ఇచ్చుకున్నాడని అనిపించింది. మనం నమ్మమేమోనని భయమేసి కింద స్టాసీ పేరు పెట్టాడు. అడ్డంగా దొరికిపోయాడు. దానికి తోడు నువ్వు క్యాథలీన్ని గుర్తు చేశావ్.
ఆ కేసు నేను రహస్యంగా రీ ఓపెన్ చేశాను. చని పోయినప్పుడు క్యాథలీన్ నగ్నంగా ఉంది. అంటే స్నాన ం చేస్తూ ప్రమాదవశాత్తూ చనిపోయిందని మనం అనుకోవాలని అలా ప్లాన్ చేశాడు. కానీ ఆమె ఒంటిమీద దెబ్బలున్నాయని పోస్ట్‌మార్టమ్ రిపోర్టులో ఉంది. ఆ విషయం బయటకు రాకుండా మేనేజ్ చేశాడు. అలాగే భర్త హింసిస్తున్నా డంటూ క్యాథలీన్ ఇచ్చిన కంప్లయింట్లన్నీ నా విచారణలో దొరికాయి. అలా ఓ చిన్న తీగ మొత్తం డొంకని కదిలించింది.’’
‘‘మీరు గ్రేట్ సర్. మూసేసిన కేసును తెరిచి మరీ ఛేదించారు.’’ తల అడ్డంగా ఊపాడు ఇన్స్పెక్టర్. ‘‘లేదు కెల్విన్. నేను ఇంకా గెలవలేదు. స్టాసీ జాడ తెలియట్లేదు. ఆమె ప్రాణాలతో ఉందా? లేక ఆమె కూడా క్యాథలీన్లాగే పీటర్సన్ పైశాచికత్వానికి బలైందా? అది తెలిసినప్పుడే నేను నిజంగా గెలిచినట్టు.’’ ఇన్స్పెక్టర్ ఈ మాట అని రెండేళ్లయ్యింది. కానీ ఇప్పటికీ అతను గెలవలేదు. ఎందుకంటే... నేటికీ స్టాసీ జాడ తెలియలేదు!
- సమీర నేలపూడి