mining dept
-
పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి దౌర్జన్యం
సాక్షి ప్రతినిధి, బాపట్ల/మార్టూరు: నోవా అగ్రిటెక్ మాటున అక్రమాలకు పాల్పడిన పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మరింత రెచ్చిపోతున్నారు. మంగళవారం మార్టూరులో గ్రానైట్ ఫ్యాక్టరీలను తనిఖీ చేసేందుకు వచ్చిన మైనింగ్ విజిలెన్స్ అధికారులపై తన అనుచరులతో పాటు ఏకంగా దాడికి పాల్పడ్డారు. గ్రానైట్ పరిశ్రమల్లో తనిఖీలు చేయనిచ్చేది లేదంటూ తొలుత అధికారులను అడ్డగించారు. తనిఖీకి వచ్చిన మైనింగ్ ఏడీతోపాటు మిగిలిన అధికారులనూ దుర్భాషలాడారు. మైనింగ్ అధికారులతో వచ్చిన డ్రైవర్ శ్రీనివాసరావుపై దాడికి తెగబడ్డారు. గౌరవప్రదమైన శాసనసభ్యుడి హోదాలో ఉండి పరిశ్రమలను తనిఖీ చేసేందుకు వచ్చిన అధికారులపై బరితెగించి తన అనుచరులతో దౌర్జన్యానికి దిగారు. విచారణ జరిగితే అక్రమాలు వెలుగుచూస్తాయన్నా భయంతోనే ఏలూరి దౌర్జన్యానికి పాల్పడినట్లు తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే మార్టూరు గ్రానైట్ పరిశ్రమల్లో అక్రమాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదులతో నెల్లూరు మైనింగ్ విజిలెన్స్ ఏడీ బాలాజీనాయక్, మచిలీపట్నం మైనింగ్ ఏడీ ప్రతాప్‌రెడ్డి తమ సిబ్బందితో కలిసి మంగళవారం ఉదయం తనిఖీల నిమిత్తం మార్టూరుకు వచ్చారు. బాలాజీనాయక్ బృందం బల్లికురవ మండలం వేమవర వద్ద ఉన్న ఎమ్మెల్యే ఏలూరి అనుచరుడు కోటపాటి సురేష్‌కు చెందిన రెండు ఫ్యాక్టరీల్లో తనిఖీలు నిర్వహించగా మచిలీపట్నం ఏడీ ప్రతాప్‌రెడ్డి మార్టూరులోని ఏలూరి మరో అనుచరుడు కామినేని జనార్దన్‌కు చెందిన ఫ్యాక్టరీలో తనిఖీ చేసేందుకు వెళ్లారు. ఈ విషయాన్ని మార్టూరులోనే ఉన్న ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు తెలియజేయడంతో అనుచరులతో సహా ఫ్యాక్టరీ వద్దకు చేరుకున్నారు. అప్పటికే అక్కడ ఉన్న ఏడీ ప్రతాప్‌రెడ్డిని ఎలా తనిఖీలు చేస్తారంటూ నిలదీశారు. తనిఖీలు చేస్తామంటే చూస్తూ ఉరుకునేది లేదంటూ గొడవకు దిగాడు. అనుచరులతో కలిసి అధికారులను దుర్భాషలాడారు. వారిపై జులుం ప్రదర్శించారు. ఏడీ ప్రతాప్‌రెడ్డిపై జరుగుతున్న దౌర్జన్యం చూసి అడ్డుకోబోయిన డ్రైవర్ శ్రీనివాసరావుపై ఏలూరి అనుచరులు దాడికి దిగారు. అతనిని ఇష్టానుసారం కొట్టారు. ఫ్యాక్టరీ ఆవరణలోని ఓ గదిలో బంధించారు. ఎమ్మెల్యే, అనుచరులపై కేసులు నమోదు ఘటనకు సంబంధించి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుతో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు ఇన్చార్జి సీఐ నరసింహారావు మంగళవారం రాత్రి తెలిపారు. ఏలూరి సాంబశివరావు, ప్రత్తిపాటి సురేష్, చల్లగుండ్ల కృష్ణ, దివ్య ప్రసాద్, షేక్ అబ్దుల్ రజాక్, మిన్నెకంటి రవి, అడుసుమల్లి శ్రీనివాసరావు, నడింపల్లి హనుమాన్ ప్రసాద్, మరికొందరిపై మైనింగ్ ఏడీ ఆర్ ప్రతాప్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు. వీరిపై ఐపీసీ 341, 353, 323, 324, 427, 386, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. -
కొండల్ని కొల్లగొడుతున్నారు!
సాక్షి, చోడవరం : మండలంలో అక్రమ మెటల్ తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో ఎవరికి తోచిన స్థాయిలో వారు కొండలను తవ్వేస్తున్నారు. అడ్డుకున్నవారికి మామూళ్లు ఇస్తూ..గోవాడ, అడ్డూరు, గంధవరం, బెన్నవోలు, ఖండిపల్లి, దుడ్డుపాలెం, అంభేరుపురం గ్రామాల పరిధిలోని కొండల్లో అక్రమ మెటల్ క్వారీలు నిర్వహిస్తున్నారు. అడ్డుకున్నవారికి మామూళ్లు ఇస్తూ దోచుకున్నవారికి దోచుకున్నంతగా ఈ కొండలను కొల్లగొడుతున్నారు. వాస్తవానికి ఎర్ర మెటల్ తవ్వకాలు, రవాణా చేయాలంటే ముందుగా రెవెన్యూ, గనులశాఖల అనుమతి తప్పనిసరి. కాని చోడవరం మండలంలో మాత్రం అవేమీ లేవు. స్థానిక టీడీపీ నేతల కనుసన్నల్లో.. స్థానిక అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో ఎవరికి తోచినంత వారు తవ్వేసుకొని తరలించుకుపోతున్నారు. గోవాడ–భోగాపురం గ్రామ మధ్య ఉన్న కొండపై అడుగడుగునా ఈ అక్రమ మెటల్ తవ్వకాలు జరుగుతున్నాయి. ఖండిపల్లి, భోగాపురం, దుడ్డుపాలెం, అడ్డూరు క్వారీల్లో పొక్లెయిన్, జేసీబీ యంత్రాల సాయంతో ఎక్కడికక్కడ కొండను తవ్వేసి లారీలు, ట్రాక్టర్లపై తరలించుకుపోతున్నారు. రాత్రి సమయాల్లో ఎక్కువగా ఇక్కడ తవ్వకాలు జరుగుతున్నాయి. వీటికి స్థానిక అధికారపార్టీ నాయకుల సహకారం కూడా ఉందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ సర్పంచ్ల అనుచరులే.. ఖండిపల్లి, దుడ్డపాలెం గ్రామాల్లో అధికారపార్టీ సర్పంచ్ల అనుచరులే నేరుగా కొండను తవ్వేసి మెటల్‌ను అమ్మేస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. రియల్ఎస్టేట్ వ్యాపారులతో కుమ్మక్కై ఈ దందా నడుస్తున్నట్టు తెలిసింది. గంధవరం, అడ్డూరు గ్రామాల్లో రియల్టర్లు పక్కనే ఉన్న కొండల నుంచి ఎర్ర మెటల్, మట్టిని తవ్వేసి భూములను ఎత్తుచేసి ప్లాట్లు విక్రయిస్తున్నారు. వీఆర్వోలపై విమర్శలు.. స్థానిక గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్వోలు) సహకారంతోనే ఇదంతా జరుగుతోందని ఆరోపణలు ఉన్నాయి. పర్యవేక్షించాల్సిన మండల రెవెన్యూ అధికారులు అధికారపార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గడంతో అక్రమ క్వారీలు ఎక్కడికక్కడ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. దీనిపై మైనింగ్ శాఖ అధికారులు కూడా పట్టించుకోకపోవడంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా అనుమతి లేకుండా కొండలను తవ్వేయడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం రాకపోగా పర్యావరణాన్ని పరిరక్షించే కొండలు, పచ్చదనం కూడా నాశనమయ్యే ప్రమాదం ఏర్పడింది. దీనిపై మైన్స్, రెవిన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. చర్యలు తీసుకుంటాం గ్రావెల్ క్వారీలకు మండలంలో ఎటువంటి అనుమతులు లేవు. అక్రమంగా తవ్వకాలు జరిపే వారిపై చర్యలు తీసుకుంటాం. తవ్వకాల నిరోధించేందుకు ఆయా గ్రామాల వీఆర్వోలతో తనిఖీ బృందం ఏర్పాటుచేస్తాం. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటాం. – కేవీఎస్ రవి, తహసీల్దార్, చోడవరం -
పెనుమాక రీచ్‌కు ప్రత్యేక చట్టం?
* అధికార పార్టీ నేతలకు జేజేలు కొడుతున్న అధికారులు * దటీజ్ మైనింగ్ శాఖ పెనుమాక: జిల్లా మొత్తం 37 క్వారీలు ఉండగా మైనింగ్ అధికారులు 36 క్వారీలకు ఒక చట్టం, తాడేపల్లి మండలం పెనుమాక ఇసుక రీచ్‌కు మాత్రం మరో చట్టం అమలు చేసి యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు నిర్వహించేందుకు తలుపులు బార్లా తెరిచారు. గత నెల 8వ తేదీ పుష్కరాలను పురస్కరించుకుని 37 ఇసుక రీచ్‌లను నిలిపి వేయాలంటూ మైనింగ్ శాఖ అధికారులు వివిధ శాఖల అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం వాటికి మళ్లీ అనుమతులు ఇవ్వలేదు. కానీ పెనుమాక ఇసుక రీచ్‌లో మాత్రం యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు నిర్వహించి జిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే అనుచరులు అందినకాడికి తమ జేబులు నింపుకొంటున్నారు. ఇరిగేషన్ శాఖ అధికారులు 2012లో ప్రకాశం బ్యారేజి నుంచి ఎగువ ప్రాంతంలో ఐదు కిలోమీటర్ల వరకు ఇసుక మేటలు లేవని నిర్థారించారు. వారు ఇచ్చిన నివేదికను తుంగలో తొక్కి అధికార పార్టీ నేతలు అడ్డదారిలో అనుమతులు తెచ్చుకుని, కృష్ణానదిలో తమ ఇష్టం వచ్చినట్టు తవ్వకాలు నిర్వహిస్తున్నా మైనింగ్ శాఖ అధికారులు పట్టీపట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో మూసివేసిన 36 ఇసుక రీచ్‌ల మీద నిఘా ఉంచిన అధికారులు సీఎం నివాసానికి కూతవేటు దూరంలో ఉన్న ఈ ఇసుక రీచ్‌పై సీతకన్ను వేశారు. ఎందుకని చర్యలు తీసుకోవడంలేదని ఓ మైనింగ్ అధికారిని ప్రశ్నించగా, తెలుగుదేశం పార్టీలో సీనియర్ ఎమ్మెల్యే కావడం, అతనికి ఏ పదవీ ఇవ్వకపోవడంతో తమ ఉన్నతాధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించడం గమనార్హం. దీంతోపాటు పెనుమాక ఇసుక రీచ్‌లో డ్రెడ్జింగ్ ద్వారా తీసే ఇసుక భవన నిర్మాణానికి ఉపయోగపడదని తెలిసీ, గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ ఇసుకనే వినియోగిస్తున్నట్టు ఆయన తెలిపారు.