జర్నలిస్టు హత్యకేసులో మంత్రి అనుచరుడి అరెస్టు
గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో జర్నలిస్టు శంకర్ హత్యకేసులో ప్రధాన నిందితుడు, ఏపీ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రధాన అనుచరుడు వెంగళ్రాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారమే అతడిని కోర్టు ముందు హాజరుపరుస్తున్నారు. చిలకలూరిపేట ఆంధ్రప్రభ విలేకరి శంకర్ హత్యకేసులో వెంగళ్రాయుడు ప్రధాన నిందితుడు, ఈ హత్యకు అతడే సూత్రధారి అని ఆరోపణలున్నాయి. వెంగళ్రాయుడు పోలీసు స్టేషన్లోనే పంచాయతీలు చేయడంపై శంకర్ పలు కథనాలు రాయడంతోనే అతడిని హత్యచేశారు. సుమారు మూడు నెలల క్రితం శంకర్ తన పత్రికా కార్యాలయం నుంచి రాత్రి 10 గంటల సమయంలో ఇంటికి వెళ్తుండగా ముగ్గురు వ్యక్తులు కాపుకాసి అతడిని హత్యచేశారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వెంగళ్రాయుడు మాత్రం మూడు నెలలుగా తప్పించుకుని తిరుగుతున్నాడు.
ఎన్నికలకు ముందు నుంచి కూడా అతడే పుల్లారావు ఎన్నికల వ్యవహారాలను చూస్తుండటంతో పోలీసులు ఇన్నాళ్లుగా చూసీ చూడనట్లు వదిలేశారు. అయితే దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం జరగడంతో పోలీసులు ప్రధాన నిందితుడిని అరెస్టుచేయక తప్పలేదు. పోలీసుల ప్రత్యేక బృందం అతడిని అరెస్టుచేసి చిలకలూరిపేట స్టేషన్కు తీసుకొచ్చారు. గత కొంత కాలంగా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు వ్యతిరేకంగా రాసినా, వెంగళ్రాయుడిపై వార్తలు రాసినా దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఏకంగా జర్నలిస్టునే హతమార్చారు.