Minister DEVINENI Umamaheshwara Rao
-
మార్చికి అన్ని జిల్లాల్లో ఎల్ఈడీ బల్బులు
విజయవాడ : వచ్చే మార్చినాటికి అన్ని జిల్లాల్లో ఎల్.ఇ.డి. బల్బుల పంపిణీ పూర్తిచేస్తామని ఏ.పి.ఎస్.పి.డి.సి.ఎల్. సీఎండీ హెచ్.వై.దొర చెప్పారు. మంగళవారం ఆయన విజయవాడలో విద్యుత్ సర్కిల్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తొలి దశలో గుంటూరు, అనంతపురం, పశ్చిమగోదావరి జిల్లాల్లో 57 లక్షల బల్బులు పంపిణీచేశామన్నారు. ఇందువల్ల 349 మెగావాట్ల విద్యుత్ ఆదా అయిందన్నారు. రాష్ట్రంలో రెండో విడత తొమ్మిది జిల్లాల్లో మరింత కాంతివంతమైన ఎల్.ఇ.డి. బల్బులను కేవలం రూ. 10లకే పంపిణీ చేస్తున్నామని చెప్పారు. వచ్చే మార్చినాటికి అన్ని జిల్లాల్లో పంపిణీ పూర్తిచేస్తామన్నారు. విద్యుత్ సరఫరా, అంతరాయం తదితర విషయాలను ఆన్లైన్లో పొందుపరుస్తున్నామన్నారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు మాట్లాడుతూ విద్యుత్ పొదుపు, అదనపు విద్యుత్ అనే రెండంచెల వ్యూహంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. రానున్న ఐదేళ్లలో సోలార్ ద్వారా 5 వేల మెగావాట్లు, పవన విద్యుత్ ద్వారా 4 వేల మెగావాట్లు, విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ముఖ్యమంత్రి కార్యాచరణ రూపొందించారన్నారు. కృష్ణాజిల్లా అవనిగడ్డలో రెండో విడత ఎల్.ఇ.డి. బల్బుల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభిస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఇంజినీర్ రాజబాపయ్య, స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎ.చంద్రశేఖరరెడ్డి, విజయవాడ ఎస్.ఇ. విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
హంద్రీ-నీవా పనులకు వారంలో 2 రోజులు కేటాయిస్తా!
నీటి పారుదల శాఖా మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు పెద్దతిప్పసముద్రం: హంద్రీ నీవా కాలువల నిర్మాణం పూర్తి చేయడానికి ఎన్ని వందల కోట్లు ఖర్చు అయినా పర్వాలేదని, వారంలో రెండు రోజుల పాటు హంద్రీ-నీవా పనుల వేగవంతానికే సమయాన్ని కేటాయిస్తానని రాష్ట్ర నీటి పారుదల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. తంబళ్లపల్లి నియోజకవర్గం బి.కొత్తకోట మండలంలోని గుమ్మసముద్రం చెరువులో గురువారం సీఎం చంద్రబాబు నీరు-చెట్టు పథకాన్ని ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 40 వేల చెరువుల్లో పూడికతీత పనులు ప్రారంభించారన్నారు. చంద్రబాబు గత తొమ్మిదేళ్ల పాలనలో నీటి నిల్వలు పెంపొందించేందుకు నీరు-మీరు కార్యక్రమం చేపట్టి చెక్‌డ్యాంలు, ఇంకుడు గుంతలు నిర్మించారన్నారు. చిత్తూరు జిల్లాలో వర్షపాత నమోదు గణనీయంగా పడిపోవడంతో భూగర్భజలాలు అడుగంటి ఇటు తాగునీరు, అటు సాగు నీటి కోసం రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను తాను కళ్లారా చూశానన్నారు. వీటికి శాశ్వత పరిష్కారం హంద్రీ-నీవా కాలువేనన్నారు. దీని నిర్మాణం పూర్తి చేసి, కరవు రహిత జిల్లాగా తీర్చి దిద్దుతామని భరోసా ఇచ్చారు. అటవీ శాఖా మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి రాగానే వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు నెలవారీ పింఛన్లను ఐదు రెట్లు పెంచిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. కోతల్లేకుండా విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. హంద్రీనీవా పనులు నిలిచిపోవడానికి, టీడీపీ కారణమని ప్రతిపక్ష నాయకులు విమర్శించడం హాస్యాస్పదమన్నారు. నీళ్లే లేకపోతే మొక్కలు ఎక్కడ నాటుతారని, ప్రతిపక్షాలు పని గట్టుకుని చౌకబారు ఆరోపణలు చేయడం సమంజసం కాదన్నారు. చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి పనులను ఓర్వలేకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు. కోటి 10 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. పంచాయతీరాజ్ శాఖా మంత్రి అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ రాష్ట్రంలోని 13,300 పంచాయతీల్లో వర్షపాతం 36 శాతానికి పడిపోయిందన్నారు. 1500 అడుగుల లోతు బోర్లు తవ్వినా నీళ్లు వస్తాయన్న నమ్మకం లేదన్నారు. వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చుకునేందుకు తాము తలపెట్టే ప్రతి సంక్షేమ పథకంలో ప్రజలు కూడా తోడ్పాటునివ్వాలని సూచించారు. -
ఇరిగేషన్ భవనంలో సీఎం క్యాంప్ ఆఫీస్
నివేదికలు కోరిన ఇరిగేషన్ కార్యదర్శి సీఎం ఉండేందుకు గెస్ట్‌హౌస్ ఏర్పాటు విజయవాడ : భారీ నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు క్యాంపు కార్యాలయం త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు క్యాంపు కార్యాలయంగా మారనుంది. సీఎం విజయవాడలో వారానికి ఐదురోజులు ఉండాలని భావిస్తున్న నేపథ్యంలో ఆయన క్యాంపు కార్యాలయాన్ని నగరానికి మధ్యలో ఉన్న ఇరిగేషన్ భవనం ప్రాంగణంలో ఏర్పాటుచేయాలని ఇప్పటికే ప్రతిపాదనలు వచ్చాయి. తాజాగా ఇరిగేషన్ కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ ఈ మేరకు నివేదికను పంపాలని జిల్లా కలెక్టర్ అహ్మద్ బాబు, కృష్ణా డెల్టా చీఫ్ ఇంజినీర్ సుధాకర్‌ను కోరినట్లు సమాచారం. దీంతో ఇరిగేషన్ మంత్రి క్యాంపు కార్యాలయాన్ని సీఎం క్యాంపు కార్యాలయంగా మార్చేందుకు కావాల్సిన ఏర్పాట్లపై కలెక్టర్ దృష్టి సారించి ఒక నివేదిక తయారు చేస్తున్నట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహం వాస్తు బాగా లేనందున ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడ రాత్రి పూట బస చేయడం లేదు. భవిష్యత్తులో ఆయన రాత్రిళ్లు నగరంలోనే బస చేయాల్సి వస్తే ఇందుకోసం గెస్ట్హస్ను ఇరిగేషన్ కార్యాలయాల ప్రాంగణంలోనే ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. పై అంతస్తులోకి ఇరిగేషన్ మంత్రి కార్యాలయం ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమా క్యాంపు కార్యాలయంలో ఇప్పటికే కింద అంతస్తులో కొన్ని రూములను సీఎం కోసం కేటాయించారు. ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి కార్యక్రమాలన్నీ ఇక్కడ నుంచే నిర్వహించన్నుట్లు తెలిసింది. దీంతో మొదటి అంతస్తులోని ఉమా చాంబర్‌ను సీఎంకు కేటాయించి, మిగిలిన రూములను ఇతర అధికారులకు కేటాయించే అవకాశం ఉంది. దీంతో భవనంలో పైన మరో అంతస్తు నిర్మించి అక్కడ ఉమా క్యాంపు కార్యాలయం ఏర్పాటుచేయాలని అధికారులు భావిస్తున్నారు. ఎస్ఈ, ఈఈ కార్యాలయాలు తరలింపు! ప్రస్తుతం నీటిపారుదల శాఖ ప్రాంగణంలో ఎస్ఈ కార్యాలయంతోపాటు ఈస్ట్రన్, సెంట్రల్, స్పెషల్ డివిజన్ ఈఈలు, డీఈలు కార్యాలయాలు ఉన్నాయి. ఇక్కడికి సీఎం క్యాంపు కార్యాలయం వస్తే సెక్యూరిటీ పెరుగుతుంది. అందువల్ల ప్రస్తుతం ఉన్న రెండు గేట్లు ఆయన రాకపోకలకు ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల మిగిలిన ఇరిగేషన్ అధికారులు ఇక్కడ నుంచి పనిచేసే అవకాశం ఉండకపోవచ్చని సమాచారం. దీంతో ఎస్ఈ, ఈఈ కార్యాలయాలను ఇక్కడ నుంచి తరలిస్తారా? లేదా వారికి వేరే మార్గం ఏర్పాటుచేసి ఇక్కడే కొనసాగిస్తారా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా, ఇరిగేషన్ శాఖకు చెందిన ఆఫీసర్స్ క్లబ్ ఉన్న స్థలాన్ని ఇప్పటికే డీజీపీ క్యాంపు కార్యాలయానికి బదిలీ చేశారు. ప్రస్తుతం ఇరిగేషన్ శాఖకు చెందిన ప్రధాన ప్రాగణం సీఎం క్యాంపు కార్యాలయంగా మారబోతోంది. -
రూపాయి కూడా వెనక్కి వెళ్లనీయొద్దు
దేవినేని ఉమా విజయవాడ : ప్రభుత్వం మంజూరు చేసిన ఒక్క రూపాయి కూడా వెనక్కిపోవడానికి వీలు లేదని, అందుబాటులో ఉన్న నిధులతో చెరువులు, కాలువల్లో పనులు చేపట్టాలని ఇరిగేషన్ శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అధికారులకు ఆదేశించారు. ఇరిగేషన్ కార్యాలయంలో డ్వామా అధికారులతో నీరు-చెట్టు పథకంపై సోమవారం ఆయన సమీక్ష జరిపారు. అందుబాటులో ఉన్న నిధులు ఖర్చు చేయడంలో అధికారుల మధ్య సమన్వయం లోపం వల్ల అవి మురిగిపోయే అవకాశం ఉందని ఆయన చెప్పారు. జిల్లాలో నీరు-చెట్టు పథకం కింద పెండింగులో ఉన్న రూ.116 కోట్లు వెంటనే ఖర్చు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఏదైనా క్షేత్ర స్థాయి ఇబ్బంది ఉంటే తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారం చూపుతానన్నారు. ఇరిగేషన్, అటవీ శాఖ, పంచాయతీరాజ్ అధికారులతో డ్వామా అధికారులు సమన్వయ సమావేశం ఏర్పాటు చేసుకుని కార్యాచరణపై ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. డెల్టా ప్రాంతంలో కాలువలలో తూడు తొలగింపు, గుర్రపు డెక్క నిర్మూలన పనులు చేపట్టాల్సి ఉందని అధికారులకు సూచించారు. ఉపాధి కల్పన సంచాలకులు వి.కరుణ, డ్వామా పథక సంచాలకులు పి.మాధవిలత, ఇరిగేషన్ ఎస్ఈ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఉమా జాగ్రత్త నోరు అదుపులో పెట్టుకో
సంస్కారవంతంగా మాట్లాడు నీకంటే ఎక్కువ బూతులు తిట్టగలను ఉన్నది చెబితే ఉలుకెందుకు వైఎస్సార్ సీపీ నేతలు కొడాలి నాని, పార్థసారథి ధ్వజం విజయవాడ : ‘ఉన్న మాట చెబితే ఉలుకెందుకు.. నోరు అదుపులో పెట్టుకో.. లేకుంటే మీకంటే ఎక్కువగా బండబూతులు తిట్టగలం..’ అంటూ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, శాసనసభలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని)హెచ్చరించారు. గురువారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై మంత్రి ఉమా దుర్భాషలాడడాన్ని ఖండించారు. గత ఎన్నికల్లో రైతులు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తామని నమ్మబలికి గద్దెనెక్కి ఆరు మాసాలైనా అమలు చేయకపోవడంతో వచ్చిన ప్రజాగ్రహాన్ని తమ పార్టీ అధినేత బయటకు చెప్పారని కొడాలి నాని వివరించారు. హామీలు అమలుచేయాలని ప్రజల తరఫున కోరుతుంటే ఉమా సంస్కారహీనంగా మాట్లాడడం శోచనీయమన్నారు. ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడకపోతే రాబోయే రోజుల్లో చంద్రబాబును కూడా తిట్టేందుకు తాము వెనుకాడేది లేదని హెచ్చరించారు. మానసిక రోగం తమ పార్టీ నేతకు లేదని, 66 ఏళ్లు దాటిన మీ నాయకుడు చంద్రబాబుకే ఉందన్నారు. అధికారం కోసం చంద్రబాబు మామను చంపారని, ఎమ్మెల్యే పదవి కోసం ఉమా ఇంట్లో మనుషులను చంపారని దుయ్యబట్టారు. చంద్రబాబును ప్రజలు క్షమించరు : సారథి పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ మంత్రి కె.పార్థసారథి మాట్లాడుతూ చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలు అమలుచేయకపోతే భవిష్యత్తులో రాళ్లతో కొడతారని తమ పార్టీ అధినేత అన్న మాటల్లో ఎటువంటి తప్పు లేదన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసగిస్తున్న చంద్రబాబును ప్రజలు క్షమించరన్నారు. మంత్రి ఉమా పిచ్చివాగుడు వాగుతూ వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రుణమాఫీపై ఎన్ని మాటలు మార్చారో ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. పింఛన్లకు రూ. 3,700 కోట్ల బడ్జెట్ కేటాయించి నిరుపేదలకు ఎగనామం పెడుతున్నారని దుయ్యబట్టారు. ఈ సమస్యలపై నిలదీస్తున్న తమ పార్టీ అధినేతపై దుర్భాషలాడడం తగదన్నారు. జిల్లాలో మంజూరైన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని గుంటూరుకు తరలించినా మంత్రి ఉమా దద్దమ్మలా నోరు మెదపకుండా కూర్చున్నారని విమర్శించారు. సంస్కారహీనంగా ప్రవర్తించవద్దని, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని మంత్రి ఉమాకు సారథి హితవు పలికారు.