ఉమా జాగ్రత్త నోరు అదుపులో పెట్టుకో
సంస్కారవంతంగా మాట్లాడు
నీకంటే ఎక్కువ బూతులు తిట్టగలను ఉన్నది చెబితే ఉలుకెందుకు
వైఎస్సార్ సీపీ నేతలు కొడాలి నాని, పార్థసారథి ధ్వజం
విజయవాడ : ‘ఉన్న మాట చెబితే ఉలుకెందుకు.. నోరు అదుపులో పెట్టుకో.. లేకుంటే మీకంటే ఎక్కువగా బండబూతులు తిట్టగలం..’ అంటూ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, శాసనసభలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని)హెచ్చరించారు. గురువారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై మంత్రి ఉమా దుర్భాషలాడడాన్ని ఖండించారు. గత ఎన్నికల్లో రైతులు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తామని నమ్మబలికి గద్దెనెక్కి ఆరు మాసాలైనా అమలు చేయకపోవడంతో వచ్చిన ప్రజాగ్రహాన్ని తమ పార్టీ అధినేత బయటకు చెప్పారని కొడాలి నాని వివరించారు. హామీలు అమలుచేయాలని ప్రజల తరఫున కోరుతుంటే ఉమా సంస్కారహీనంగా మాట్లాడడం శోచనీయమన్నారు. ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడకపోతే రాబోయే రోజుల్లో చంద్రబాబును కూడా తిట్టేందుకు తాము వెనుకాడేది లేదని హెచ్చరించారు. మానసిక రోగం తమ పార్టీ నేతకు లేదని, 66 ఏళ్లు దాటిన మీ నాయకుడు చంద్రబాబుకే ఉందన్నారు. అధికారం కోసం చంద్రబాబు మామను చంపారని, ఎమ్మెల్యే పదవి కోసం ఉమా ఇంట్లో మనుషులను చంపారని దుయ్యబట్టారు.
చంద్రబాబును ప్రజలు క్షమించరు : సారథి
పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ మంత్రి కె.పార్థసారథి మాట్లాడుతూ చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలు అమలుచేయకపోతే భవిష్యత్తులో రాళ్లతో కొడతారని తమ పార్టీ అధినేత అన్న మాటల్లో ఎటువంటి తప్పు లేదన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసగిస్తున్న చంద్రబాబును ప్రజలు క్షమించరన్నారు. మంత్రి ఉమా పిచ్చివాగుడు వాగుతూ వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రుణమాఫీపై ఎన్ని మాటలు మార్చారో ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. పింఛన్లకు రూ. 3,700 కోట్ల బడ్జెట్ కేటాయించి నిరుపేదలకు ఎగనామం పెడుతున్నారని దుయ్యబట్టారు. ఈ సమస్యలపై నిలదీస్తున్న తమ పార్టీ అధినేతపై దుర్భాషలాడడం తగదన్నారు. జిల్లాలో మంజూరైన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని గుంటూరుకు తరలించినా మంత్రి ఉమా దద్దమ్మలా నోరు మెదపకుండా కూర్చున్నారని విమర్శించారు. సంస్కారహీనంగా ప్రవర్తించవద్దని, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని మంత్రి ఉమాకు సారథి హితవు పలికారు.