ఇరిగేషన్ భవనంలో సీఎం క్యాంప్ ఆఫీస్
నివేదికలు కోరిన ఇరిగేషన్ కార్యదర్శి
సీఎం ఉండేందుకు గెస్ట్‌హౌస్ ఏర్పాటు
విజయవాడ : భారీ నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు క్యాంపు కార్యాలయం త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు క్యాంపు కార్యాలయంగా మారనుంది. సీఎం విజయవాడలో వారానికి ఐదురోజులు ఉండాలని భావిస్తున్న నేపథ్యంలో ఆయన క్యాంపు కార్యాలయాన్ని నగరానికి మధ్యలో ఉన్న ఇరిగేషన్ భవనం ప్రాంగణంలో ఏర్పాటుచేయాలని ఇప్పటికే ప్రతిపాదనలు వచ్చాయి. తాజాగా ఇరిగేషన్ కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ ఈ మేరకు నివేదికను పంపాలని జిల్లా కలెక్టర్ అహ్మద్ బాబు, కృష్ణా డెల్టా చీఫ్ ఇంజినీర్ సుధాకర్‌ను కోరినట్లు సమాచారం. దీంతో ఇరిగేషన్ మంత్రి క్యాంపు కార్యాలయాన్ని సీఎం క్యాంపు కార్యాలయంగా మార్చేందుకు కావాల్సిన ఏర్పాట్లపై కలెక్టర్ దృష్టి సారించి ఒక నివేదిక తయారు చేస్తున్నట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహం వాస్తు బాగా లేనందున ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడ రాత్రి పూట బస చేయడం లేదు. భవిష్యత్తులో ఆయన రాత్రిళ్లు నగరంలోనే బస చేయాల్సి వస్తే ఇందుకోసం గెస్ట్‌హస్‌ను ఇరిగేషన్ కార్యాలయాల ప్రాంగణంలోనే ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు.
పై అంతస్తులోకి ఇరిగేషన్ మంత్రి కార్యాలయం
ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమా క్యాంపు కార్యాలయంలో ఇప్పటికే కింద అంతస్తులో కొన్ని రూములను సీఎం కోసం కేటాయించారు. ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి కార్యక్రమాలన్నీ ఇక్కడ నుంచే నిర్వహించన్నుట్లు తెలిసింది. దీంతో మొదటి అంతస్తులోని ఉమా చాంబర్‌ను సీఎంకు కేటాయించి, మిగిలిన రూములను ఇతర అధికారులకు కేటాయించే అవకాశం ఉంది. దీంతో భవనంలో పైన మరో అంతస్తు నిర్మించి అక్కడ ఉమా క్యాంపు కార్యాలయం ఏర్పాటుచేయాలని అధికారులు భావిస్తున్నారు.
ఎస్‌ఈ, ఈఈ కార్యాలయాలు తరలింపు!
ప్రస్తుతం నీటిపారుదల శాఖ ప్రాంగణంలో ఎస్‌ఈ కార్యాలయంతోపాటు ఈస్ట్రన్, సెంట్రల్, స్పెషల్ డివిజన్ ఈఈలు, డీఈలు కార్యాలయాలు ఉన్నాయి. ఇక్కడికి సీఎం క్యాంపు కార్యాలయం వస్తే సెక్యూరిటీ పెరుగుతుంది. అందువల్ల ప్రస్తుతం ఉన్న రెండు గేట్లు ఆయన రాకపోకలకు ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల మిగిలిన ఇరిగేషన్ అధికారులు ఇక్కడ నుంచి పనిచేసే అవకాశం ఉండకపోవచ్చని సమాచారం. దీంతో ఎస్‌ఈ, ఈఈ కార్యాలయాలను ఇక్కడ నుంచి తరలిస్తారా? లేదా వారికి వేరే మార్గం ఏర్పాటుచేసి ఇక్కడే కొనసాగిస్తారా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా, ఇరిగేషన్ శాఖకు చెందిన ఆఫీసర్స్ క్లబ్ ఉన్న స్థలాన్ని ఇప్పటికే డీజీపీ క్యాంపు కార్యాలయానికి బదిలీ చేశారు. ప్రస్తుతం ఇరిగేషన్ శాఖకు చెందిన ప్రధాన ప్రాగణం సీఎం క్యాంపు కార్యాలయంగా మారబోతోంది.