బియ్యం ఉచితం
మే నుంచి బీపీఎల్ కార్డుదారులకు 5 కేజీల వరకు
రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి దినేష్ గుండూరావు
బెంగళూరు: రాష్ట్రంలోని బీపీఎల్ కార్డు దారులకు 5 కేజీల చొప్పున బియ్యాన్ని ఉచితంగా అందజేసే పధకాన్ని మే 1 నుంచి అమలు చేయనున్నట్లు రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి దినేష్ గుండూరావ్ వెల్లడించారు. మే 1న కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ పధకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారని ఆయన తెలిపారు. మంగళవారమిక్కడి కేపీసీసీ కార్యాలయాన్ని సందర్శించి కార్యకర్తలతో భేటీ అయిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇక జూన్ 1 నుంచి ఏపీఎల్ కార్డుదారులకు సైతం ఆహార ధాన్యాలను అందజేయనున్నట్లు తెలిపారు.
కేజీ బియ్యం రూ.15, కేజీ గోధుమలు రూ.10 చొప్పున అందజేయడంతో పాటు రూ.25కు లీటరు మంచి నూనె, రూ.2కు కేజీ ఉప్పు చొప్పున ఏపీఎల్ కార్డుదారులకు అందజేయనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని రేషన్ దుకాణాల్లో అక్రమాలను అరికట్టేందుకు గాను ఇప్పటికే అనేక కార్యక్రమాలను చేపట్టినట్లు మంత్రి దినేష్ గుండూరావ్ వెల్లడించారు. ఇందులో భాగంగానే బెంగళూరులోని 504 రేషన్ షాపుల్లో అత్యాధునిక తూనిక యంత్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలోని ఇతర షాపులకు సైతం విడతల వారీగా ఈ యంత్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అంతేకాక ఇప్పటికే 8.5లక్షల నకిలీ రేషన్ కార్డులను గుర్తించి, రద్దు చేసినట్లు పేర్కొన్నారు. మే 1 నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ కోసం అర్జీలను స్వీకరించనున్నట్లు వెల్లడించారు.