Minister DK Sivakumar
-
ఇంధనశాఖ మంత్రికి షాక్
మీడియా సమావేశంలో పవర్‌కట్ సాక్షి,బెంగళూరు: ఇంధనశాఖ మంత్రి డీ.కే.శివకుమార్‌కు రాష్ర్ట విద్యుత్ శాఖ షాక్ఇచ్చింది. ఆయన మీడియా సమావేశం సమయంలో ఉండగా పవర్ పోయింది. ఈ ఘటన విధానసౌధలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలు...రాష్ట్రంలో ఎక్కడా కూడా విద్యుత్‌కోతలు లేవని డీ.కే శివకుమార్ మీడియా సమావేశంలో చెబుతున్న సమయంలోనే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో అక్కడ ఉన్న పాత్రికేయులతో పాటు అమాత్యుడు కూడా నవ్వారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకూ సౌరవిద్యుత్ కొనుగోలు కోసం నెట్‌మీటర్ వ్యవస్థ అందుబాటులో ఉండేదని ఇప్పటి నుంచి ఆ స్థానంలో గ్రాస్‌మీటరింగ్ వ్యవస్థ అందుబాటులోకి వస్తుందన్నారు. ప్రతి యూనిట్ విద్యుత్‌ను రూ.7.8 చొప్పున ప్రభుత్వం కొనుగోలు చేయనుందన్నారు. -
విద్యుత్ ఇవ్వండి
కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి డి.కె.శివకుమార్ వినతి రోజుకు 1,500 మెగా వాట్ల విద్యుత్ అవసరమని వివరణ లోడ్‌షెడ్డింగ్ సమస్య పరిష్కారానికి గాను రోజుకు 1,500 మెగావాట్ల విద్యుత్‌ను అందజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. రాష్ట్రంలో తీవ్ర విద్యుత్ కొరత నెలకొన్న నేపథ్యంలో ఆ లోటును భర్తీ చేయాల్సిందిగా కేంద్ర ఇంధనశాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి డి.కె.శివకుమార్ కోరారు. రాష్ట్రంలో విద్యుత్ రంగంలో నెలకొన్న సమస్యలు, అపరిష్కృతంగా ఉన్న విద్యుత్ ప్రాజెక్టులు, బొగ్గు సరఫరా తదితర అంశాలపై చర్చించేందుకు గాను గురువారమిక్కడి విధానసౌధలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, రాష్ట్ర ఇంధనశాఖ మంత్రి డి.కె.శివకుమార్, ఇతర అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ కొరతను పీయూష్‌గోయల్ దృష్టికి డి.కె.శివకుమార్ తీసుకువచ్చారు. లోడ్‌షెడ్డింగ్‌ను నివారించేందుకు గాను రోజుకు 1,500 మెగావాట్ల అదనపు విద్యుత్‌ను కేంద్ర గ్రిడ్‌నుంచి అందజేయాల్సిందిగా కోరారు. ఇదే సందర్భంలో విద్యుత్ ఉత్పాదనలో స్వావలంభన సాధించేందుకు ప్రయత్నిస్తున్న కర్ణాటకకు బొగ్గు సరఫరా సైతం పెంచాలని కేంద్రానికి విన్నవించారు. ఇక విద్యుత్ సరఫరా కోసం కొత్తలైన్లను ఏర్పాటు చేసే క్రమంలో అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయని, ఈ సమస్యలను పరిష్కరించేందుకు గాను జాతీయ స్థాయిలో కొత్త విధివిధానాలను రూపొందించాల్సిన అవసరం ఉందని సూచించారు. రానున్న నాలుగేళ్లలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు 24గంటల పాటు విద్యుత్‌ను సరఫరా చేసే దిశగా చేపడుతున్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు గాను రాష్ట్రానికి రూ.3,500కోట్లను కేటాయించాలని, సౌర విద్యుత్ పార్క్‌ల ఏర్పాటుకు రాయితీలను మరింత పెంచాలని కోరారు. వీటన్నింటిని సావధానంగా విన్న కేంద్ర ఇంధన శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్ని అంశాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. -
శాఖ మార్పు కోరలేదు...
డి.కె.శివకుమార్ విద్యుత్ సమస్యను పరిష్కరించడమే లక్ష్యం బెంగళూరు: తన శాఖను మార్చాల్సిం దిగా కోరినట్లు వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం వాస్తవం లేదని రాష్ట్ర ఇంధన శాఖ మం త్రి డి.కె.శివకుమార్ వెల్లడించారు. బుధవారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.... శాఖల మార్పు అంశం సీఎం నిర్ణయంపై ఆధార పడి ఉం టుందని అన్నారు. మంత్రివర్గ విస్తరణ సమయంలో శాఖలను మార్చాల్సిందిగా కోరుతూ కొంతమంది మంత్రులు కోరారని, అందులో తన పేరు కూడా ఉందని వస్తున్న వార్తల్లో నిజం లేదని అన్నారు. వేసవి సమీపిస్తున్న దృష్ట్యా రాష్ట్రంలో విద్యుత్ కొరత తలెత్తకుండా సమస్యలను పరిష్కరించడమే ప్రస్తుతం తనముందున్న లక్ష్యమని తెలిపారు. నాణ్యమైన విద్యుత్‌ను రాష్ట్ర ప్రజలకు అందించే దిశగా అన్ని చర్యలు చేపడుతున్నట్లు చె ప్పారు. ఇక రాష్ట్రంలో అక్రమ వ్యవసాయ మోటర్లను క్రమబద్దీకరించేందుకు గాను త్వరలోనే ‘కరెంటును ఆదా చేయండి-రైతులను కాపాడండి’ పేరిట కార్యక్రమాన్ని ప్రారంభించనున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన విధివిధానాలను రూపొందించేందుకు గాను బడ్జెట్ సమావేశాలకంటే ముందుగానే రైతు సంఘాల నాయకులు, రైతులతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కాగా గత ఏడాది బడ్జెట్లో రైతుల వ్యవసాయ పంపుసెట్ల కరెంటు బిల్లుల చెల్లింపునకు గాను 6,200 కోట్ల రూపాయలను కేటాయించామని, అయితే వ్యవసాయ పంపుసెట్ల కరెంటు బిల్లులు 7,200కోట్ల రూపాయలను దాటిపోయాయని చెప్పారు. రైతులకు వ్యవసాయ అవసరాల కోసం అందజేస్తున్న విద్యుత్ దుర్వినియోగం అవుతోందన్న విషయం తమ దృష్టికి వచ్చిందని, దీన్ని అడ్డుకునేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.