శాఖ మార్పు కోరలేదు...
డి.కె.శివకుమార్
విద్యుత్ సమస్యను పరిష్కరించడమే లక్ష్యం
బెంగళూరు: తన శాఖను మార్చాల్సిం దిగా కోరినట్లు వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం వాస్తవం లేదని రాష్ట్ర ఇంధన శాఖ మం త్రి డి.కె.శివకుమార్ వెల్లడించారు. బుధవారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.... శాఖల మార్పు అంశం సీఎం నిర్ణయంపై ఆధార పడి ఉం టుందని అన్నారు. మంత్రివర్గ విస్తరణ సమయంలో శాఖలను మార్చాల్సిందిగా కోరుతూ కొంతమంది మంత్రులు కోరారని, అందులో తన పేరు కూడా ఉందని వస్తున్న వార్తల్లో నిజం లేదని అన్నారు. వేసవి సమీపిస్తున్న దృష్ట్యా రాష్ట్రంలో విద్యుత్ కొరత తలెత్తకుండా సమస్యలను పరిష్కరించడమే ప్రస్తుతం తనముందున్న లక్ష్యమని తెలిపారు. నాణ్యమైన విద్యుత్‌ను రాష్ట్ర ప్రజలకు అందించే దిశగా అన్ని చర్యలు చేపడుతున్నట్లు చె ప్పారు.
ఇక రాష్ట్రంలో అక్రమ వ్యవసాయ మోటర్‌లను క్రమబద్దీకరించేందుకు గాను త్వరలోనే ‘కరెంటును ఆదా చేయండి-రైతులను కాపాడండి’ పేరిట కార్యక్రమాన్ని ప్రారంభించనున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన విధివిధానాలను రూపొందించేందుకు గాను బడ్జెట్ సమావేశాలకంటే ముందుగానే రైతు సంఘాల నాయకులు, రైతులతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కాగా గత ఏడాది బడ్జెట్‌లో రైతుల వ్యవసాయ పంపుసెట్‌ల కరెంటు బిల్లుల చెల్లింపునకు గాను 6,200 కోట్ల రూపాయలను కేటాయించామని, అయితే వ్యవసాయ పంపుసెట్‌ల కరెంటు బిల్లులు 7,200కోట్ల రూపాయలను దాటిపోయాయని చెప్పారు. రైతులకు వ్యవసాయ అవసరాల కోసం అందజేస్తున్న విద్యుత్ దుర్వినియోగం అవుతోందన్న విషయం తమ దృష్టికి వచ్చిందని, దీన్ని అడ్డుకునేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.