Minister Dr. c.lakshma Reddy
-
మెడికల్ హబ్‌గా హైదరాబాద్
హైదరాబాద్: రాజధాని నగరంలో అంతర్జాతీయ వైద్య సదస్సు జరుగుతుండటంతో రాష్ట్రం మెడికల్ హబ్‌గా మారబోతుందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి చెప్పారు. శనివారం ఇక్కడి హోటల్ మారియెట్‌లో జరిగిన మొదటి వరల్డ్ అబ్స్టెట్రిక్ అనస్తీషియాలజిస్ట్స్ (మత్తు మందు ఇచ్చే వైద్యులు) కాంగ్రెస్ జరిగింది. ఈ సదస్సుకు 28 దేశాల నుంచి 1,200 మంది ప్రతి నిధులు హాజరయ్యారు. సదస్సులో మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, వైద్య రంగానికి చెందిన ప్రపంచస్థాయి సదస్సు హైదరాబాద్‌లో జరగడం తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణమన్నారు. ఇలాంటి ప్రపంచ స్థాయి సదస్సులు, సమావేశాలతో హైదరాబాద్ మెడికల్ హబ్‌గా, మెడికకల్ టూరిజంగా మారుతుందన్నారు. ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. స్వైన్ ఫ్లూ వైరస్‌ను గుర్తించగానే చికిత్స అందిస్తున్నామని, అందుకు ఫీవర్ ఆసుపత్రిలో అన్నిరకాల సదుపాయాలు ఉన్న ట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ రామ్ పాపారావు, కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ సునీల్ పాండ్యా, బ్రిటన్‌కు చెందిన ఓఏఏ అధ్యక్షుడు రోషన్ ఫెర్నాండో, ఆస్ట్రేలియాకు చెందిన ఓఏఎస్ఓ అధ్యక్షుడు స్టీఫెన్ గాల్ట్ తదితరులు పాల్గొన్నారు. సదస్సులో అనస్తీషియాలజిస్ట్ వైద్యులకు సూచించే మార్గదర్శకాల బ్రోచర్‌ను మంత్రి ఆవిష్కరించారు. -
రాష్ట్రానికి త్వరలో ఎయిమ్స్ బృందం
సాక్షి, హైదరాబాద్: రాష్టానికి త్వరలో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) బృందం రానుందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో ఎయిమ్స్ ఏర్పాటుకు సంబంధించి ఈ బృందం పర్యటించి నివేదిక ఇస్తుందని చెప్పారు. రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న వివిధ ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని... వాటిని వేగవంతం చేయాలని కోరుతూ లక్ష్మారెడ్డి రెండ్రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ వెళ్లారు. ఆయన కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా, కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి హర్షవర్ధన్‌ను కలిసినట్లు లక్ష్మారెడ్డి కార్యాలయం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే మంజూరై పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను త్వరగా ప్రారంభించాలని... వాటికి నిధులు విడుదల చేయాలని ఆయన కేంద్ర మంత్రులను కోరారు. కేంద్రం వివిధ ప్రాజెక్టుల కోసం రాష్ట్రానికి రూ.755 కోట్లు మంజూరు చేయగా, కేవలం రూ.9 కోట్లు మాత్రమే మంజూరు చేసిందని ఆయన కేంద్ర మంత్రుల దృష్టికి తెచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నల్లగొండ జిల్లా బీబీనగర్‌లో 187 ఎకరాల భూమిని పరిశీలించారని... అక్కడే ఎయిమ్స్ నిర్మాణం చేపడతామని వారికి చెప్పారు. కేంద్ర బృందాన్ని పంపి ఎయిమ్స్ నిర్మాణానికి ఆమోదం తెలిపి వచ్చే బడ్జెట్లోనైనా నిధులు కేటాయించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ రంగంపై ప్రత్యేక దృష్టిసారించిందని, ప్రత్యేక ఆరోగ్య విధానాన్ని కూడా సిద్ధం చేస్తుందని కేంద్ర మంత్రులకు వివరించారు. దీంతో వారు సానుకూలత వ్యక్తంచేశారని లక్ష్మారెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఆయన వెంట ఎంపీలు జితేందర్‌రెడ్డి, కవిత, బూర నర్సయ్య గౌడ్, బీబీ పాటిల్, కొత్తా ప్రభాకర్‌రెడ్డి, బాల్క సుమన్ తదితరులు ఉన్నారు. బుధవారం కూడా ఆయన ఢిల్లీలో పలువురిని కలవనున్నారు.