Minister jogu ramannna
-
పత్తికి మద్దతు ధర కరువు
సాక్షి, ఆదిలాబాద్: పత్తికి గిట్టుబాటు ధర మాటేమో కానీ.. కనీస మద్దతు ధర కూడా కరువైంది. ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో సోమవారం పత్తి కొనుగోళ్లు ప్రారం భించారు. ప్రభుత్వం పత్తి క్వింటాలుకు కనీస మద్దతు ధర రూ.4,320 ప్రకటించగా, మొదటి రోజు క్వింటాలుకు రూ. 4 వేలు మాత్రమే రైతుకు దక్కింది. పత్తి తేమ విషయంలో వ్యాపారులు, రైతుల మధ్య వివాదం తలెత్తడంతో చర్చల అనంతరం తేమతో సంబంధం లేకుండా క్వింటాలుకు రూ.4 వేల చొప్పున కొనుగోలు చేసేందుకు వ్యాపారులు, రైతులకు మధ్య ఒప్పందం కుదిరింది. భారత పత్తి సంస్థ(సీసీఐ) మార్కెట్లో అందుబాటులో ఉన్నప్పటికీ ప్రేక్షక పాత్ర వహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రూ.43 కోత.. ఆదిలాబాద్‌లో సోమవారం పత్తి కొనుగోళ్లు ప్రారంభిస్తామని ముందుగానే ప్రకటించడంతో చుట్టుపక్కల గ్రామాలు, మహారాష్ట్ర ప్రాంతం నుంచి కూడా రైతులు పెద్ద ఎత్తున పత్తిని తీసుకొచ్చారు. ఉదయం 9.30 గంటలకు మంత్రి జోగు రామన్న, ఆదిలాబాద్ ఎంపీ గొడం నగేశ్, కలెక్టర్ ఎం.జ్యోతిబుద్ధ ప్రకాశ్ సమక్షంలో పత్తి ధర నిర్ణయం కోసం వేలం పాట నిర్వహించారు. ఎనిమిది శాతం తేమ ఉన్న పత్తికి క్వింటాలుకు రూ.4,320 నుంచి వేలం పాట ప్రారంభం కాగా, వ్యాపారులు ధర పెంపులో వ్యూహాత్మకంగా వ్యవహరించారు. రూ.4,500 కంటే ఎక్కువ ధర ఇవ్వలేమని స్పష్టం చేశారు. తర్వాత మార్కెట్‌కు వచ్చిన పత్తిలో తేమ పరిశీలించగా, 20 నుంచి 25 శాతం వరకు ఉంది. వేలం పాటలో పలికిన ధరను 8 శాతం తేమ ఉంటేనే ఇస్తామని, అంతకుమించి ఉంటే ప్రతి అదనపు శాతానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూ.43 చొప్పున కోత విధిస్తామని వ్యాపారులు చెప్పడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో మంత్రి జోగు రామన్న చొరవ తీసుకొని వ్యాపారులతో పలు దఫాలుగా రైతుల సమక్షంలో చర్చించగా, మొదటి రోజు తేమతో సంబంధం లేకుండా క్వింటాలుకు రూ.4 వేలు చెల్లించేందుకు వారు అంగీకరించడంతో కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. అయితే, మంగళవారం నుంచి పత్తిలో 8 శాతం తేమ మించితే ప్రతి అదనపు శాతానికి రూ.43 చొప్పున కోత ఉంటుందని, రైతులు పత్తిని ఆరబెట్టుకొని తీసుకురావాలని ట్రేడర్లు, అధికారులు సూచిస్తున్నారు. మొదటి రోజే భారీగా రాక.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ యేడాది సుమారు 3.27 లక్షల హెక్టార్లలో పత్తి పంట సాగైంది. 60 లక్షల క్వింటాళ్ల దిగుబడి రావచ్చని అంచనా వేస్తున్నారు. ఆదిలాబాద్‌లో సోమవారం కొనుగోళ్లు ప్రారంభం కాగా, రెండు మూడు రోజుల్లో మిగతా కేంద్రాల్లోనూ ప్రారంభించనున్నారు. కాగా, తొలిరోజే సుమారు 15వేల క్వింటాళ్ల పత్తి వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. మద్దతు ధరపై ఆశలు పెట్టుకున్న రైతులకు ప్రారంభం రోజే ఈ పరిస్థితి ఎదురుకావడంతో దిగాలు చెందుతున్నారు. -
దేశ సేవకు ముందుండాలి
మంత్రి జోగు రామన్న పిలుపు ⇒ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ప్రారంభం ⇒ 3012 మంది అభ్యర్థులు హాజరు ⇒ మెడికల్ టెస్ట్‌కు 615 మంది అర్హత ⇒ రెండో రోజూ ధ్రువీకరణ పత్రాల పరిశీలన ⇒ అర్హత-1656 , రిజక్ట్ 894 మంది ఆదిలాబాద్ స్పోర్ట్స్ : సైన్యంలో చేరి దేశానికి సేవ చేయడంలో యువత ముందుండాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఏర్పాటు చేసిన ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యూరు. జాతీయ జెండా ఆవిష్కరించారు. జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ, ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ కోసం వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాను ఎంచుకోవడం హర్షించదగిన విషయమని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రాష్ర్ట ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో మరిన్ని కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు. కలెక్టర్ ఎం.జగన్మోహన్ మాట్లాడుతూ, జిల్లాలో ఉన్న యువతకు ఆర్మీలో భారత సరిహద్దు ప్రాంతాల్లో దేశ రక్షణ అవకాశం కల్పించినందుకు ఆర్మీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. 5 జిల్లాలకు చెందిన యువత పాల్గొంటోందని, 18 శాఖల పర్యవేక్షణతో ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామని వివరించారు. చెన్నై జోన్ డెప్యూటీ డెరైక్టర్ జనరల్ సంగ్రామ దార్వీ, సైనిక ఉన్నతాధికారి కల్నల్ ఎ.కే.రోహిలా, ఏఎస్పీ పనసారెడ్డి, ఏజేసీ ఎస్.ఎస్.రాజు, డీఎస్డీవో సుధాకర్‌రావు, మెప్మా పీడీ రాజేశ్వర్, రెవెన్యూ అధికారి వనజారెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. మెడికల్ టెస్ట్‌కు 615 మంది అర్హత ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో సోమవారం అర్హత సాధించిన జిల్లా యువకులు 3,012 మంది రన్నింగ్‌లో పాల్గొన్నారు. ఇందులో యువకులు చాలామంది అలసిపోయి, మధ్యలోనే ఆగి పడిపోయారు. 3012 మందిలో నుంచి 615 మంది మెడికల్ పరీక్షలకు అర్హత సాధించారు. వీరికి బుధవారం ఉదయం 6 గంటలకు ఆర్మీకి చెందిన పది మంది బృందంతో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. కాగా, మంగళవారం జిల్లాకు చెందిన 2,550 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఎత్తు లేని వారిని 228 మందిని రిజక్ట్ చేశారు. ధ్రువీకరణ పత్రాలు సక్రమంగా లేని వారిని 666 మందిని వెనక్కి పంపించారు. 1,656 మంది పరుగుకు అర్హత సాధించారు. వీరు బుధవారం ఉదయం 5 గంటలకు ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో రిపోర్ట్ చేయాలని ఆర్మీ అధికారులు కోరారు. ఆర్మీ సైనిక ఉన్నతాధికారి కల్నల్ ఏకె.రోహిలా యువతకు పలు సూచనలందించారు. సోమవారం రాత్రి గాలివాన బీభత్సంగా ఉన్నా అధికారులు, యువకులు ఉత్సాహంగా ముందుకుసాగి ర్యాలీని విజయవంతం చేశారని చెప్పారు.