దేశ సేవకు ముందుండాలి
మంత్రి జోగు రామన్న పిలుపు
⇒ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ ప్రారంభం
⇒ 3012 మంది అభ్యర్థులు హాజరు
⇒ మెడికల్ టెస్ట్‌కు 615 మంది అర్హత
⇒ రెండో రోజూ ధ్రువీకరణ పత్రాల పరిశీలన
⇒ అర్హత-1656 , రిజక్ట్ 894 మంది
ఆదిలాబాద్ స్పోర్ట్స్ : సైన్యంలో చేరి దేశానికి సేవ చేయడంలో యువత ముందుండాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న పిలుపునిచ్చారు.
జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఏర్పాటు చేసిన ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీకి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యూరు. జాతీయ జెండా ఆవిష్కరించారు. జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ, ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ కోసం వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాను ఎంచుకోవడం హర్షించదగిన విషయమని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రాష్ర్ట ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో మరిన్ని కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు.
కలెక్టర్ ఎం.జగన్మోహన్ మాట్లాడుతూ, జిల్లాలో ఉన్న యువతకు ఆర్మీలో భారత సరిహద్దు ప్రాంతాల్లో దేశ రక్షణ అవకాశం కల్పించినందుకు ఆర్మీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. 5 జిల్లాలకు చెందిన యువత పాల్గొంటోందని, 18 శాఖల పర్యవేక్షణతో ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామని వివరించారు. చెన్నై జోన్ డెప్యూటీ డెరైక్టర్ జనరల్ సంగ్రామ దార్వీ, సైనిక ఉన్నతాధికారి కల్నల్ ఎ.కే.రోహిలా, ఏఎస్పీ పనసారెడ్డి, ఏజేసీ ఎస్.ఎస్.రాజు, డీఎస్‌డీవో సుధాకర్‌రావు, మెప్మా పీడీ రాజేశ్వర్, రెవెన్యూ అధికారి వనజారెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
మెడికల్ టెస్ట్‌కు 615 మంది అర్హత
ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో సోమవారం అర్హత సాధించిన జిల్లా యువకులు 3,012 మంది రన్నింగ్‌లో పాల్గొన్నారు. ఇందులో యువకులు చాలామంది అలసిపోయి, మధ్యలోనే ఆగి పడిపోయారు. 3012 మందిలో నుంచి 615 మంది మెడికల్ పరీక్షలకు అర్హత సాధించారు. వీరికి బుధవారం ఉదయం 6 గంటలకు ఆర్మీకి చెందిన పది మంది బృందంతో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. కాగా, మంగళవారం జిల్లాకు చెందిన 2,550 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
వీరిలో ఎత్తు లేని వారిని 228 మందిని రిజక్ట్ చేశారు. ధ్రువీకరణ పత్రాలు సక్రమంగా లేని వారిని 666 మందిని వెనక్కి పంపించారు. 1,656 మంది పరుగుకు అర్హత సాధించారు. వీరు బుధవారం ఉదయం 5 గంటలకు ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో రిపోర్ట్ చేయాలని ఆర్మీ అధికారులు కోరారు. ఆర్మీ సైనిక ఉన్నతాధికారి కల్నల్ ఏకె.రోహిలా యువతకు పలు సూచనలందించారు. సోమవారం రాత్రి గాలివాన బీభత్సంగా ఉన్నా అధికారులు, యువకులు ఉత్సాహంగా ముందుకుసాగి ర్యాలీని విజయవంతం చేశారని చెప్పారు.