కొడుకా..? అల్లుడా..?
కుత్బుల్లాపూర్ : మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి టీఆర్ఎస్లో తన దూకుడు పెంచారు. గత ఆరు నెలలుగా పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో ఏ చిన్న కార్యక్రమం జరిగినా హాజరవుతూ తనదైన శైలిలో ప్రసంగిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. అంతే కాకుండా టీఆర్ఎస్ తరఫున 2014లో ఎంపీగా పోటీ చేసిన మైనంపల్లి హన్మంతరావుకు ఇటీవల ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టడంతో మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి ఎంపీ టికెట్ విషయంలో మల్లారెడ్డికి పోటీ లేకుండా పోయింది.
దీంతో అల్లుడు, కొడుకు ఇద్దరిలో ఎవరో ఒకరికి అసెంబ్లీ సీటు ఇప్పించుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు ఎంపీ. అధిష్టానంతో ఇప్పటికే ఓ నిర్దిష్టమైన హామీ తీసుకొని, అప్పుడే తన అనుచరులతో ప్రచారం ముమ్మరం చేశారు. మల్కాజ్గిరి, మేడ్చల్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల పరిధిలో తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకొని సోషల్ మీడియా ద్వారా ప్రచారానికి తెరలేపారు.
అంతే కాకుండా.. ఇటీవల సుచిత్రలోని ఓ ఐస్‌క్రీమ్ పార్లర్లో మంత్రి కేటీఆర్ తయారు చేసిన ఐస్‌క్రీమ్‌ను రూ.5 లక్షలకు కొనుగోలు చేసి వార్తల్లో నిలిచారు. టీఆర్ఎస్ ప్లీనరీలో పార్టీ ఫండ్‌కు రూ.కోటి చెక్కు అందజేసి హాట్‌టాపిక్‌గా మారారు. ఇవ్వన్నీ పార్టీ అ«ధిష్టానాన్ని ఆకట్టుకునేందుకేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
బావా.. బామ్మర్దుల హల్చల్...
ఎంపీ మల్లారెడ్డి దత్తత తీసుకున్న దుండిగల్ గ్రామంలో అల్లుడు రాజశేఖర్‌రెడ్డి సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు దగ్గరవుతున్నారు. ఇటీవల మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి తాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకున్నారు. ఎంఎల్ఆర్ఐటీలో చదువుతున్న విద్యార్థులతో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.
ఇదే నేపథ్యంలో మార్చి 20న మల్లారెడ్డి కుమారుడు మహేందర్‌రెడ్డి జన్మదినం సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి నుంచి మేడ్చల్ నియోజకవర్గం వరకు భారీ ఎత్తున ప్రధాన రోడ్ల వెంట ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి అందరినీ ఆకర్షించారు. అధికారికంగా వీరిద్దరికి టీఆర్ఎస్లో ఎలాంటి పదవులు లేకున్నా పార్టీ కండువాలు కప్పుకుని ఫ్లెక్సీల్లో దర్శనమివ్వడం విశేషం.
అంతే కాకుండా ఈ నెల 21న కొంపల్లిలో జరిగిన టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను కలుసుకొని కార్యకర్తలతో కలిసి హడావిడి చేశారు. ఏది ఏమైనా ఎంపీగా మరోసారి పోటీ చేసేందుకు ఉత్సాహ పడుతున్న మల్లారెడ్డి తన వారసుడిని ఎంపిక చేసుకునే విషయంలో కూడా బిజీగా ఉన్నారనే చెప్పొచ్చు.