ఢిల్లీ ప్రతిష్టను మసకబార్చాయి
అత్యాచారాలు, కాలుష్యంపై కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు
న్యూఢిల్లీ: అత్యాచారాలు, కాలుష్యం ఢిల్లీ ప్రతిష్టను మసకబార్చాయని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిరెన్ రిజిజు అభిప్రాయపడ్డారు. ఇలా జరగడంవల్ల నగరవాసులకే కాకుండా దేశానికి కూడా నష్టమేనన్నారు. పశ్చిమ ఢిల్లీలోని రాజాగార్డెన్కు సమీపంలోగల శివాజీ ప్లేస్ కాంప్లెక్స్‌లో డీసీపీ నూతన కార్యాలయ భవనానికి మంగళవారరం శంకుస్థాపన చేసినఅనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన వెంట కమిషనర్ భీంసేన్ బస్సి కూడా ఉన్నారు. ‘ఢిల్లీ... దేశానికి రాజధాని అయినప్పటికీ కచ్చితంగా అదెలా ఉండాలో అలా లేదు.
పపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా పేరుగాంచింది. కొన్ని సందర్భాల్లో శాంతిభద్రతల సమస్య తలెత్తుతోంది. దీంతోపాటు అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇవన్నీ జాతీయ రాజధాని ప్రతిష్టను మసకబార్చాయి’అని అన్నారు. ఇక్కడ నిర్మించతలపెట్టిన భవనం విషయమై మాట్లాడుతూ దీని నమూనా తనకు ఎంతో బాగా నచ్చిందన్నారు. ప్రణాళికాబద్ధంగా నిర్ణీత కాలవ్యవధిలో, నాణ్యతా ప్రమాణాలతో పనులు జరుగుతాయని ఆశిస్తున్నట్టు తెలిపారు. ఈ భవనం ప్రగతి వేగం స్వల్పం జాతీయ రాజధాని నగరం అభివృద్ధి చెందుతున్నప్పటికీ ఇందుకు సంబంధించిన వేగం మాత్రం ఆశించిన రీతిలో లేదని కిరెన్ అభిప్రాయపడ్డారు. నగరవాసులంతా స్వచ్ఛ్ భారత్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఢిల్లీ పోలీసు విభాగంలో ఈశాన్య యువత
ఢిల్లీ పోలీస్ విభాగంలో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన 160 మంది యువతను నియమించినట్లు కేంద్రహోంశాఖ సహాయ మంత్రి కిరేన్ రిజిజూ తెలిపారు. మంగళవారం ఢిల్లీ పోలీస్ ప్రధాన కార్యాలయంలో నగర పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీతో కలిసి నిర్వహించిన అధికారుల సమీక్షలో ఈ మేరకు ఆయన వివరాలు వెల్లడించారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరమ్, నాగాలాండ్, త్రిపుర, సిక్కిల నుంచి 10 మంది పురుషులు, 10 మంది మహిళా అధికారులు ఢిల్లీ పోలీస్ విభాగంలో పనిచేయనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఢిల్లీ పోలీస్ విభాగంలో 39 మంది మాత్రమే ఈశాన్యరాష్ట్రాలకు చెందిన అధికారులు ఉన్నారని అన్నారు.
ఇందులో 10 ఐపీఎస్ కేటగిరి, మిగతా వారు కానిస్టేబుల్, హెడ్‌కానిస్టేబుల్, సీఐలు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. పోలీస్ విభాగంలో బెజ్బార్హు కమిటీ సిఫార్సులను కచ్చితంగా అమలు చేయనున్నట్లు మంత్రి చెప్పారు. ఈశాన్యరాష్ట్రాల ప్రజలు మెట్రోనగరాల్లో భద్రత కరువైందని ఆ కమిటీ సూచించిందని, దీన్ని అధిగమించేందుకు పలు సూచనలు కూడా చేసిందని మంత్రి అన్నారు. ఈ కమిటీ లేవనెత్తిన పలు అంశాలను ఢిల్లీ పోలీసుల అధికారులతో చర్చించినట్లు మంత్రి చెప్పారు. నగరంలో ఈశాన్యరాష్ట్రాల ప్రజలకు భద్రత కల్పించడంలో ఢిల్లీ పోలీసులు తీసుకొంటున్న చర్యలను అభినందించారు. ఈశాన్యరాష్ట్రాల హెల్ప్‌లైన్ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం..నగరంలో 2,00,000 లక్షల మంది ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారని, ఇందులో 50 శాతం మహిళలు ఉన్నారని తెలిపారు.