Minister Murali Umamaheswara Rao
-
పదవుల లొల్లి పతాకస్థాయికి!
కార్పొరేషన్లో 23కు పెరిగిన అసమ్మతి బలం మహానాడు తరువాత మాట్లాడదామన్న అధిష్టానం బలాన్ని కూడగట్టేపనిలో మేయర్ గ్రూపు తలమునకలు విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థ టీడీపీలో పదవుల లొల్లి పతాకస్థాయికి చేరింది. మేయర్ అసమ్మతి వర్గం మంగళవారం నాటికి 23 మంది కార్పొరేటర్ల మద్దతు కూడగట్టింది. కౌన్సిల్లో టీడీపీకి 38 మంది సభ్యుల బలం ఉండగా మెజార్టీ సభ్యుల్ని అసమ్మతి గ్రూపు తమవైపు తిప్పుకోగలిగింది. ఈ మేరకు టీడీపీ నగర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నకు వినతిపత్రం అందజేసినట్లు తెలుస్తోంది. గడిచిన రెండు రోజులుగా సాగుతున్న సంతకాల సేకరణ టీడీపీలో చిచ్చు రేపుతోంది. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పలువురు కార్పొరేటర్లకు ఫోన్ చేసి ఏంచేసినా పార్టీ అల్లరి కాకుండా చేయమని సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ సైతం అసమ్మతి వర్గానికి కొమ్ముకాస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మహానాడు కార్యక్రమం పూర్తయ్యాక ఓ నిర్ణయం తీసుకుందామని అసమ్మతి గ్రూపునకు ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చినట్లు సమాచారం. ఆచితూచి... తాజా పరిణామాల నేపథ్యంలో మేయర్ వర్గం ఆచితూచి వ్యవహరిస్తోంది. సోమవారం రాత్రి నుంచే కొందరు కార్పొరేటర్లతో ఫోన్లలో మాట్లాడటం ద్వారా సంతకాల సేకరణకు వారిని దూరం చేసింది. 15 మంది కార్పొరేటర్ల బలాన్ని సంపాదించింది. అసమ్మతి వర్గాన్ని చీల్చేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సామాజిక సమీకరణల్ని తెరపైకి తెస్తున్నట్లు సమాచారం. మహానాడు పూర్తవడానికి మరో వారం రోజులు గడువు ఉంది కాబట్టి అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకోవాలనే యోచనలో మేయర్ వర్గం ఉన్నట్లు తెలుస్తోంది. సెంట్రల్ నియోజకవర్గం నుంచి అత్యధికంగా 17 మంది టీడీపీ కార్పొరేటర్లు గెలుపొందారు. మేయర్ వైఖరిపై వారి నుంచే ప్రధానంగా అసంతృప్తి వ్యక్తమవుతోంది. తాజాగా తూర్పు నియోజకవర్గం కార్పొరేటర్లు వారితో జట్టు కట్టారు. దీంతో అసమ్మతి బలం పెరిగింది. ఈ రెండు నియోజకవర్గాలపై ప్రధానంగా దృష్టిసారిస్తే గండం నుంచి బయటపడొచ్చన్నది మేయర్ గ్రూపు అంచనా. మరో వారం రోజులు గడిస్తే కానీ టీడీపీ పాలి‘ట్రిక్స్’లో విజేత ఎవరన్నది తేలదు. రేసులో ఎవరెవరు... మేయర్ రేసులో చెన్నుపాటి గాంధీ, ముప్పా వెంకటేశ్వరరావు, పి.త్రిమూర్తిరాజు.. డిప్యూటీ మేయర్‌ను ఆశిస్తున్నవారిలో ఆతుకూరి రవికుమార్, కాకు మల్లిఖార్జున యాదవ్, నెలిబండ్ల బాలస్వామి.. ఫ్లోర్‌లీడర్ పదవి కోసం యెదుపాటి రామయ్య, హబీబుల్లా ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. ఇప్పటివరకు తూర్పు నియోజకవర్గానికి మేయర్, పశ్చిమకు ఫ్లోర్‌లీడర్, సెంట్రల్‌కు డిప్యూటీ మేయర్ పదవుల్ని కేటాయించారు. మార్పు జరిగితే ఇదే తరహాలో జరిగే అవకాశం ఉంటుందని ఆశావహులు లెక్కలేస్తున్నారు. డిప్యూటీ మేయర్, ఫ్లోర్‌లీడర్ల పదవులకు సంబంధించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎంపీ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని, మేయర్ పదవి విషయంలో పూర్తి అధికారం ముఖ్యమంత్రి చంద్రబాబుదేనని ఆ పార్టీ శ్రేణులు అంటున్నాయి. చంద్రబాబు వద్ద ఎవరు చక్రం తిప్పగలిగితే వారికే పదవి దక్కే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో మేయర్ చైర్ ఆశిస్తున్న ఓ కార్పొరేటర్ కేంద్ర మంత్రి ద్వారా పావులు కదపాలనే యోచనలో ఉన్నట్లు భోగట్టా. -
మంత్రి ఉమా హామీకి ఏడాది
కరకట్ట వెంబడి భవనాలు తొలగిస్తానంటూ ప్రగల్భాలు ఆక్రమణల మధ్యనే సీఎం చంద్రబాబు నివాసం ప్రస్తుతం ఆక్రమణల ఊసే ఎత్తని ఉమా... విజయవాడ: కృష్ణానది వెంబడి గుంటూరు జిల్లా వైపు కరకట్టపై ఆక్రమణలు తొలగిస్తాం, భవిష్యత్తులో కొత్త నిర్మాణాలకు అనుమతించబోం’. నీటి పారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు.(గతేడాది డిసెంబర్ 31న మీడియా ప్రతినిధులతో చెప్పిన మాటలు) సరిగ్గా ఏడాది కిందట నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మీడియా ప్రతినిధులందర్ని తీసుకువెళ్లి నదీతీరంలో ఉన్న ఆక్రమణలు చూపించారు. అప్పటికప్పుడు కృష్టా డెల్టా సీఈ సుధాకర్‌కు ఫోన్ చేసి ఆక్రమణదారులకు నోటీసులు ఇవ్వాలంటూ ఆదేశించారు. అదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ ఆక్రమణ మధ్యే తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మంత్రి ఉమా ఈ ఆక్రమణల గురించి నోరేత్తే సాహసం చేయడం లేదు. మంత్రిగా ఆయనకు ఎదురైన తొలి చేదు అనుభవం. ఆక్రమణ కట్టడాలన్ని మంత్రి ప్రకటన... కృష్ణానది వెంబడి సుమారు 18 కిలోమీటర్లు మేర నిర్మించిన ఇస్కాన్ టెంపులు, గణపతి సచ్చిదానంద ఆశ్రమం, ఎంపీ గోకరాజు గంగరాజు గెస్ట్‌హౌస్, లింగమనేని గెస్ట్‌హౌస్, డాక్టర్ మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం, చిగురు భవనం తదితర కట్టడాలను బోటులోంచి పరిశీలించి, వాటి సమాచారం అధికారుల ద్వారా తెలుసుకుని అవన్నీ అక్రమ నిర్మాణాలే అని ప్రకటించారు. డాక్టర్ మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం ఆరు అంతస్తుల భవన సముదాయాలు ఐదు ఉండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబును ఒప్పించి ఇక్కడ తాత్కాలిక సెక్రటేరియట్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. తాత్కాలిక రాజధానికి కావాల్సిన భవనాలన్ని ఇక్కడే ఉన్నాయంటూ అభిప్రాయపడ్డారు. గుడిసెలకు అనుమతులు తీసుకుని నదిని ఆక్రమించి భవన సముదాయాలను నిర్మించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు నెలరోజుల్లో ఆ భవనాలకు నోటీసులు ఇచ్చి స్వాధీనం చేసుకుంటూ మంటూ ప్రగల్బాలు పలికారు. ఎంపీ గోకరాజు గంగరాజు షాక్ మంత్రి ఉమాకు నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజు గట్టి షాక్ ఇచ్చారు. కరకట్ట వెంబడి గంగరాజుకు ఉన్న 40 సెంట్ల స్థలాన్ని బీజేపీకి అనుబంధంగా నడుస్తున్న డాక్టర్ శ్యామ్ ప్రసాద్‌ముఖర్జీ ట్రస్టుకు విరాళంగా ఇవ్వడమే కాకుండా ఈ ఏడాది జనవరి 23వ తేదీన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడుతో అక్కడ భవన నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేయించారు. మంత్రి ఉమా కుదేలయ్యారు. సీఎం నివాసం అక్కడే సర్వేనెంబర్ 271, 272లలో 1.31 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న లింగమేని గెస్ట్‌హౌస్‌ను ముఖ్యమంత్రి తన నివాసంగా మార్చుకున్నారు. ఆయన కోసం గెస్ట్‌హౌస్ మొత్తాన్ని మార్చారు. కరకట్ట రోడ్డును ఆధునీకరించారు. మంత్రి ప్రకటించినట్లుగా నదీపరివాహ ప్రాంతంలో నిర్మించిన భవనాలు ఆక్రమణలు అయితే అందులో ముఖ్యమంత్రి ఎందుకు ఉంటున్నారనే ప్రశ్నకు మంత్రి ఉమా సమాధానం చెప్పరు. ఆ తరువాత పలుమార్లు విలేకరులు నదీతీరంలో ఆక్రమణలు గురించి ప్రస్తావించినప్పుడు ఆ అంశం సీఆర్డీఎ అధికారులు చూస్తున్నారంటూ ఉమా మాట దాటేవేయడానికే ప్రయత్నిస్తున్నారు. కాల్వగట్ల ఆక్రమణలపైన నగరంలోని కాల్వగట్ల ఆక్రమణలను తొలగిస్తామంటూ మంత్రి ఉమా అప్పట్లో ప్రకటించారు. ఇరిగేషన్ అధికారులు పేదల ఇళ్లకు నోటీసులు జారీ చేశారు. ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో మంత్రి ఉమా తోకముడిచి.. పేదలకు ఇళ్లు నిర్మించి ఇచ్చిన తరువాతనే తొలగిస్తామంటూ ఆ ప్రతిపాదనను విరమించు కున్నారు. -
చురుగ్గా సాగునీటి ప్రాజెక్టుల పనులు
భీమడోలు : రాష్ర్టంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించి వెళుతూ శనివారం భీమడోలులోని ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు ఇంటి వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు 491 టీఎంసీల గోదావరి జలాలు వృధాగా సముద్రంలోకి వదిలేశామన్నారు. రాష్ర్టంలో 47.8 టీఎంసీల నీటిని మాత్రమే వినియోగించున్నామని చెప్పారు. సగటున రోజుకు 2 నుంచి 3 టీఎంసీల గోదావరి నీరు వృథాగా పోతోందన్నారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలనేది పోలవరం, పట్టిసీమ ప్రొజెక్టుల నిర్మాణం ప్రధాన ఉద్దేశమన్నారు. గోదావరి వరద నీటిని కృష్ణా ఆయకుట్టుకు మళ్లించి, ఆగస్టు, సెప్టెంబర్‌లో వచ్చే కృష్ణా వరదనీటిని శ్రీశైలం, హంద్రీనీవా, గాలేరు-నగరి, తెలుగుగంగ ప్రొజెక్టుల ద్వారా రాయలసీమకు మళ్లిస్తామన్నారు. దీనిద్వారా కొంతమేరైనా సాగు, తాగునీటి సమస్య తీరుతుందన్నారు. ఉభయగోదావరి జిల్లాలకు పూర్తి స్థాయిలో తాగు, సాగు నీటి అవసరాలు తీరిన తర్వాతే కృష్ణా ఆయుకట్టుకు నీటిని మళ్లిస్తామన్నారు. జిల్లా కలెక్టర్‌తో పాటు అన్ని శాఖల అధికారులు, కంట్రాక్టర్ల సమన్వయంతో పనులు చురుగ్గా సాగుతున్నాయన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని వచ్చే ఏడాది నాటికి పూర్తి చేస్తామన్నారు. మంత్రి వెంట కలెక్టర్ కె.భాస్కర్, ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు ఉన్నారు. ఆయిల్ పైపులైన్ నిర్మాణం పరిశీలన దేవరపల్లి(గోపాలపురం): గోపాలపురం మండలం భీమోలు వద్ద జరుగుతున్న గెయిల్, హెచ్‌పీసీఎల్ ఆయిల్ పైపులైన్ నిర్మాణ పనులను రాష్ట్ర నీటిపారుదల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు శనివారం పరిశీలించారు. విశాఖపట్నం నుంచి విజయవాడకు సుమారు 15 ఏళ్ల క్రితం ఆయిల్ పైపులైన్లు ఏర్పాటు చేసి ఆయిల్‌ను పంపింగ్ చేస్తున్నారు. పైపులైన్ పోలవరం కాలువ తవ్వకానికి అడ్డుగా ఉండటం వల్ల ఇటీవల తొలగించి కాలువ అడుగుభాగం నుంచి ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులను మంత్రి పరిశీలించారు. త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భీమోలు నుంచి గోపాలపురం వరకు సుమారు 3 కిలోమీటర్ల పైపులైను వేస్తున్నారు. మంత్రి వెంట కలెక్టర్ కాటంనేని భాస్కర్, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు ఉన్నారు.