కార్పొరేషన్‌లో 23కు పెరిగిన అసమ్మతి బలం
మహానాడు తరువాత మాట్లాడదామన్న అధిష్టానం
బలాన్ని కూడగట్టేపనిలో మేయర్ గ్రూపు తలమునకలు
విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థ టీడీపీలో పదవుల లొల్లి పతాకస్థాయికి చేరింది. మేయర్ అసమ్మతి వర్గం మంగళవారం నాటికి 23 మంది కార్పొరేటర్ల మద్దతు కూడగట్టింది. కౌన్సిల్‌లో టీడీపీకి 38 మంది సభ్యుల బలం ఉండగా మెజార్టీ సభ్యుల్ని అసమ్మతి గ్రూపు తమవైపు తిప్పుకోగలిగింది. ఈ మేరకు టీడీపీ నగర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నకు వినతిపత్రం అందజేసినట్లు తెలుస్తోంది. గడిచిన రెండు రోజులుగా సాగుతున్న సంతకాల సేకరణ టీడీపీలో చిచ్చు రేపుతోంది. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పలువురు కార్పొరేటర్లకు ఫోన్ చేసి ఏంచేసినా పార్టీ అల్లరి కాకుండా చేయమని సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ సైతం అసమ్మతి వర్గానికి కొమ్ముకాస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మహానాడు కార్యక్రమం పూర్తయ్యాక ఓ నిర్ణయం తీసుకుందామని అసమ్మతి గ్రూపునకు ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చినట్లు సమాచారం.
ఆచితూచి...
తాజా పరిణామాల నేపథ్యంలో మేయర్ వర్గం ఆచితూచి వ్యవహరిస్తోంది. సోమవారం రాత్రి నుంచే కొందరు కార్పొరేటర్లతో ఫోన్లలో మాట్లాడటం ద్వారా సంతకాల సేకరణకు వారిని దూరం చేసింది. 15 మంది కార్పొరేటర్ల బలాన్ని సంపాదించింది. అసమ్మతి వర్గాన్ని చీల్చేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సామాజిక సమీకరణల్ని తెరపైకి తెస్తున్నట్లు సమాచారం. మహానాడు పూర్తవడానికి మరో వారం రోజులు గడువు ఉంది కాబట్టి అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకోవాలనే యోచనలో మేయర్ వర్గం ఉన్నట్లు తెలుస్తోంది. సెంట్రల్ నియోజకవర్గం నుంచి అత్యధికంగా 17 మంది టీడీపీ కార్పొరేటర్లు గెలుపొందారు. మేయర్ వైఖరిపై వారి నుంచే ప్రధానంగా అసంతృప్తి వ్యక్తమవుతోంది. తాజాగా తూర్పు నియోజకవర్గం కార్పొరేటర్లు వారితో జట్టు కట్టారు. దీంతో అసమ్మతి బలం పెరిగింది. ఈ రెండు నియోజకవర్గాలపై ప్రధానంగా దృష్టిసారిస్తే గండం నుంచి బయటపడొచ్చన్నది మేయర్ గ్రూపు అంచనా. మరో వారం రోజులు గడిస్తే కానీ టీడీపీ పాలి‘ట్రిక్స్’లో విజేత ఎవరన్నది తేలదు.
రేసులో ఎవరెవరు...
మేయర్ రేసులో చెన్నుపాటి గాంధీ, ముప్పా వెంకటేశ్వరరావు, పి.త్రిమూర్తిరాజు.. డిప్యూటీ మేయర్‌ను ఆశిస్తున్నవారిలో ఆతుకూరి రవికుమార్, కాకు మల్లిఖార్జున యాదవ్, నెలిబండ్ల బాలస్వామి.. ఫ్లోర్‌లీడర్ పదవి కోసం యెదుపాటి రామయ్య, హబీబుల్లా ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. ఇప్పటివరకు తూర్పు నియోజకవర్గానికి మేయర్, పశ్చిమకు ఫ్లోర్‌లీడర్, సెంట్రల్‌కు డిప్యూటీ మేయర్ పదవుల్ని కేటాయించారు. మార్పు జరిగితే ఇదే తరహాలో జరిగే అవకాశం ఉంటుందని ఆశావహులు లెక్కలేస్తున్నారు. డిప్యూటీ మేయర్, ఫ్లోర్‌లీడర్ల పదవులకు సంబంధించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎంపీ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని, మేయర్ పదవి విషయంలో పూర్తి అధికారం ముఖ్యమంత్రి చంద్రబాబుదేనని ఆ పార్టీ శ్రేణులు అంటున్నాయి. చంద్రబాబు వద్ద ఎవరు చక్రం తిప్పగలిగితే వారికే పదవి దక్కే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో మేయర్ చైర్ ఆశిస్తున్న ఓ కార్పొరేటర్ కేంద్ర మంత్రి ద్వారా పావులు కదపాలనే యోచనలో ఉన్నట్లు భోగట్టా.