minister pa
-
కేటీఆర్ పీఏనంటూ మోసం
-
కేటీఆర్ పీఏనంటూ బురిడీ..
సాక్షి, హైదరాబాద్: మంత్రి కేటీఆర్ పీఏనంటూ మోసాలు చేస్తున్న రంజీ మాజీ క్రికెటర్ నాగరాజు బుడుమురును నగర సైబర్ క్రైమ్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. సీసీఎస్ జాయింట్ సీపీ అవినాష్ మహంతి కథనం ప్రకారం.. గతంలో ఆంధ్రప్రదేశ్ తరఫున రంజీ ట్రోఫీల్లో ఆడిన నాగరాజు హైఫై లైఫ్‌కు అలవాటు పడి మోసాలబాటను ఎంచుకున్నాడు. ఆర్థిక వనరులు పుష్కలంగా ఉండే వ్యాపారుల సెల్‌నంబర్లను ఏదో ఒక రీతిని సంపాదిస్తాడు. ఆ తర్వాత ఫలానా మంత్రి పీఏనంటూ మాట కలుపుతాడు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రంజీ క్రికెట్ నాగరాజు పేదవాడని, అతడికి క్రికెట్ కిట్లను స్పాన్సర్ చేయమంటూ నమ్మించి బురిడీ కొట్టిస్తాడు. ఇదే తరహాలో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)కి గతేడాది డిసెంబర్ 26న ఫోన్‌కాల్ చేసి కేటీఆర్ పీఏ తిరుపతిని మాట్లాడుతున్నానంటూ మాటలు కలిపాడు. ‘ఆంధ్రప్రదేశ్‌కు చెందిన క్రికెటర్ నాగరాజు బుడుమురు అండర్ 25 వరల్డ్‌కప్‌కు, ట్వంటీ20 సన్‌రైజర్స్ టీమ్‌కు ఎంపికయ్యాడు. అతడిది నిరుపేద కుటుంబమని క్రికెట్ కిట్‌కు, పర్యటన కోసం స్పాన్సర్షిప్ కావాలంటూ నమ్మించాడు. మీ సంస్థ లోగో ఆ క్రికెట్ కిట్‌పై ప్రదర్శిస్తారని, ఆ కిట్ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా నాగరాజుకు అందిస్తామ’ని నిందితుడు చెప్పాడు. ఇది నమ్మిన ఆ కంపెనీ సీఎండీ అతడిచ్చిన బ్యాంక్ ఖాతాకు రూ.3,30,400 బదిలీ చేశాడు. చివరకు మోసపోయానని తెలుసుకున్న కంపెనీ ప్రతినిధి జనవరి 13న నగర సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు టెక్నికల్ డాటా ఆధారంగా నిందితుడు నాగరాజును శనివారం అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపరిచి చంచల్‌గూడ జైలుకు తరలించారు. -
ఆమె.. అనుకూలమేనా?
ఏరి కోరి నియమించుకున్న పీఏ. అర్హతలు లేకపోయినా ఈ నియామకం మూడేళ్లుగా చెల్లుబాటు అవుతోంది. పేనుకు పెత్తనం ఇచ్చిన చందంగా.. మంత్రి అండదండల నేపథ్యంలో ఆ వ్యక్తి ముదిరిపోయాడు. ఎంతలా అంటే.. మంత్రిదేముంది, ఆమె కుమారునిదేముంది అంతా నేనే అనే స్థాయికి వ్యవహారం చేరుకుంది. ఇదంతా ఒక ఎత్తయితే.. మహిళలు శాఖాపరమైన సమస్యతో ఆయన్ను ఆశ్రయిస్తే.. నాకేంటి అనే ధోరణి ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ఆడియో ఆయన తెరచాటు బాగోతాలకు అద్దం పట్టింది. డబ్బుదేముంది.. మరో రూపంలో తనను మెప్పించాలని ఓ ‘మధ్యవర్తి’తో సాగించిన సంభాషణ మంత్రి చుట్టూ చేరిన అనధికార వ్యక్తుల అసలు రూపం ఇట్టే అర్థమవుతోంది. అనంతపురం సిటీ: జిల్లాలో ఓ మంత్రి వద్ద సహాయకునిగా పనిచేస్తున్న వ్యక్తి తీరు వివాదాస్పదమవుతోంది. పలు సమస్యలతో మంత్రి వద్దకు వచ్చే వారంతా అతగాడి చేతులు తడపాల్సిందే. అదే మహిళలు అయితే కాసులు ముట్టడు. తన కామవాంఛ తీర్చమంటాడు. మంత్రిని కలిసిననా చివరకు పని చేయాల్సింది తామే కాబట్టి.. తాము చెప్పినట్టు వింటే అన్నీ సాఫీగా జరిగిపోతాయంటూ నమ్మబలికి లోబరుచుకుంటున్నాడు. ఇందుకు తోటి ఉద్యోగులను పావులుగా వాడుకుంటున్నాడు. ఇతగాడి చేష్టలతో విసిగిపోయిన పలువురు మహిళలు ఆ మంత్రి గడప తొక్కడమే మానేశారు. నిస్సహాయ స్థితిలో ఉన్న మహిళల అవసరాలను ఆసరాగా చేసుకుని వారిని అన్ని విధాలా వాడుకునేందుకు కుట్రలు పన్నుతున్న ప్రబుద్ధిడి గురించి మంత్రి దృష్టికి వెళ్లినప్పటికీ.. తమ సామాజిక వర్గానికి చెందినవాడని ఉదాసీనంగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. ♦ అర్హతలు లేకపోయినా మంత్రి వద్ద పీఏగా చలామణి అవుతున్న ఆ ఉద్యోగి వ్యవహారం గతంలో పెద్ద దుమారమే రేగింది. ఏకంగా ఛైర్మన్ స్థాయి నేతకు సలహాలు ఇచ్చే ప్రయత్నం చేసి పాలకవర్గం కోపాగ్నికి ఆ శాఖ ఉద్యోగుల ముందు అబాసుపాలయ్యాడు. ఇలా చెబుతూ పోతే అతగాడి పాపాల చిట్టా పుట్టలా పెరిగిపోతుంది. ఇటీవల సొంత శాఖకు చెందిన మహిళా ఉద్యోగి మధ్యవర్తి ద్వారా అతగాడిని ఆశ్రయించింది. సహోద్యోగితో ఫోన్లో ‘పీఏ’ సాగించిన ‘లైంగిక కోర్కెల’ సంభాషణ ఆడియో టేపు ఒకటి బయటకొచ్చింది. ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది. సంభాషణ సాగిందిలా.. సన్నిహితుడు: సార్ నమస్తే. ఆ పల్లెకు చెందిన మహిళా ఉద్యోగి మీ కోసం వచ్చింది. తన పని చేసిపెట్టమని అడుగుతోంది. ఏం చేయమంటారు? పీఏ: ఆ.. నిన్న వచ్చింది. నాతో ఏవో తన సమస్యలన్నీ చెప్పింది. పని చేసి పెట్టామప్ప..ఏం హ్యాపీనా?! సన్నిహితుడు: ఆ.. హ్యాపీనే సార్. పీఏ: ఇంతకీ ఏంటి ఆమె క్యారెక్టర్? సన్నిహితుడు: మంచిదే...పాపం ఎవరూ ‘తోడు’ లేరు. పీఏ: అదికాదయ్యా.. నేనడిగేది...! ‘ఏంటి ఆ..మె పరిస్థితి’ అని? సన్నిహితుడు:చిన్నగా ‘పర్వాలేదు..సార్’ అంటుండగానే పీఏ: ఏమయ్యా గట్టిగా మాట్లాడు. ఎక్కడున్నావ్ సన్నిహితుడు: జెడ్పీ క్యాంటిన్లో టిఫిన్‌కు వచ్చా సార్. పీఏ: సరే అక్కడి నుంచి పక్కకు రా? సన్నిహితుడు: వచ్చాను సార్. పీఏ: ఏంటి ఆమె ఎలాంటిది.. పర్వాలేదా.. అని అడుగుతున్నా? గట్టిగా సమాధానం చెప్పు. సన్నిహితుడు: భర్తతో విభేదాలొచ్చి దూరంగా ఉంటోంది. పీఏ:ఆఆ..పర్వాలేదా? సన్నిహితుడు: ఊ పర్లేదు సార్? పీఏ: అంటే ఎలాంటిది అని అడుగుతున్నా? సన్నిహితుడు: అంటే క్యారెక్టర్ గురించి అడుగుతున్నా రా? పీఏ: అవును... డిబ్యాచ్లరా? సన్నిహితుడు: క్యారెక్టర్ మరీ అంత బ్యాడ్ కాదు సార్.. భర్తకు దూరంగా ఉంటోందంట సార్! పీఏ: అవునా...సరే ఆమె పని చేసిపెట్టాలంటే ఖర్చులుంటాయప్ప. అవెవరూ భరించరు. మేమే చేతినుంచి పెట్టుకుని చేయాలి. ఈ విషయం చెప్పావా? సన్నిహితుడు: సరే లక్ష దాకా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. వాస్తవంగా మంత్రి, ఆమె కుమారుడిని కలవాలని చాలా ప్రయత్నించింది. వారు సమయానికి దొరకలేదు. పీఏ: వారిని కలసినా మాకే ఆ పని అప్పగిస్తారు. వాళ్లేం డబ్బు ఇవ్వరు. ఎవరికి చెప్పినా చివరికి పని చేయాల్సింది నేనే. సన్నిహితుడు: మీరు మంత్రి దగ్గర పీఏగా ఉన్న విషయాన్ని తెలుసుకుని మన డిపార్టు మెంటతనే కదా అని నా వద్దకు వచ్చింది. నన్నడిగితే మీకు చెప్పి మంత్రి ఇంటి వద్దకు పంపుదామనుకున్నా. మీరు మధ్యలోనే కలసి ఫోన్లోనే ‘పని’ చేసి పెట్టారని చెప్పింది. పీఏ: ఇప్పుడేమంటోంది. హ్యాపీనా ఆమె... సన్నిహితుడు: ఆ హ్యాపీనే సార్. పీఏ: కాకపోతే ఆమె లక్ష ఇస్తానంటోంది కదా.. డబ్బు రూపంగా కాకుండా ‘మరోలా సహకరించమని’ చెప్పు. -
దటీజ్ జగన్నాథం!
- మంత్రి సునీతకు పీఏగా పని చేసిన టీచరు బదిలీ - సిండికేట్‌నగర్ స్కూల్‌కు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు - విరుద్ధంగా కౌన్సెలింగ్ సమయంలో ఉత్తర్వులివ్వడంపై సర్వత్రా విమర్శలు - కమిషనర్ ఉత్తర్వుల మేరకే స్కూల్ కేటాయించామంటున్న డీఈఓ అనంతపురం ఎడ్యుకేషన్: ‘వడ్డించేవాడు మనోడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా కొదవండదనే’ నానుడికి అద్దంపట్టేలా ఉంది ప్రభుత్వ తీరు. నిబంధనలు సామాన్యులకు తప్ప తమలాంటి వారికి కాదని అధికార పార్టీ నేతలు నిరూపించారు. తాజాగా విద్యాశాఖలో బదిలీలు జరుగుతున్న తరుణంలో ప్రభుత్వం బదిలీ ఉత్తర్వులు జారీ చేయడం కలకలం రేపుతోంది. మంత్రి పరిటాల సునీత పీఏగా పని చేసిన బయాలజికల్ సైన్స్ టీచరు జగన్నాథంను అనంతపురం రూరల్ సిండికేట్‌నగర్‌కు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం ఉపాధ్యాయుల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధమని, చట్టాలు చేయాల్సిన వారే వాటిన అపహాస్యం చేసేలా నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ సామాన్య టీచర్లు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు మండిపడుతున్నారు. జగన్నాథం సోమందేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బయాలజికల్ సైన్స్ టీచరుగా పని చేస్తున్నారు. ఈయన మంత్రి పరిటాల కుటుంబానికి సమీప బంధువు. కొన్నేళ్లుగా సునీతకు అధికారికంగా పీఏగా పని చేస్తున్నారు. అయితే టీచర్లు బడిలోనే ఉండాలి తప్ప బోధనేతర పోస్టుల్లో ఉండకూడదంటూ ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ప్రజాప్రతినిధుల వద్ద పీఏలుగా ఉన్న టీచర్ల డెప్యుటేషన్లు రద్దు చేస్తూ వారిని బడికి పంపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా మంత్రి పరిటాల సునీత పీఏగా పని చేసిన జగన్నాథంను రిలీవ్ చేశారు. ఈ పరిస్థితుల్లో బడికి వెళ్లాల్సి వచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా ఉత్తర్వులు: నిబంధనల ప్రకారం బదిలీ షెడ్యూలు విడుదలయిన తర్వాత ఎలాంటి బదిలీలను ప్రభుత్వం చేపట్టకూడదు. అయితే జగన్నాథం విషయంలో ఇందుకు విరుద్ధంగా చర్యలు తీసుకుంది. ఆయన బదిలీ కోసం గతంలోనే దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై ప్రభుత్వం జిల్లా విద్యాశాఖ అధికారికి రిమార్క్సు అడిగింది. ఈలోపు బదిలీల షెడ్యూలు విడుదలైంది. ఇంతటితో ఈ ప్రక్రియ ముగిసిందని భావించారు. తీరా కౌన్సెలింగ్ రోజు బుధవారం సిండికేట్ నగర్ పాఠశాలకు జగన్నాథంను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా విద్యాశాఖ అధికారులు ఆగమేఘాలపైఅమలు చేశారు. వాస్తవానికి సిండికేట్‌నగర్ స్కూల్లో క్లియర్ వేకెన్సీ ఉంది. ఖాళీల జాబితాలో కూడా చూపించారు. తీరా కౌన్సెలింగ్ సమంయలో ఖాళీల జాబితాలో ఆ స్కూల్ పేరు గల్లంతుకావడంతో టీచర్లు అవాక్కయ్యారు. దీనిపై డీఈఓ లక్ష్మీనారాయణ ‘సాక్షి’తో మాట్లాడుతూ...జగన్నాథంను సిండికేట్‌నగర్ స్కూల్‌కు బదిలీ చేస్తూ కమిషనర్ ఉత్తర్వులిచ్చారని వాటిని అమలు చేశామన్నారు. -
మంత్రి పీఏనని.. రూ. 85లక్షలు స్వాహా..
బంజారాహిల్స్: తాను ఓ మంత్రి పీఏనని, మెడికల్ సీటు ఇప్పిస్తానని డబ్బు తీసుకొని మోసం చేసిన కేటుగాడిని బంజారాహిల్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం... నల్లగొండ జిల్లా చెర్కుపల్లి గ్రామానికి చెందిన మేకల రఘురాంరెడ్డి అలియాస్ రఘుమారెడ్డి తాను ఓ మంత్రి పీఏనని బంజారాహిల్స్ రోడ్ నెం. 14లోని అమృతా ఎన్‌క్లేవ్‌లో నివసించే సయ్యద్ అతర్ హుస్సేన్(20)ను పరిచయం చేసుకున్నాడు. తనకు మెడికల్ కాలేజీల యాజమాన్యాలతో సంబంధాలున్నాయని, గతంలో చాలా మందికి ఎంబీబీఎస్ సీట్లు ఇప్పించానని నమ్మబలికాడు. అతర్ హుస్సేన్‌కు మెడికల్ సీటు ఇప్పిస్తానని రూ. 85 లక్షలు వసూలు చేశాడు. సీటు రాకపోవడంతో బాధితుడు నిలదీయగా అదిగో.. ఇదిగో అంటూ కాలయాపన చేస్తూ చివరకు ముఖం చాటేశాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితు అతర్ హుస్సేన్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు రఘురాంరెడ్డిని బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.