ఏరి కోరి నియమించుకున్న పీఏ. అర్హతలు లేకపోయినా ఈ నియామకం మూడేళ్లుగా చెల్లుబాటు అవుతోంది. పేనుకు పెత్తనం ఇచ్చిన చందంగా.. మంత్రి అండదండల నేపథ్యంలో ఆ వ్యక్తి ముదిరిపోయాడు. ఎంతలా అంటే.. మంత్రిదేముంది, ఆమె కుమారునిదేముంది అంతా నేనే అనే స్థాయికి వ్యవహారం చేరుకుంది. ఇదంతా ఒక ఎత్తయితే.. మహిళలు శాఖాపరమైన సమస్యతో ఆయన్ను ఆశ్రయిస్తే.. నాకేంటి అనే ధోరణి ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ఆడియో ఆయన తెరచాటు బాగోతాలకు అద్దం పట్టింది. డబ్బుదేముంది.. మరో రూపంలో తనను మెప్పించాలని ఓ ‘మధ్యవర్తి’తో సాగించిన సంభాషణ మంత్రి చుట్టూ చేరిన అనధికార వ్యక్తుల అసలు రూపం ఇట్టే అర్థమవుతోంది.
అనంతపురం సిటీ: జిల్లాలో ఓ మంత్రి వద్ద సహాయకునిగా పనిచేస్తున్న వ్యక్తి తీరు వివాదాస్పదమవుతోంది. పలు సమస్యలతో మంత్రి వద్దకు వచ్చే వారంతా అతగాడి చేతులు తడపాల్సిందే. అదే మహిళలు అయితే కాసులు ముట్టడు. తన కామవాంఛ తీర్చమంటాడు. మంత్రిని కలిసిననా చివరకు పని చేయాల్సింది తామే కాబట్టి.. తాము చెప్పినట్టు వింటే అన్నీ సాఫీగా జరిగిపోతాయంటూ నమ్మబలికి లోబరుచుకుంటున్నాడు. ఇందుకు తోటి ఉద్యోగులను పావులుగా వాడుకుంటున్నాడు. ఇతగాడి చేష్టలతో విసిగిపోయిన పలువురు మహిళలు ఆ మంత్రి గడప తొక్కడమే మానేశారు. నిస్సహాయ స్థితిలో ఉన్న మహిళల అవసరాలను ఆసరాగా చేసుకుని వారిని అన్ని విధాలా వాడుకునేందుకు కుట్రలు పన్నుతున్న ప్రబుద్ధిడి గురించి మంత్రి దృష్టికి వెళ్లినప్పటికీ.. తమ సామాజిక వర్గానికి చెందినవాడని ఉదాసీనంగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది.
♦ అర్హతలు లేకపోయినా మంత్రి వద్ద పీఏగా చలామణి అవుతున్న ఆ ఉద్యోగి వ్యవహారం గతంలో పెద్ద దుమారమే రేగింది. ఏకంగా ఛైర్మన్ స్థాయి నేతకు సలహాలు ఇచ్చే ప్రయత్నం చేసి పాలకవర్గం కోపాగ్నికి ఆ శాఖ ఉద్యోగుల ముందు అబాసుపాలయ్యాడు. ఇలా చెబుతూ పోతే అతగాడి పాపాల చిట్టా పుట్టలా పెరిగిపోతుంది. ఇటీవల సొంత శాఖకు చెందిన మహిళా ఉద్యోగి మధ్యవర్తి ద్వారా అతగాడిని ఆశ్రయించింది. సహోద్యోగితో ఫోన్‌లో ‘పీఏ’ సాగించిన ‘లైంగిక కోర్కెల’ సంభాషణ ఆడియో టేపు ఒకటి బయటకొచ్చింది. ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది.
సంభాషణ సాగిందిలా..
సన్నిహితుడు: సార్ నమస్తే. ఆ పల్లెకు చెందిన మహిళా ఉద్యోగి మీ కోసం వచ్చింది. తన పని చేసిపెట్టమని అడుగుతోంది. ఏం చేయమంటారు?
పీఏ: ఆ.. నిన్న వచ్చింది. నాతో ఏవో తన సమస్యలన్నీ చెప్పింది. పని చేసి పెట్టామప్ప..ఏం హ్యాపీనా?!
సన్నిహితుడు: ఆ.. హ్యాపీనే సార్.
పీఏ: ఇంతకీ ఏంటి ఆమె క్యారెక్టర్?
సన్నిహితుడు: మంచిదే...పాపం ఎవరూ ‘తోడు’ లేరు.
పీఏ: అదికాదయ్యా.. నేనడిగేది...! ‘ఏంటి ఆ..మె పరిస్థితి’ అని?
సన్నిహితుడు:చిన్నగా ‘పర్వాలేదు..సార్’ అంటుండగానే
పీఏ: ఏమయ్యా గట్టిగా మాట్లాడు. ఎక్కడున్నావ్
సన్నిహితుడు: జెడ్పీ క్యాంటిన్‌లో టిఫిన్‌కు వచ్చా సార్.
పీఏ: సరే అక్కడి నుంచి పక్కకు రా?
సన్నిహితుడు: వచ్చాను సార్.
పీఏ: ఏంటి ఆమె ఎలాంటిది.. పర్వాలేదా.. అని అడుగుతున్నా? గట్టిగా సమాధానం చెప్పు.
సన్నిహితుడు: భర్తతో విభేదాలొచ్చి దూరంగా ఉంటోంది.
పీఏ:ఆఆ..పర్వాలేదా?
సన్నిహితుడు: ఊ పర్లేదు సార్?
పీఏ: అంటే ఎలాంటిది అని అడుగుతున్నా?
సన్నిహితుడు: అంటే క్యారెక్టర్ గురించి అడుగుతున్నా రా?
పీఏ: అవును... డిబ్యాచ్‌లరా?
సన్నిహితుడు: క్యారెక్టర్ మరీ అంత బ్యాడ్ కాదు సార్.. భర్తకు దూరంగా ఉంటోందంట సార్!
పీఏ: అవునా...సరే ఆమె పని చేసిపెట్టాలంటే ఖర్చులుంటాయప్ప. అవెవరూ భరించరు. మేమే చేతినుంచి పెట్టుకుని చేయాలి. ఈ విషయం చెప్పావా?
సన్నిహితుడు: సరే లక్ష దాకా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. వాస్తవంగా మంత్రి, ఆమె కుమారుడిని కలవాలని చాలా ప్రయత్నించింది. వారు సమయానికి దొరకలేదు.
పీఏ: వారిని కలసినా మాకే ఆ పని అప్పగిస్తారు. వాళ్లేం డబ్బు ఇవ్వరు. ఎవరికి చెప్పినా చివరికి పని చేయాల్సింది నేనే.
సన్నిహితుడు: మీరు మంత్రి దగ్గర పీఏగా ఉన్న విషయాన్ని తెలుసుకుని మన డిపార్టు మెంటతనే కదా అని నా వద్దకు వచ్చింది. నన్నడిగితే మీకు చెప్పి మంత్రి ఇంటి వద్దకు పంపుదామనుకున్నా. మీరు మధ్యలోనే కలసి ఫోన్‌లోనే ‘పని’ చేసి పెట్టారని చెప్పింది.
పీఏ: ఇప్పుడేమంటోంది. హ్యాపీనా ఆమె...
సన్నిహితుడు: ఆ హ్యాపీనే సార్.
పీఏ: కాకపోతే ఆమె లక్ష ఇస్తానంటోంది కదా.. డబ్బు రూపంగా కాకుండా ‘మరోలా సహకరించమని’ చెప్పు.
Comments
Please login to add a commentAdd a comment