శాసనమండలిలో ప్రశ్నోత్తరాలు
జిల్లాకో క్రీడా పాఠశాల: పద్మారావు
సాక్షి, హైదరాబాద్: భవిష్యత్తులో జిల్లాకో క్రీడా పాఠశాల ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు క్రీడా శాఖ మంత్రి పద్మారావు గౌడ్ తెలిపారు. ప్రస్తుతం రంగారెడ్డి, కరీంనగర్, ఆదిలాబాద్‌లలో ఉన్న క్రీడా పాఠశాలలను దశలవారీగా అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. పాఠశాలల్లో నిర్వహిస్తున్న క్రీడా పోటీలనూ క్రీడా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించేందుకు కృషి చేస్తానని, ఇందుకోసం విద్యా మంత్రితో మాట్లాడతానని మంగళవారం శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు.
ప్రభుత్వాస్పత్రులంటే ప్రజల్లో భయం
ప్రభుత్వాసుపత్రుల్లో సరైన వైద్యం అందని పరిస్థితులు ఉన్న నేపథ్యంలో చికిత్స కోసం వెళ్తే ప్రాణం పోతుందన్న భయం పేదల్లో నెలకొందని కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దుస్థితిని అవకాశంగా చేసుకొని ప్రైవేటు ఆసుపత్రులు పేదలను దోపిడీ చేస్తున్నాయన్నారు. ఇలాంటి పరిస్థితి రాజ్యసభ సభ్యుడు ఎంఏ ఖాన్‌కే ఇటీవల ఎదురైందని కాంగ్రెస్ సభ్యుడు పొంగులేటి పేర్కొన్నారు. దీనిపై మంత్రి లక్ష్మారెడ్డి సమాధానమిస్తూ గత ప్రభుత్వాలు చేసిన నిర్లక్ష్యాన్ని తమ ప్రభుత్వం సరిదిద్దుకుంటూ వస్తోందన్నారు.
ఆలయ భూములపై చర్యలేవీ?: షబ్బీర్
రాష్ట్రంలో దేవాలయ భూములు స్వాహా అవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ విమర్శించారు. దీన్ని నియంత్రించేందుకు వెంటనే టాస్క్ఫోర్సు బృందాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. దేవాలయాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు వారి నిధుల నుంచి కొంతమొత్తాన్ని విడుదల చేసినా దేవాదాయశాఖ మాత్రం కామన్‌గుడ్ ఫండ్ నుంచి చిల్లిగవ్వ కూడా ఇవ్వటం లేదన్నా. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి స్పందిస్తూ రాష్ట్రంలో దేవాలయాల కింద 82 వేల ఎకరాల భూమి ఉన్నా అందులో పెద్ద మొత్తం కబ్జాలో ఉన్న మాట వాస్తవమేనన్నారు. ఇప్పుడు వాటిని స్వాధీనం చేసుకుంటున్నట్టు పేర్కొన్నారు.
కొత్త కమిషనరేట్ల పరిధిలో సీసీ కెమెరాలు
కొత్తగా ఏర్పడ్డ అన్ని పోలీసు కమిషనరేట్ల పరిధిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు హోంమంత్రి నాయిని ప్రకటించారు. వీటి వల్ల నేరాలు అదుపులోకి వస్తాయన్నారు. కొత్తగా ఏర్పడ్డ రాచకొండ కమిషనరేట్ ప్రధాన కార్యాలయాన్ని ఎల్బీనగర్లో ఏర్పా టు చేస్తున్నట్టు వెల్లడించారు. దాన్ని భువనగిరిలో ఏర్పాటు చేయాలని సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి కోరారు. ఇటీవల పోలీసు ఆత్మహత్యలు పెరిగినందున వారిలో ఆత్మస్థయిర్యం నింపేందుకు చర్యలు తీసుకోవాలని సభ్యులు నారదాసు, భానుప్రసాద్‌లు కోరగా ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
రైతు బజార్లన్నీ నగదు రహితం: హరీశ్
వచ్చే రెండు, మూడు వారాల్లో రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లలో నగదురహిత లావాదేవీలు ప్రారంభించనున్నట్లు మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు మంగళవారం శాసన మండలిలో ప్రకటించారు. ప్రయోగాత్మకంగా హైదరాబాద్‌లోని కూకట్పల్లి రైతు బజార్లో ఈ విధానం ప్రారంభించాక కొనుగోళ్లు పెరిగాయని, రైతులు, వినియోగదారులు దీన్ని స్వాగతించడంతో ఈ విధానాన్ని అన్ని రైతు బజార్లలో ప్రారంభించాలని నిర్ణయించామన్నారు.