minister Pankaja Munde
-
చెప్పులు మోయించిన మహిళా మంత్రి
ముంబయి: మహారాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పంకజ ముండే మరోసారి వివాదంలో చిక్కుకుని విమర్శల పాలయ్యారు. ఆమె దగ్గర పనిచేసే సిబ్బందిలో ఒకరు... పంకజ చెప్పులు మోయడం తీవ్ర దుమారాన్ని రేపింది. రాష్ట్రంలో కరవు సంభవించిన పర్భానీ జిల్లా సొన్పెత్ ప్రాంతాన్ని బుధవారం మంత్రి సందర్శించారు. అయితే ఆ సందర్భంగా పంకజ ముండే అక్కడ చెప్పులతో నడవడానికి కష్టంగా ఉందని వాటిని విడిచి ఒట్టి కాళ్లతోనే నడక సాగించారు. అనంతరం మంత్రి విడిచిన చెప్పులు ఓ సిబ్బంది చేతుల్లో పట్టుకుని మోశారు. ఈ విషయాన్ని పలు టీవీ ఛానల్స్ ఫోకస్ చేశాయి. దీంతో ప్రతిపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు ఈ విషయంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే ఈ విషయంపై మంత్రిని వివరణ కోరగా.. మీరు నా సిబ్బంది చెప్పులు మోయడమే చూశారు.. కానీ నా పాదాలకు అంటిన బురదను చూడలేక పోయారని, చెప్పులు లేకుండానే ఆ ప్రాంతంలో నడక సాగించాల్సి వచ్చిందని అన్నారు. అసలు విషయం కరవు వల్ల దెబ్బతిన్న రైతుల సమస్య అని పేర్కొంటూనే, ఆ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి కాదు.. నా వ్యక్తిగత సిబ్బంది అని మంత్రి గారు సెలవివ్వడం గమనార్హం. అయితే కాంగ్రెస్ అధికార ప్రతినిధి అల్ నస్సీర్ జకారియా మాత్రం.. ఈ ఘటన మంత్రి వ్యక్తిత్వాన్ని వెల్లడి చేసిందని, ఓ పేదవాడితో చెప్పులు మోపించిన వ్యక్తి రైతులకు, సాధారణ పౌరులకు ఏం సేవ చేస్తారని ఈ సందర్భంగా పంకజను ప్రశ్నించారు. -
మోదీ అడుగుల్లో...
- గ్రామాల దత్తత తీసుకోనున్న రాష్ట్ర శాసన సభ్యులు - ఆగస్టు 15 లోగా వివరాలు అందించాలన్న ప్రభుత్వం - వెల్లడించిన గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పంకజ ముండే ముంబై: ఎంపీలందరూ ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ‘ప్రధాన మంత్రి ఆదర్శ్ గ్రామ్ యోజన’ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్ర శాసనసభ్యులు కూడా రాష్ట్రంలోని గ్రామాలను దత్తతు తీసుకొని అభివృద్ధి చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని 289 మంది ఎమ్మెల్యేలు, 78 మంది ఎంపీలు తాము దత్తతు తీసుకోబోయే గ్రామాల వివరాలు ఆగస్టు 15 లోగా తెలియజేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కోరిందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పంకజ ముండే తెలిపారు. ‘గతేడాది ఆగస్టు 15 న ప్రధాని మోదీ ‘ప్రధాన మంత్రి ఆదర్శ్ గ్రామ్ యోజన’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రతి ఎంపీ ఓ గ్రామాన్ని దత్తతు తీసుకొని ఆదర్శ గ్రామంగా తీర్చి దిద్దాలి. కేంద్ర ప్రభుత్వ పథ కాన్ని ఆదర్శంగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం కూడా ‘ఆందార్ ఆదర్శ్ గ్రామ్ యోజన’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. రాష్ట్రంలోని ప్రతి శాసనసభ్యుడు తాము దత్తత తీసుకున్న గ్రామాలను ఆదర్శ గ్రామంగా తీర్చి దిద్దాలి. ఈ గ్రామాలన్ని రాష్ట్రంలో అభివృద్ధికి ఆదర్శమవ్వాలి’ అని పంకజ చెప్పారు. గ్రామాలను అభివృద్ధి చేస్తాం: పంకజ రాష్ట్రంలోని గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి, పట్టణాలపై ఉన్న భారాన్ని తగ్గించడమే పథకం ముఖ్య ఉద్దేశమని ముండే అన్నారు. పథకంలో భాగంగా గ్రామాల్లో నీటి వసతి, ఆరోగ్యం, మురుగు నీటి పారుదల, ఆస్పత్రులు, విద్య వసతులను అభివృద్ధి చేస్తామన్నారు. శాసన సభ్యులు గ్రామాన్ని ఎంపిక చేసుకున్న గ్రామాభివృద్ధిపై వారికి శిక్షణ ఇస్తారని చెప్పారు. గ్రామాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న సర్పంచులు, గ్రామసభ, తమ విధలు నిర్వహిస్తారన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజల వద్దకు చేరేందుకు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించేందుకు శాసన సభ్యులు కృషి చేస్తారన్నారు. ఇప్పటిదాకా గ్రామాల అభివృద్ధిపై దృష్టి సారించకపోవడం వల్ల నిధులు వృథా అయ్యాయని చెప్పారు. 2011 లెక్కల ప్రకారం రాష్ట్రంలో 43,665 గ్రామాలుండగా, 40,960 గ్రామాల్లో కనీస వసతులు అందుబాటులో లేవు. రాష్ట్రంలోని 11.23 కోట్ల జనాభాలో సుమారు 6 కోట్ల మంది ప్రజలు గ్రామాల్లో, 5 కోట్ల మంది ప్రజలు పట్టణాల్లో నివసిస్తున్నారు. రాష్ట్రంలో అధిక జనాభా గల జిల్లాల్లో థానే (9.8 శాతం) మొదటి స్థానం, తర్వాతి స్థానాల్లో పుణే (8.4 శాతం), ముంబై (8.3 శాతం) ఉన్నాయి. -
‘డుమ్మా’ కొట్టడంలో పంకజ ఫస్ట్
♦ కేబినెట్ సమావేశాలకు గైర్హాజరైన వారిలో ముందున్న మంత్రి ♦ 28 సమావేశాల్లో తొమ్మిదింటిలో గైర్హాజరు ♦ వెల్లడించిన సహ కార్యకర్త అనీల్ గల్గలీ ముంబై : రాష్ట్ర కేబినెట్ సమావేశాలకు గైర్హాజరైన వారిలో మహిళా శిశు సంక్షేమ మంత్రి పంకజ ముండే మొదటి స్థానంలో నిలిచారు. సమావేశాలకు ఎక్కువగా గైర్హాజరైన వారిలో పీడబ్ల్యూడీ మంత్రి ఏక్నాథ్ శిండే, ఆరోగ్య మంత్రి దీపక్ సావంత్, ఆర్థిక మంత్రి సుధీర్ మునుగంటివార్, సాంఘిక సంక్షేమ మంత్రి రాజ్‌కుమార్ బదోలే తదితరులు తరువాతి స్థానాల్లో ఉన్నారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, నీటిపారుదల మంత్రి బాబన్‌రావ్ లోనికర్ మాత్రమే అన్ని సమావేశాలకు హాజరయ్యారు. ఈ మేరకు ఆర్టీఐ ద్వారా సమాచారం కోరిన సామాజిక కార్యకర్త అనిల్ గల్గలీకి ప్రధాన కార్యదర్శి కార్యాలయం వివరాలు వెల్లడించింది. రాష్ట్రం ప్రభుత్వం నిర్వహించిన మొత్తం సమావేశాల వివరాలను ఆర్టీఐ ద్వారా గల్గలీ కోరారు. 2014, డిసెంబర్ 11 నుంచి 2015, జూన్ 23 వరకు మొత్తం 28 కేబినెట్ సమావేశాలు జరిగాయని గల్గలీకి ప్రజా సంబంధాల అధికారి ఎన్బీ ఖేడేకర్ వె ల్లడించారు. పూర్తి మంత్రిత్వ శాఖ ఏర్పడక ముందు ఎనిమిది సమావేశాలు జరిగాయి. మొత్తం 18 మంది మంత్రుల్లో సీఎం ఫడ్నవీస్, లోనికర్ మినహా మిగితావారు ఎదో ఒక సమావేశానికి గైర్హాజరయ్యారు. 28 సమావేశాల్లో పంకజ 9 సమావేశాలకు, ఏక్నాథ్ షిండే 7, దీపక్ సావంత్ 6, సుధీర్ మునుగంటివార్ 5, రాజ్‌కుమార్ బదోలే 5, గృహ నిర్మాణ శాఖ మంత్రి ప్రకాశ్ మెహతా 4, పర్యావరణ మంత్రి రాందాస్ కదమ్ 4, వినోద్ తావ్డే 3, రెవెన్యూ మంత్రి ఏక్నాథ్ ఖడ్సే 3, విద్యుత్ శాఖ మంత్రి చంద్రశేఖర్ బవన్కులే 3 సమావేశాలకు హజరుకాలేదు. కాగా, మంత్రులు అనుపస్థితి (హాజరుకాకపోవడం) కాకుండా సీఎం చర్యలేమైనా తీసుకున్నారా అని గల్గలీ ఆర్టీఐ ద్వారా సమాచారం కోరారు. దీనిపై తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని సీఎస్ కార్యాలయం పేర్కొంది. మంత్రులు సమావేశాలకు తరచూ గైర్హాజరైతే వారిని పదవి నుంచి తొలగించే నియమాలున్నాయా అని కూడా గల్గలీ ప్రశ్నించగా అలాంటి నిబంధనలేవీ లేవని సంబంధిత కార్యాలయం వెల్లడించింది. -
ఆధారాలుంటే విచారణకు సిద్ధం
- మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి పంకజ ముండే స్పష్టీకరణ - ప్రతిపక్షాలది రాజకీయ ప్రేరేపిత కుట్ర.. తిప్పికొడతాను - ఏం లేకున్నా ఏదో ఒకటి చూపించాలని ప్రయత్నిస్తున్నాయి - తప్పు చేసినట్లు రుజువు చేస్తే రాజీనామా - ఏసీబీ దర్యాప్తునకు సహకరిస్తా ముంబై: ప్రతిపక్షాలు తన పై అవాస్తవ ఆరోపణలు చేస్తున్నాయని, ఆధారాలు చూపిస్తే ఎలాంటి విచారణకైనా సిద్ధమని రాష్ట్ర మహిళాశిశు సంక్షేమ మంత్రి పంకజ ముండే స్పష్టం చేశారు. రూ.206 కోట్ల ‘కొనుగోళ్ల’ కుంభకోణం జరిగిందని ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలు, తాజాగా ఓ డ్యాం నిర్మాణ కాంట్రాక్టు ఇచ్చే విషయంలో మంత్రి నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపిస్తున్నాయి. దీనిపై తీవ్రంగా స్పందించిన పంకజ ముండే ప్రతిపక్షాలు చెబుతున్నవి ‘మాటల కుంభకోణాల’ని, రుజువు చూపించి మాట్లాడాలని సవాలు విసిరారు. గతవారం రోజులుగా లండన్‌లో ఉన్న మంత్రి మంగళవారం ముంబైకి చేరుకున్నారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘ప్రతిపక్షాలు రాజకీయ ప్రేరేపిత కుట్ర చేస్తున్నాయి. నేను వ్యక్తిగత కారణాలతో లండన్ వెళ్లాను. ఆరోపణలకు స్పందించేందుకు భౌతికంగా ఇక్కడ లేను కాబట్టి ప్రతిపక్షాలు ఇలా రాద్ధాతం చేస్తున్నాయి. నిరాధార ఆరోపణలు చేస్తే వాటికి బాధ్యత వహిస్తూ నేను రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. ఏ కుంభకోణం జరగకున్నా ఏదో ఒకటి జరిగిందని చూపించాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి’ అని విమర్శించారు. తప్పు చేసినట్లు రుజువైతే పదవికి రాజీనామా చేయడానికి వెనుకాడబోనని స్పష్టం చేశారు. ఫొటో దిగితే ఏదో సాయం చేసినట్లేనా..? గోపీనాథ్ ముండేకు సన్నిహితుడు, బీజేపీ కూటమి ప్రభుత్వంలో భాగస్వామి రాష్ట్రీయ సమాజ్ పక్ష్ (ఆర్ఎస్పీ) నేత రత్నాకర్ గుట్టేకు చెందిన ప్రైవేటు కంపెనీకి నిబంధనలు ఉల్లంఘించి కాంట్రాక్టు ఇచ్చారని తాజాగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై స్పందించిన పంకజ..‘రత్నాకర్ గుట్టేతో కలసి ఉన్న ఫొటోలు మీడియాలో ప్రసారం అవుతున్నాయి. గత కొన్ని నెలల క్రితమే గుట్టే ఆర్ఎస్పీలో చేరారు. ఓ కార్యక్రమంలో ఆయనను కలిశాను. ఆ ఫొటోలు అప్పటివే. ఆయనతో కలసి ఫొటో దిగాను అంటే దాని అర్థం.. నేను ఆయనకేదో ఉపకారం చేసినట్లు కాదు. ప్రాజెక్టుల ఆమోదానికి సంబంధించి సర్వ హక్కులను జిల్లా కలెక్టర్లకు అప్పగించాం. నేను ఎలాంటి నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేదు’ అని వివరించారు. ఈ సందర్భంగా ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడు శరద్‌పవార్‌తో కలసి గుటే ్ట దిగిన ఫొటోలను ఆమె మీడియా ముందుంచారు. కొత్త కాంట్రాక్టు పద్ధతి తేలేదని, ఎన్సీపీ-కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టు పద్ధతిలోనే కొనుగోలు చేశామని ఆమె స్పష్టం చేశారు. పార్టీ అండగా ఉంది విద్యాశాఖ మంత్రి వినోద్ తావడే మినహా మిగతా ఎవరూ ఆమెపై వస్తున్న ఆరోపణలను ఖండించడానికి ప్రయత్నించలేదు. ఇదే విషయాన్ని విలేకరులు పంకజను వివరణ కోరగా.. రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తనకు అండగా నిలిచారని, మొత్తం పార్టీ అంతా తన వెంట ఉందని ఆమె తెలిపారు. పంకజ విలేకరులతో మాట్లాడుతుండగానే హౌసింగ్ శాఖ మంత్రి ప్రకాశ్ మెహతా వచ్చారు. ‘ఈ విలేకరుల సమావేశానికి ముందే ఆర్థిక శాఖ మంత్రి సుధీర్ మునగంటివార్, సహకార శాఖ మంత్రి చంద్రకాంత్ పాటిల్‌తో మాట్లాడాను. పని ఉండటంతో వారు రాలేకపోయారు. వారి షెడ్యూల్‌ను చె డ గొట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే ఒక్కదానినే ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశాను. నాకు పార్టీ, కోట్ల మంది ప్రజల అండ ఉంది’ అని ఆమె చె ప్పారు. తాను, మహిళాశిశు మంత్రిత్వ శాఖ ఎలాంటి దర్యాప్తుకైనా సిద్ధంగా ఉందని, ఏసీబీ తాము సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. కొనుగోళ్లకు సంబంధించిన వివరాలను ఆ శాఖ నుంచి ఏసీబీ కోరిన విషయం తెలిసిందే. సమావేశంలో రాష్ట్రీయ సమాజ్ పక్ష్ నేత మహదేవ్ జన్కార్, పంకజ సోదరి, బీజేపీ ఎంపీ ప్రీతమ్ ముండే పాల్గొన్నారు. మీరు చేస్తే కొనుగోళ్లు.. మేం చేస్తే కుంభకోణమా..? ‘రేట్ కాంట్రాక్ట్ సిస్టమ్ ద్వారా కొనుగోళ్లు జరపి రూ.206 కోట్ల కుంభకోణం చేశారని ఎన్సీపీ, కాంగ్రెస్ ఆరోపిస్తున్నాయి. మరి 2010- 2015 వరకు దాదాపు రూ.408 కోట్ల విలువైన కొనుగోళ్లు రేట్ కాంట్రాక్ట్ సిస్టమ్ ద్వారానే జరిగాయి. వారు (కాంగ్రెస్, ఎన్సీపీ) చేస్తే కొనుగోళ్లు, అదే మేము చేస్తే కుంభకోణమా’ అని పంకజ ఎద్దేవా చేశారు. మహిళా శిశు సంక్షేమ శాఖకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తగ్గకుండా చూసుకోవడం, చిన్నారులకు అవసరమైన మేరకు పౌష్టికాహారం అందించడం కోసమే తన తపన అని ఆమె పేర్కొన్నారు. -
'ఆధారాలుంటే బయటపెట్టండి'
న్యూఢిల్లీ: పాఠశాలకు సంబంధించి కొనుగోలు చేసిన వస్తువుల విషయంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి పంకజ ముండే నోరువిప్పారు. న్యూఢిల్లీలో మీడియాతో శనివారం ఆమె మాట్లాడుతూ.. తనపై ఆరోపణలు చేసిన వారు ఆధారాలుంటే బయటపెట్టండంటూ సవాలు విసిరారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలను ఆమె ఖండించారు. వివిధ ప్రభుత్వ పాఠశాలలకు పుస్తకాలు, వాటర్ ఫిల్టర్స్ కొనుగోలు చేసే విధానంలో ప్రాథమిక విధి విధానాలను పాటించలేదని, దీని ద్వారా ఆమె 206 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడిందని ప్రతిపక్షాలు ఆరోపించిన విషయం తెలిసిందే. ఆధారాలు సమర్పిస్తే పంకజపై వచ్చిన ఆరోపణలపై చర్యలు చేపడతామని సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ చెప్పిన విషయం విదితమే. గత ఫిబ్రవరి 13న పాఠశాలల పరికరాల కోసం ఆమె మొత్తం 24 కాంట్రాక్టులకు ఆమోదం తెలిపారని, ఆ సమయంలో కనీస పద్ధతులు పాటించకుండా కుంభకోణానికి తెరలేపారని ప్రతిపక్షాలు ఆరోపించారు. అయితే, లక్ష రూపాయలు పై బడిన ప్రతి వస్తువు కొనుగోలు కోసం టెండర్లు ఖచ్చితంగా పిలవాలని తాను కఠిన నిబంధనలు విధించానని రాష్ట్ర ఆర్థికమంత్రి సుధీర్ ముంగన్ తివార్ తెలిపారు.