
'ఆధారాలుంటే బయటపెట్టండి'
న్యూఢిల్లీ: పాఠశాలకు సంబంధించి కొనుగోలు చేసిన వస్తువుల విషయంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి పంకజ ముండే నోరువిప్పారు. న్యూఢిల్లీలో మీడియాతో శనివారం ఆమె మాట్లాడుతూ.. తనపై ఆరోపణలు చేసిన వారు ఆధారాలుంటే బయటపెట్టండంటూ సవాలు విసిరారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలను ఆమె ఖండించారు. వివిధ ప్రభుత్వ పాఠశాలలకు పుస్తకాలు, వాటర్ ఫిల్టర్స్ కొనుగోలు చేసే విధానంలో ప్రాథమిక విధి విధానాలను పాటించలేదని, దీని ద్వారా ఆమె 206 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడిందని ప్రతిపక్షాలు ఆరోపించిన విషయం తెలిసిందే.
ఆధారాలు సమర్పిస్తే పంకజపై వచ్చిన ఆరోపణలపై చర్యలు చేపడతామని సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ చెప్పిన విషయం విదితమే. గత ఫిబ్రవరి 13న పాఠశాలల పరికరాల కోసం ఆమె మొత్తం 24 కాంట్రాక్టులకు ఆమోదం తెలిపారని, ఆ సమయంలో కనీస పద్ధతులు పాటించకుండా కుంభకోణానికి తెరలేపారని ప్రతిపక్షాలు ఆరోపించారు. అయితే, లక్ష రూపాయలు పై బడిన ప్రతి వస్తువు కొనుగోలు కోసం టెండర్లు ఖచ్చితంగా పిలవాలని తాను కఠిన నిబంధనలు విధించానని రాష్ట్ర ఆర్థికమంత్రి సుధీర్ ముంగన్ తివార్ తెలిపారు.