
చెప్పులు మోయించిన మహిళా మంత్రి
ముంబయి: మహారాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పంకజ ముండే మరోసారి వివాదంలో చిక్కుకుని విమర్శల పాలయ్యారు. ఆమె దగ్గర పనిచేసే సిబ్బందిలో ఒకరు... పంకజ చెప్పులు మోయడం తీవ్ర దుమారాన్ని రేపింది. రాష్ట్రంలో కరవు సంభవించిన పర్భానీ జిల్లా సొన్పెత్ ప్రాంతాన్ని బుధవారం మంత్రి సందర్శించారు. అయితే ఆ సందర్భంగా పంకజ ముండే అక్కడ చెప్పులతో నడవడానికి కష్టంగా ఉందని వాటిని విడిచి ఒట్టి కాళ్లతోనే నడక సాగించారు. అనంతరం మంత్రి విడిచిన చెప్పులు ఓ సిబ్బంది చేతుల్లో పట్టుకుని మోశారు. ఈ విషయాన్ని పలు టీవీ ఛానల్స్ ఫోకస్ చేశాయి. దీంతో ప్రతిపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు ఈ విషయంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
అయితే ఈ విషయంపై మంత్రిని వివరణ కోరగా.. మీరు నా సిబ్బంది చెప్పులు మోయడమే చూశారు.. కానీ నా పాదాలకు అంటిన బురదను చూడలేక పోయారని, చెప్పులు లేకుండానే ఆ ప్రాంతంలో నడక సాగించాల్సి వచ్చిందని అన్నారు. అసలు విషయం కరవు వల్ల దెబ్బతిన్న రైతుల సమస్య అని పేర్కొంటూనే, ఆ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి కాదు.. నా వ్యక్తిగత సిబ్బంది అని మంత్రి గారు సెలవివ్వడం గమనార్హం. అయితే కాంగ్రెస్ అధికార ప్రతినిధి అల్ నస్సీర్ జకారియా మాత్రం.. ఈ ఘటన మంత్రి వ్యక్తిత్వాన్ని వెల్లడి చేసిందని, ఓ పేదవాడితో చెప్పులు మోపించిన వ్యక్తి రైతులకు, సాధారణ పౌరులకు ఏం సేవ చేస్తారని ఈ సందర్భంగా పంకజను ప్రశ్నించారు.