- గ్రామాల దత్తత తీసుకోనున్న రాష్ట్ర శాసన సభ్యులు
- ఆగస్టు 15 లోగా వివరాలు అందించాలన్న ప్రభుత్వం
- వెల్లడించిన గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పంకజ ముండే
ముంబై: ఎంపీలందరూ ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ‘ప్రధాన మంత్రి ఆదర్శ్ గ్రామ్ యోజన’ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్ర శాసనసభ్యులు కూడా రాష్ట్రంలోని గ్రామాలను దత్తతు తీసుకొని అభివృద్ధి చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని 289 మంది ఎమ్మెల్యేలు, 78 మంది ఎంపీలు తాము దత్తతు తీసుకోబోయే గ్రామాల వివరాలు ఆగస్టు 15 లోగా తెలియజేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కోరిందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పంకజ ముండే తెలిపారు.
‘గతేడాది ఆగస్టు 15 న ప్రధాని మోదీ ‘ప్రధాన మంత్రి ఆదర్శ్ గ్రామ్ యోజన’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రతి ఎంపీ ఓ గ్రామాన్ని దత్తతు తీసుకొని ఆదర్శ గ్రామంగా తీర్చి దిద్దాలి. కేంద్ర ప్రభుత్వ పథ కాన్ని ఆదర్శంగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం కూడా ‘ఆందార్ ఆదర్శ్ గ్రామ్ యోజన’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. రాష్ట్రంలోని ప్రతి శాసనసభ్యుడు తాము దత్తత తీసుకున్న గ్రామాలను ఆదర్శ గ్రామంగా తీర్చి దిద్దాలి. ఈ గ్రామాలన్ని రాష్ట్రంలో అభివృద్ధికి ఆదర్శమవ్వాలి’ అని పంకజ చెప్పారు.
గ్రామాలను అభివృద్ధి చేస్తాం: పంకజ
రాష్ట్రంలోని గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి, పట్టణాలపై ఉన్న భారాన్ని తగ్గించడమే పథకం ముఖ్య ఉద్దేశమని ముండే అన్నారు. పథకంలో భాగంగా గ్రామాల్లో నీటి వసతి, ఆరోగ్యం, మురుగు నీటి పారుదల, ఆస్పత్రులు, విద్య వసతులను అభివృద్ధి చేస్తామన్నారు. శాసన సభ్యులు గ్రామాన్ని ఎంపిక చేసుకున్న గ్రామాభివృద్ధిపై వారికి శిక్షణ ఇస్తారని చెప్పారు. గ్రామాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న సర్పంచులు, గ్రామసభ, తమ విధలు నిర్వహిస్తారన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజల వద్దకు చేరేందుకు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించేందుకు శాసన సభ్యులు కృషి చేస్తారన్నారు.
ఇప్పటిదాకా గ్రామాల అభివృద్ధిపై దృష్టి సారించకపోవడం వల్ల నిధులు వృథా అయ్యాయని చెప్పారు. 2011 లెక్కల ప్రకారం రాష్ట్రంలో 43,665 గ్రామాలుండగా, 40,960 గ్రామాల్లో కనీస వసతులు అందుబాటులో లేవు. రాష్ట్రంలోని 11.23 కోట్ల జనాభాలో సుమారు 6 కోట్ల మంది ప్రజలు గ్రామాల్లో, 5 కోట్ల మంది ప్రజలు పట్టణాల్లో నివసిస్తున్నారు. రాష్ట్రంలో అధిక జనాభా గల జిల్లాల్లో థానే (9.8 శాతం) మొదటి స్థానం, తర్వాతి స్థానాల్లో పుణే (8.4 శాతం), ముంబై (8.3 శాతం) ఉన్నాయి.
మోదీ అడుగుల్లో...
Published Thu, Aug 6 2015 11:17 PM | Last Updated on Sun, Sep 3 2017 6:55 AM
Advertisement
Advertisement