Minister Parameshwar
-
ప్రతి జిల్లాలోనూ ఫొరెన్సిక్ ల్యాబ్‌లు
ఇక నుంచి బెంగళూరులోనే డీఎన్ఏ పరీక్షలు రాష్ట్ర హోం శాఖ మంత్రి డాక్టర్ జి.పరమేశ్వర్ బెంగళూరు: రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ ఫొరెన్సిక్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర హోం శాఖ మంత్రి డాక్టర్ జి.పరమేశ్వర్ వెల్లడించారు. సోమవారమిక్కడి మడివాళలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవలి కాలంలో నేరాల సంఖ్య పెరుగుతోందని, ఈ నేపథ్యంలో నేరస్తులను గుర్తించి వారికి శిక్ష పడేలా చేసేందుకు సాక్ష్యాల అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. ఇందుకు ఫొరెన్సిక్ ల్యాబ్‌లు ఇచ్చే నివేదికలు ఎంతైనా ఉపయుక్తంగా ఉంటాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి జిల్లాలోనూ ఫోరెన్సిక్ ల్యాబ్ ఏర్పాటుకు నిర్ణయించినట్లు చెప్పారు. ఇక డీఎన్ఏ పరీక్షల కోసం గతంలో హైదరాబాద్ లేదంటే ఢిల్లీకి వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని అయితే ఇక నుంచి బెంగళూరులోనే డీఎన్ఏ పరీక్షలను నిర్వహించే విధంగా ఫొరెన్సిక్ ల్యాబ్‌ను ఉన్నతీకరిస్తున్నట్లు మంత్రి పరమేశ్వర్ వెల్లడించారు. ప్రస్తుతం ఫొరెన్సిక్ ల్యాబ్‌లో 186 మంది నిపుణులు విధులు నిర్వర్తిస్తున్నారని, ఈ సంఖ్యను 286కు పెంచనున్నట్లు తెలిపారు. ఇదే సందర్భంలో మైసూరు జిల్లా కలెక్టర్ శిఖా పై బెదిరింపులకు పాల్పడ్డ కేసుపై మంత్రి పరమేశ్వర్ స్పందిస్తూ....‘టైస్టులనే పట్టుకునే మా పోలీసులకు మరిగౌడను పట్టుకోవడం పెద్ద విషయమేమీ కాదు, ఈ కేసులో రెండో నిందితుడిగా ఉన్న మంజునాథ్‌ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. కేసులో ప్రధాన నిందితుడైన మరిగౌడ పరారీలో ఉన్నాడన్నారు. త్వరలోనే అతన్ని కూడా పోలీసులు అరెస్ట్ చేస్తారు’ అని పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో డీజీపీ ఓం ప్రకాష్, రాష్ట్ర హోం శాఖ ప్రధాన సలహాదారు కెంపయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఆత్మస్థైర్యం కోల్పోవద్దు
బెంగళూరు: ‘పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మస్థైర్యాన్ని కోల్పోకూడదు, మీ సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది, ఏ అధికారి కూడా ఆత్మహత్యకు పాల్పడవద్దు’ అని రాష్ట్ర హోం శాఖ మంత్రి డాక్టర్ జి.పరమేశ్వర్ పోలీసులను కోరారు. బుధవారమిక్కడ తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడారు. ఎస్ఐ రూపా తంబద ఆత్మహత్యా యత్నంపై ఈ సందర్భంగా పరమేశ్వర్ స్పందించారు. ‘పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని కోరుతున్నాను. మీకు ఏవైనా సమస్యలు ఉంటే ధైర్యంగా మా దృష్టికి తీసుకురావచ్చు. వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం కచ్చితంగా ప్రయత్నిస్తుందని హామీ ఇస్తున్నాను. మీకు ఏదైనా శాఖాపరమైన సమస్యలు ఉంటే చట్టపరంగా పోరాడండి, లేదంటే ఆంతరంగిక ఫిర్యాదు సమితిలో ఫిర్యాదు చేయండి, అంతేకానీ ఆత్మహత్య వంటి నిర్ణయాలు తీసుకొని మీ కుటుంబాలను అనాధలను చేయకండి’ అని సూచించారు. నివేదిక కోరాం... ఇక ఎస్ఐ రూపా తంబద ఆత్మహత్యా యత్నం అంశానికి సంబంధించి విజయనగర ఇన్స్పెక్టర్ సంజీవ్గౌడ, రూపా మధ్య మనస్పర్థలు ఉన్నట్లు తెలిసిందని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తిస్థాయి నివేదికను అందజేయాల్సిందిగా ఇప్పటికే ఉన్నతస్థాయి అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. నివేదిక అందిన అనంతరం తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు.