‘పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మస్థైర్యాన్ని కోల్పోకూడదు, మీ సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.....
బెంగళూరు: ‘పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మస్థైర్యాన్ని కోల్పోకూడదు, మీ సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది, ఏ అధికారి కూడా ఆత్మహత్యకు పాల్పడవద్దు’ అని రాష్ట్ర హోం శాఖ మంత్రి డాక్టర్ జి.పరమేశ్వర్ పోలీసులను కోరారు. బుధవారమిక్కడ తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడారు. ఎస్‌ఐ రూపా తంబద ఆత్మహత్యా యత్నంపై ఈ సందర్భంగా పరమేశ్వర్ స్పందించారు. ‘పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని కోరుతున్నాను. మీకు ఏవైనా సమస్యలు ఉంటే ధైర్యంగా మా దృష్టికి తీసుకురావచ్చు. వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం కచ్చితంగా ప్రయత్నిస్తుందని హామీ ఇస్తున్నాను. మీకు ఏదైనా శాఖాపరమైన సమస్యలు ఉంటే చట్టపరంగా పోరాడండి, లేదంటే ఆంతరంగిక ఫిర్యాదు సమితిలో ఫిర్యాదు చేయండి, అంతేకానీ ఆత్మహత్య వంటి నిర్ణయాలు తీసుకొని మీ కుటుంబాలను అనాధలను చేయకండి’ అని సూచించారు.
నివేదిక కోరాం...
ఇక ఎస్‌ఐ రూపా తంబద ఆత్మహత్యా యత్నం అంశానికి సంబంధించి విజయనగర ఇన్‌స్పెక్టర్ సంజీవ్‌గౌడ, రూపా మధ్య మనస్పర్థలు ఉన్నట్లు తెలిసిందని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తిస్థాయి నివేదికను అందజేయాల్సిందిగా ఇప్పటికే ఉన్నతస్థాయి అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. నివేదిక అందిన అనంతరం తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు.