యువ యుగ పథకం ద్వారా యువతకు ప్రోత్సాహం
మంత్రి పరమేశ్వర్నాయక్
బళ్లారి అర్బన్ : నేటి విద్యార్థులు రేపటి బావి భారత పౌరులు, యువతకు ఉపాధి రంగంలో రాణించేందుకు యువ యుగ పథకం ద్వారా ప్రోత్సాహాన్ని అందిస్తున్నట్లు జిల్లా ఇన్చార్జ్, రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి పీటీ పరమేశ్వర్ నాయక్ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం స్థానిక విజయనగర శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయ సభాంగణంలో పోటీ పరీక్షల శిక్షణ విభాగాన్ని ప్రారంభించి మాట్లాడారు.
రాష్ట్రంలో యువ యుగ పథకం సేవలు యువతకు ఉపయోగపడేలా వీఎస్కేయూలో ఏర్పాటు చేయడం హర్షనీయమన్నారు. ఈ పథకం అమలుకు మొదట తాను ఎంతో శ్రమించి ముఖ్యమంత్రి సిద్దరామయ్య దృష్టికి తీసుకొని పోగా ఎంతో మంచి ఆలోచనతో తెలియజేయడం హర్షనీయమని తమను అభినందించినట్లు తెలిపారు. నిరుద్యోగ యువత నిర్మూలన కోసం యువ యుగ పథకం మంజూరు కోసం రూ.10 కోట్ల నిధులను సీఎం వెంటనే మంజూరు చేశారని తెలిపారు. తమ పరిధిలోని కర్ణాటక ఒకేషనల్ స్కిల్ డెవలప్మెంట్ శాఖ నుంచి రూ.90 కోట్ల నిధులతో యువత కు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేందుకు హెచ్ఆర్డీ కేంద్రాల ఏర్పాటుకు ఈ నిధులను కేటాయిస్తామన్నారు. ఈ పథకం ద్వారా హెచ్ఆర్డీ కేంద్రాల్లో తమ ప్రతిభకు తగ్గట్టుగా ప్రోత్సహించి శిక్షణ అందించి ఆయా శాఖలలో హై-క కింద ఉపాధి అవకాలను కల్పిస్తామన్నారు.
విద్యార్థి దశలో అమూల్యమైన సమయాన్ని వృదా చేయకుండా తల్లిదండ్రులు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని సకాలంలో తీర్చిదిద్దాలని తెలిపారు. బళ్లారి జిల్లా వీఎస్కేయూ అభివృద్దికి హై-క విభాగం నుంచి రూ.2.5 కోట్ల నిధులను మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం రూరల్ ఎమ్మెల్యే ఎన్వై.గోపాలకృష్ణ మాట్లాడుతూ... వీఎస్కేయూ అభివృద్ధికి ప్రొఫెసర్లు ఇచ్చిన మనవి పత్రం ప్రకారం బళ్లారి వీఎస్కేయూ అభివృద్ధితో పాటు గ్రామీణ క్రీడా మైదానాలు, తాగునీటి వ్యవస్థపై చర్చించి తాము చర్యలు తీసుకొని నెరవేరుస్తానని హామీ ఇచ్చారు.
విద్యార్థులు రాజకీయ రంగం వైపు చూడకుండా ఐఏఏస్, కేఏఎస్ పోటీ పరీక్షలు శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
కార్యక్రమంలో బుడా అధ్యక్షుడు హుమాయూన్ ఖాన్, వీఎస్కేయూ ఉపకులపతి ప్రొఫెసర్ ఎంఎస్ సుభాష్, ఉపకులపతి ప్రొఫెసర్ టీఎం.భాస్కర్, బెంగళూరుకు చెందిన ప్రొఫెసర్ ఆర్.రంగనాథ్, ప్రొఫెసర్లు ఎల్ఆర్.నాయక్, జే.సోమశేఖర్, సిండికేట్ సభ్యులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.